మనీలాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్‌లో ఆందోళన చేస్తున్న పర్యావరణ కార్యకర్తలు
సిడ్నీ నుంచి సియోల్ వరకు మనీలా నుంచి ముంబై వరకు ఇప్పుడో సమ్మె నడుస్తోంది. విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్లపై ర్యాలీలు తీస్తున్నారు. యువతులు పిల్లల్ని కనమని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకోసమో తెలుసా స్వచ్ఛమైన గాలి పీల్చడం కోసం భవిష్యత్ తరాల బాగు కోసం.. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పులపై అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ నెల 23న భారీ సదస్సు నిర్వహిస్తున్న సందర్భంలో యువతరం చేస్తున్న ప్రపంచ పర్యావరణ సమ్మె ప్రభుత్వాలను మేల్కొలుపుతుందా? భూతాపోన్నతిని అరికట్టడానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తాయా?
ఎందుకింత ఆందోళన !
మనం వేసుకున్న అంచనాలు మారిపోతున్నాయి. చేరుకోవాల్సిన లక్ష్యాలు భారమైపోతున్నాయి. భూతాపాన్ని అదుపులోకి తీసుకురావడం అంత సుల భం కాదని తెలుసు. కానీ ఎంతో కొంత అరికట్టగలమని భావించాం. అది కూడా సాధ్యం కాదేమోనన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. పచ్చటి అమెజాన్ కాలిబుగ్గయింది. ఆర్కటిక్ మంచు కరిగి నీరైంది. వడగాడ్పులకు యూరప్ వణికిపోయింది. రోజు రోజుకీ వేడెక్కిపోతున్న భూతాపాన్ని రెండు డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చేయాలని 2015లో పారిస్‌లో ప్రపంచ దేశాలు ప్రతిజ్ఞలు చేశారు. వీలైతే 1.5 డిగ్రీ లకే పరిమితం చేయాలని అనుకున్నారు. కానీ దానిని తూచ తప్పకుండా పాటించిన దేశాలను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఫలితంగా వాతావరణం అనూహ్యంగా మారిపోతోంది. 2100నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు 3డిగ్రీలసెల్సియస్‌కు చేరుకుంటాయన్న యూఎన్ అంచనాలు తారుమారయ్యే పరిస్థితు లు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌస్ వాయువులు 2017లో 1.7% పెరి గితే 2018లో 2.7% పెరి గాయి. ఫ్రాన్స్ తాజా అధ్యయనం ప్రకారం ఇదే తరహాలో గ్రీన్‌హౌస్ వాయువులు గాల్లో కలిస్తే 2100 నాటికి ఉష్ణోగ్రతలు 6.5– 7.0 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతాయని హెచ్చరిస్తున్నాయి.
వాతావరణంలో అరటిపండు
వాతావరణం క్షణానికోరంగు మారుతూ ఉండడంతో పంట దిగుబడులపై ప్రభావం పడుతోందని అందరికీ తెలిసిందే. కానీ అన్నింట్లోకి దేని మీద అధికంగా ప్రభావం పడుతోందా తెలుసా. అరటి పండు మీదట. ఇంగ్లండ్‌లోని ఎగ్జిటర్ వర్సిటీ చేసిన అధ్యయనాన్ని నేచర్ క్లైమేట్ ఛేంజ్ జర్నల్ ప్రచురించింది. దీని ప్రకారం అరటిపండ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న భారత్ సహా 10 దేశాల్లో ఇటీవల కాలంలో పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. పర్యావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి అరటి పండు కనిపించకుండా పోతుందని ఆ అధ్యయనం అంచనా వేసింది.
భారత్ చేస్తున్నదేంటి..?
భూతాపాన్ని అరికట్టడానికి మనం చేస్తున్న కృషి తక్కువేమీ కాదు. ప్రపంచం మొత్తం మీద మంచి ఫలితాలను సాధిస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. క్లైమేట్ యాక్షన్ ట్రాకర్( క్యాట్) అంచనాల ప్రకారం మొరాకో, జాంబియా గ్రీన్ హౌస్ వాయువుల్ని అరికట్టడంలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. సంప్రదాయేతర ఇంధనాన్ని వాడడంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా నిలిచింది. దానికి తగ్గట్టు ఇదే రంగాల్లో పెట్టుబడులు పెంచుతోంది. 2030 నాటికి దేశ విద్యుత్‌లో 40%సంప్రదాయేతర ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆ దిశగా భారత్ సాధిస్తున్న పురోగతి చూస్తుంటే లక్ష్యాలను అందుకుంటుందనే క్యాట్ అంచనా వేసింది. అగ్రరాజ్యం అమెరికా కల్లబొల్లి కబుర్లు చెప్పడమే తప్ప పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ఆ దేశం చివరి స్థానంలో ఉంది.
ఆమెకి పట్టుమని పదహారేళ్లు కూడా లేవు. అయితేనేం పర్యావరణంపై ఆమె చేస్తున్న పోరాటం ప్రపంచవ్యాప్తంగా యువతరాన్ని ఏకతాటి పైకి తెచ్చింది. స్వీడన్ టీన్ యాక్టవిస్ట్ గ్రేటా థెన్‌బెర్గ్ పర్యావరణ పరిరక్షణ కోసం స్కూలుకి వెళ్లడం మానేసింది. ఆమె ఇచ్చిన స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా 123 దేశాల్లో యువతీ యువకులు తరగతులు బహిష్కరించి మరీ రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీస్తున్నా రు. పర్యావరణాన్ని కాపాడకపోతే తమ భవిష్యత్ నాశనమైపోతుందంటూ నినదిస్తున్నారు.
పిల్లల్ని కనే ప్రసక్తే లేదు..
పర్యావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు భవిష్యత్ తరాలకు ఎంత చేటు తెస్తాయో యువతరంలో అవగాహన పెరిగింది. అమెరికా, కెనడాకు చెందిన కొందరు యువతీ యువకులు ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. లేకపోతే తాము పిల్లల్ని కనమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కెనడాలోని మాంట్రీల్‌లో మెక్‌గిల్ యూనివర్సిటీలో చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి ఎమ్మాలిమ్ సోషల్ మీడియాలో నో ఫ్యూచర్ నో చిల్డ్రన్ హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ఉద్యమాన్ని లేవదీశారు. ‘‘ఏ అమ్మాయికైనా అమ్మ కావాలని కోరిక ఉంటుంది. మాతృత్వం అంటే నాకెంతో అపురూపం. కానీ నా బిడ్డకు భద్రమైన జీవనం ఇవ్వలేను కాబట్టి నేను పిల్లల్ని కనదలచుకోలేదు. గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీల కంటే తక్కువకి తీసుకురావడానికి ప్రభుత్వాలు సమగ్రమైన ప్రణాళికలు తీసుకురావాలి. అప్పుడే మేము పిల్లల్ని కంటాం’’ అని ఆమె తేల్చి చెప్పేశారు. ఎమ్మాలిమ్ ఉద్యమానికి అమెరికా, కెనడాలో యువతరం నుంచి అనూహ్యమైన మద్దతు వచ్చింది. వారంతా కూడా ఆమె బాటలో నడుస్తూ పిల్లల్ని కని వారి భవిష్యత్‌ని నాశనం చేయలేమని నినదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment