వేడి గాలులకు 22,562 మంది మృతి
న్యూఢిల్లీ: భారత దేశం నిప్పుల కొలిమిలా తయారైంది. చండప్రచండంగా వీస్తున్న వేడి గాలులకు మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. మహారాష్ట్రలోని బీడ్‌లో యోగిత అనే 12 ఏళ్ల బాలిక పదే పదే మంచి నీళ్ల కోసం ఎండలో బిందె పట్టుకొని వెళ్లడం వల్ల గుండెపోటుతో మరణించింది. తాజాగా చోటుచేసుకున్న ఈ సంఘటన దేశ ప్రజలను కలచివేసింది. ఈ ఏడాది ఇప్పటికే ఎండ వేడికి తాళలేక వందమందికి పైగా మత్యువాత పడ్డారు. అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందనే కారణంగా చాలా రాష్ట్రాలు వేడి గాలుల కారణంగా చనిపోతున్న వారి సంఖ్యను సంక్రమంగా లెక్కించడం లేదు.
అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1992 నుంచి ఎంతో మంది మత్యువాత పడుతున్న ప్రభుత్వ నివారణ చర్యలు అంతంత మాత్రమే. నాటి నుంచి నేటి వరకు వేడి గాలులకు దేశంలో 22,562 మంది మరణించారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని విపత్తు నివారణ సంస్థ స్వయంగా అంగీకరించడం గమనార్హం. ఈ 23 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా 400లకు తగ్గకుండా మత్యువాత పడ్డారు. 1992, 1994 సంవత్సరాల్లో వెయ్యి మందికిపైగా చనిపోయారు. 1995, 1998 సంవత్సరాల్లో ఈ సంఖ్యగా వెయ్యికిపైగా ఉంది. 2015 సంవత్సరంలో మాత్రం ఏకంగా 2,422 మంది మరణించారు.
గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఏట భారత్‌లో ఎండ వేడి, వేడి గాలుల తీవ్రత పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది, వాయువ్య భారత్, మధ్య భారత్ ప్రాంతాలతోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 45 మంది మరణించారు. తెలంగాణలో 66 మంది మరణించారని ఏప్రిల్ 6వ తేదీన ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 16 మంది మాత్రమే మరణించారని సవరించిన జాబితాలో పేర్కొంది.
మత్యువాతను తప్పించుకునేందుకు ఎండలోకి రావద్దని ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత సలహాలను ఇస్తోంది. రెక్కాడితేగానీ డొక్కాడని దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, కూరగాయల అమ్మకందారులు, రోడ్డును ఆశ్రయించి వ్యాపారం చేసుకునే హ్యాకర్లు రోడ్డెక్కకుండా ఉండగలరా? ఇక నిలువ నీడలోని బిచ్చగాళ్లు, అనాథలు, వద్ధుల సంగతి సరేసరి. వారు నీటపట్టున విశ్రాంతి తీసుకుంటే వారికి పూట గడవదు. ఇలాంటి వారందరికి ప్రభుత్వం సమ్మర్ షెల్టర్లను ఏర్పాటుచేసి ఆహార వసతిని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.