
అణ్వస్త్రాలే పెను సవాలు
వాషింగ్టన్: ప్రస్తుతం ప్రపంచానికి అణ్వాయుధాలే పెను సవాలుగా మారాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘అణ్వస్త్ర రహిత ప్రపంచానికి నేను అనుకూలం. ప్రపంచానికి గ్లోబల్ వార్మింగ్ అతిపెద్ద ముప్పని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు.
కాని వాస్తవానికి అణ్వాయుధాలే ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా పరిణమించాయి’ అని ట్రంప్ న్యూజెర్సీలో మీడియాతో అన్నారు. అణ్వాయుధాలు ఉన్న రష్యా, చైనా, పాకిస్తాన్ తదితర దేశాలు వాటిని వదిలించుకోవాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ఉత్తర కొరియాపై సైనిక చర్యకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఆ దేశాధినేత కిమ్ ఏమాత్రం అనాలోచితంగా వ్యవహరించినా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.