trees growth
-
‘మెకానికల్ చెట్లు’ ఊపిరిపోసుకుంటున్నాయి!
భూమిపై రోజురోజుకూ కార్బన్డయాక్సైడ్ పెరిగిపోతోంది. దాన్ని తగ్గించాలంటే చెట్లు కావాలి. అసలే అడవులు వేగంగా తరిగిపోతున్నాయి. మరెలా? ఈ ఆలోచన నుంచే ‘మెకానికల్ చెట్లు’ఊపిరిపోసుకుంటున్నాయి. నిరంతరం కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటూ.. గాలిని శుభ్రం చేసే ఈ చెట్లను ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. మరి ఈ కృత్రిమ చెట్ల వివరాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వాహనాలు, పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు.. ఇలా అన్ని ఇన్ని కాదు.. మనుషులకు కావాల్సిన కీలక అవసరాలన్నీ కాలుష్యాన్ని వదిలేవే. అందు లోనూ కార్బన్‌డయాక్సైడ్‌తో పెద్ద తలనొప్పి. రోజురోజుకు భూమి వేడెక్కి వాతావరణం తీవ్రమార్పులకు లోనవడానికి కారణాల్లో ఇదీ ఒకటి. భూమిపై కార్బన్డయాక్సైడ్ పరిమితి దాటిపోయిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వాహనాలు, పరిశ్రమలు వంటివి ఆపేసినా సరిపోదని.. వాతావరణం నుంచి కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించే చర్యలు అత్యవసరమని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన అరిజోనా స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్త క్లౌస్ లాక్నర్ కృత్రిమ ‘యంత్రపు చెట్ల (మెకానికల్ ట్రీస్)’కు రూపకల్పన చేశారు. ఎలా పనిచేస్తాయి? వీలైనంత తక్కువ స్థలంలో, ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొనేలా ‘మెకానికల్’ చెట్లను రూపొందించారు. ఒక్కోటీ ఐదు అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తుతో గుండ్రంగా, ఎత్తైన టవర్లలా ఉండే ఈ చెట్లలో.. వందలకొద్దీ గుండ్రని డిస్కులు ఒకదానిపై మరొకటి పేర్చి ఉంటాయి. వాటిపై ప్రత్యేకమైన రసాయన పదార్థపు పూత ఉంటుంది. ఈ డిస్కుల మీదుగా గాలి వీచినప్పుడు అందులోని కార్బన్‌డయాక్సైడ్‌ను.. ఈ రసాయనం పీల్చుకుంటుంది. డిస్కులు కార్బన్‌డయాక్సైడ్‌తో నిండాక.. దిగువన ఉన్న బ్యారెల్లోకి జారిపోతాయి. అక్కడ వేడి నీటి ఆవిరిని పంపడం ద్వారా.. డిస్కులపై ఉన్న కార్బన్‌డయాక్సైడ్‌ను వేరుచేస్తారు. తర్వాత డిస్కులను మళ్లీ పైకి జరుపుతారు. అవి య«థావిధిగా కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుంటూ ఉంటాయి. ప్రతి 20–30 నిమిషాలకోసారి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఒక్కోటీ వేల చెట్లతో సమానం కొన్నివేల మామూలు చెట్లన్నీ కలిసి పీల్చుకునేంత ఆక్సిజన్‌ను ఒక్క మెకానికల్ చెట్టు సంగ్రహిస్తుందని శాస్త్రవేత్త క్లౌస్ లాక్నర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మెకానికల్ చెట్లను ఏర్పాటు చేయడం ద్వారా గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. ఇలా గాల్లోంచి తొలగించిన కార్బన్‌డయాక్సైడ్‌ను భూమి పొరల్లో నిక్షిప్తం చేయడంగానీ.. పెట్రోల్, డీజిల్ వంటివాటిని కృత్రిమంగా తయారు చేయడానికి గానీ వీలుంటుందని వెల్లడించారు. ప్రస్తుతం అరిజోనాలో రోజుకు వెయ్యి టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకునే స్థాయిలో.. ‘మెకానికల్ చెట్ల తోట’ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిపారు. -
నన్నెందుకు నిందిస్తారు!
మీ వరకేనా న్యూ ఇయర్ తీర్మానాలు? చెట్లను కాపాడతానని, చుక్క నీటిని వృథా చేయనని ఎందుకు ప్రతిజ్ఞ చెయ్యరు? డిసెంబరు 31, ఆ తరవాత జనవరి 1. నా కాల గతి ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలుగా సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు. చంద్రుడు రాత్రివేళల్లోనే తన చల్లని కిరణాలను ప్రసరిస్తున్నాడు. సృష్టి ప్రారంభం నుంచి మానవులందరికీ రెండు కళ్లు, రెండు చెవులు, రెండు చేతులు, రెండుకాళ్లు.. అన్నీ మామూలే. నవమాసాలు మోసి స్త్రీలే పిల్లల్ని కంటున్నారు. నా ప్రయాణంలో ఇవి అనునిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రకృతిలో సహజంగా ఎటువంటి మార్పు లేదు. ఇంత నిక్కచ్చిగా నేను ప్రయాణిస్తుంటే, అందరూ నన్ను నిందిస్తారెందుకో! ఏ చిన్నపాటి ప్రకృతి వైపరీత్యం వచ్చినా, ఏ మాత్రం ఆలోచించకుండా, ‘కాలమహిమ కాకపోతే...’ అంటారు. కాలంలో ఏ మార్పు వచ్చిందని ఈ మాట అంటున్నారో నాకు అర్థం కాదు. కాలచక్రం ప్రారంభమైన నాటినుంచి నేటి వరకూ సృష్టి పంచభూతాత్మకంగానే ఉంది కదా. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం.. ఇవన్నీ ఎవరి తప్పిదాల వల్ల జరుగుతున్నాయి? గాలి తనంతట తాను కలుషితం కాదుగా? నీరు తనంత తాను కలుషితం కాదుగా? ఇటువంటి కాలుష్యాలకు నేనేదో కారణం అయినట్లు, ‘కాలం కాకపోతే’ అని నన్ను నిందించవలసిన అవసరం ఏంటి? ఇవన్నీ పక్కన పెడదాం. నా ప్రయాణం ఒక సంవత్సరంలో నుంచి మరో సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే సమయంలో.. ఈ రోజు నుంచి సిగరెట్, మందు వంటి దురలవాట్లు మానేయాలి అంటూ నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి తీసుకోవడానికి నా కాలగమనానికి సంబంధం ఏంటి? ఇవన్నీ వ్యక్తిగత నిర్ణయాలు. అసలు వీరంతా సమాజం గురించి ఆలోచించరా? ‘‘నా వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగకూడదు. సమాజానికి మేలు జరగాలి. నేను వృక్షాలను పరిరక్షిస్తాను, నేటి నుంచి ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయను, హామీలను నెరవేర్చని నాయకుడిని పదవీచ్యుతుడిని చేస్తాను’’ అని ఎందుకు ప్రతిజ్ఞ చేయరు? ఇన్ని మంచి మార్పులు జరిగితేనే కదా నేను ఆరోగ్యంగా ఉండగలుగుతాను. నాకు అనారోగ్యం చేస్తే మానవ మనుగడకు ఎంత ప్రమాదమో ఒక్కరూ ఆలోచించరే. ఒక్కో చెట్టు కొట్టేస్తుంటే నా గుండెలు ఎలా పగులుతాయో ఒక్కరైనా ఆలోచించారా? మానవ తప్పిదాల వల్ల భూమాత శరీరం ఎంత వేడెక్కిపోతోందో ఆలోచించారా? ఇప్పటికైనా ‘సొంత లాభం కొంతమానుకు, పొరుగువారికి తోడుపడవోయ్’ అనే గురజాడ మాటలను ఆచరిస్తామని సంకల్పించండి. మానవ అభివృద్ధి కోసం ప్రతినబూనండి. అప్పుడు ‘కాల మహిమ’ అనండి. నా మహిమలను కాపాడండి. స్వగతం : వైజయంతి -
మొక్కలపై చెట్టంత నిర్లక్ష్యం
జిల్లాను హరితవనంగా మారుస్తామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. ఈమధ్య కాలంలో మొక్కల పెంపకం పేరుతో భారీఎత్తున నిధులు ఖర్చు చేశారు. రోడ్లకు ఇరువైపులా, అటవీప్రాంతాలు, పాఠశాలల ప్రాంగణాలు...ఇలా అవకాశమున్న అన్ని ప్రాంతాల్లోనూ మొక్కలు నాటుతున్నట్లు ప్రకటించారు. ఇకపై ఎటుచూసినా పచ్చదనమే కన్పిస్తుందని గొప్పలు చెప్పారు. వాస్తవానికి చాలా మొక్కలు నర్సరీల్లోనే ఎండిపోయాయి. నాటిన మొక్కల పరిస్థితీ అంతే. అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామం వద్దనున్న జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) నర్సరీలో మొక్కలు ఎండిన దృశ్యాలివీ. నీళ్లు లేకపోవడంతో వీటిని ఎండబెట్టాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ట్యాంకర్లతోనైనా సరఫరా చేసి సంరక్షించాలన్న స్పృహ వారికి లేకపోయింది. - జి.వీరేశ్, సాక్షి ఫొటోగ్రాఫర్