
భవిష్యత్తులో భారీ వర్షాలు
ఉష్ణ మండల ప్రాంతాల్లో భవిష్యత్తులో వర్షాలు అధికంగా కురుస్తాయని నాసా తెలియజేసింది.
న్యూయార్క్: భూమిపై ఉష్ణ మండల ప్రాంతాల్లో భూతాపోన్నతి పెరగడం వల్ల ఆకాశంలో ఎల్తైన మేఘాలు తగ్గిపోతున్నాయని, పర్వవసానంగా రాను రాను వర్షాలు తగ్గి పోతాయని ఇంతకాలం శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. ఇది తప్పుడు అభిప్రాయమని ఉష్ణ మండల ప్రాంతాల్లో మున్ముందు, అంటే భవిష్యత్తులో వర్షాలు అధికంగా కురుస్తాయని నాసా తెలియజేసింది. భూతాపోన్నతి కారణంగా ఆకాశంలో చాలా ఎత్తున ఏర్పడే వర్షించే మేఘాలు తగ్గిపోతున్న విషయాన్ని గ్రహించిన శాస్త్రవేత్తలు ఆ మేఘాల్లో చోటు చేసుకుంటున్న ఉష్ణోగ్రత మార్పులను గమనించలేకపోయారని నాసా వివరించింది.
కాలిఫోర్నియాలోని నాసాకు చెందిన జెట్ ప్రపల్షన్ లాబరేటరీలో పనిచేస్తున్న డాక్టర్ హూ సూ బందం పరిశోధనల ద్వారా భవిష్యత్తులో అధిక వర్షాలు పడుతాయని తేల్చింది. తక్కువ మేఘాలు ఎక్కువ వర్షాలను ఎలా ఇస్తాయని అందరు ఆశ్చర్య పడొచ్చని, అయితే వర్షాలు మేఘాల విస్తీర్ణంపై ఆధారపడి ఉండదని, సూర్యుడి నుంచి భూగోళం పీల్చుకునే వేడి, వాతావరణంలోకి వదిలే వేడినిబట్టి ఉంటుందని డాక్టర్ హూ సూ తెలిపారు. ఆకాశంలో ఎత్తులో ఉండే మేఘాలు అధిక వేడిని గ్రహించడం వల్ల గాలిలోని తేమను వేగంగా గ్రహించి వాతావరణాన్ని చల్లబర్చేందుకు వర్షిస్తాయని ఆయన పేర్కొన్నారు.
అలాగే భూగోళంపై వర్షాలు పడిన తర్వాత చల్లబడిన వాతావరణాన్ని వెచ్చబర్చేందుకు భూమిపై ఉన్న వేడి వాతావరణం ఆకాశంలో ఎత్తుగా వెళ్లి నీటి తెమ్మరులుగా ఘనీభవిస్తుందని, మళ్లీ సూర్యుడి వేడికి అవి వర్షిస్తాయని, కాలాలను బట్టి ఈ ప్రక్రియను ఎల్లప్పుడు కొనసాగుతుందని ఆయన చెప్పారు.