ఆస్తా సర్మా
వాతావరణం, ఉష్ణోగ్రత ఒకటి కానే కాదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పాఠం చెబుతోంది అస్సామీ బాలిక ఆస్తా సర్మా. నవంబర్ 21న అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయింది. దీంతో ‘ఇంతటి చలి దెబ్బకు.. ఇన్నాళ్లు భూతాపం కారణంగా భూమిపై జరిగిన నష్టమంతా ఒక్కసారిగా మటుమాయమైపోతుంది’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను తప్పుబడుతూ అస్సాంలోని జోర్హాత్ పట్టణానికి చెందిన 18 సంవత్సరాల అమ్మాయి ఆస్తా సర్మా మరో ట్వీట్ చేసింది. ‘ట్రంప్ గారూ.. నేను మీ కంటే 54 సంవత్సరాలు చిన్నదాన్ని.
ఓ మోస్తరు మార్కులతో ఇటీవలే హైస్కూలు చదువు పూర్తి చేశా. అయితే వెదర్, క్లైమెట్ ఒక్కటి కావు. మీకీ విషయాలు సరిగ్గా అర్థంకావాలంటే నేను రెండో తరగతిలో ఉన్నపుడు చదువుకున్న ఎన్‌సైక్లోపీడియా పుస్తకాన్ని మీకు పంపిస్తా. ఫొటోలతో, వర్ణనలతో సవివరంగా ఉంటుంది’ అంటూ ట్వీట్ చేసింది. ట్రంప్ తప్పును ఎత్తిచూపుతూ ఆస్తా చేసిన ట్వీట్‌కు ప్రపంచవ్యాప్తంగా 23,000 లైకులు వచ్చాయి. 5,500 మందికి పైగా రీట్వీట్లు చేశారు. అమెరికాలోని ట్విటర్ యూజర్లు తమ దేశాధినేతకు తగిన సమాధానం ఇచ్చిందంటూ ఆ బాలికను ప్రశంసించారు. అరేబియా సముద్రంపై ఉష్ణోగ్రత మార్పుల కారణంగా జరిగే దుష్ప్రభావాలపై ఆమె ఇంటర్న్‌షిప్ చేస్తానంటే ఆర్థికసాయం చేస్తామంటూ చాలా మంది దాతలు ముందుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment