భూమిపై రోజురోజుకూ కార్బన్‌డయాక్సైడ్ పెరిగిపోతోంది. దాన్ని తగ్గించాలంటే చెట్లు కావాలి. అసలే అడవులు వేగంగా తరిగిపోతున్నాయి. మరెలా? ఈ ఆలోచన నుంచే ‘మెకానికల్ చెట్లు’ఊపిరిపోసుకుంటున్నాయి. నిరంతరం కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుంటూ.. గాలిని శుభ్రం చేసే ఈ చెట్లను ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. మరి ఈ కృత్రిమ చెట్ల వివరాలేమిటో తెలుసుకుందామా..
– సాక్షి సెంట్రల్ డెస్క్
వాహనాలు, పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు.. ఇలా అన్ని ఇన్ని కాదు.. మనుషులకు కావాల్సిన కీలక అవసరాలన్నీ కాలుష్యాన్ని వదిలేవే. అందు లోనూ కార్బన్‌డయాక్సైడ్‌తో పెద్ద తలనొప్పి. రోజురోజుకు భూమి వేడెక్కి వాతావరణం తీవ్రమార్పులకు లోనవడానికి కారణాల్లో ఇదీ ఒకటి. భూమిపై కార్బన్‌డయాక్సైడ్ పరిమితి దాటిపోయిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వాహనాలు, పరిశ్రమలు వంటివి ఆపేసినా సరిపోదని.. వాతావరణం నుంచి కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించే చర్యలు అత్యవసరమని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన అరిజోనా స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్త క్లౌస్ లాక్నర్ కృత్రిమ ‘యంత్రపు చెట్ల (మెకానికల్ ట్రీస్)’కు రూపకల్పన చేశారు.
ఎలా పనిచేస్తాయి?
వీలైనంత తక్కువ స్థలంలో, ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకొనేలా ‘మెకానికల్’ చెట్లను రూపొందించారు. ఒక్కోటీ ఐదు అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తుతో గుండ్రంగా, ఎత్తైన టవర్లలా ఉండే ఈ చెట్లలో.. వందలకొద్దీ గుండ్రని డిస్కులు ఒకదానిపై మరొకటి పేర్చి ఉంటాయి. వాటిపై ప్రత్యేకమైన రసాయన పదార్థపు పూత ఉంటుంది. ఈ డిస్కుల మీదుగా గాలి వీచినప్పుడు అందులోని కార్బన్‌డయాక్సైడ్‌ను.. ఈ రసాయనం పీల్చుకుంటుంది. డిస్కులు కార్బన్‌డయాక్సైడ్‌తో నిండాక.. దిగువన ఉన్న బ్యారెల్‌లోకి జారిపోతాయి. అక్కడ వేడి నీటి ఆవిరిని పంపడం ద్వారా.. డిస్కులపై ఉన్న కార్బన్‌డయాక్సైడ్‌ను వేరుచేస్తారు. తర్వాత డిస్కులను మళ్లీ పైకి జరుపుతారు. అవి య«థావిధిగా కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుంటూ ఉంటాయి. ప్రతి 20–30 నిమిషాలకోసారి ఈ ప్రక్రియ జరుగుతుంది.
ఒక్కోటీ వేల చెట్లతో సమానం
కొన్నివేల మామూలు చెట్లన్నీ కలిసి పీల్చుకునేంత ఆక్సిజన్‌ను ఒక్క మెకానికల్ చెట్టు సంగ్రహిస్తుందని శాస్త్రవేత్త క్లౌస్ లాక్నర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మెకానికల్ చెట్లను ఏర్పాటు చేయడం ద్వారా గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. ఇలా గాల్లోంచి తొలగించిన కార్బన్‌డయాక్సైడ్‌ను భూమి పొరల్లో నిక్షిప్తం చేయడంగానీ.. పెట్రోల్, డీజిల్ వంటివాటిని కృత్రిమంగా తయారు చేయడానికి గానీ వీలుంటుందని వెల్లడించారు. ప్రస్తుతం అరిజోనాలో రోజుకు వెయ్యి టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకునే స్థాయిలో.. ‘మెకానికల్ చెట్ల తోట’ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment