కరిగినా కాపాడేస్తాం! | Scientists Slam Global Warming In Siamese Architects Annual Competition | Sakshi
Sakshi News home page

కరిగినా కాపాడేస్తాం!

Published Wed, Sep 4 2019 2:00 AM | Last Updated on Wed, Sep 4 2019 8:05 AM

Scientists Slam Global Warming In Siamese Architects Annual Competition - Sakshi

అడవులు అంతరిస్తూంటే... కోట్లకు కోట్ల మొక్కలు నాటాలి. భూగర్భ జల వనరులు ఇంకిపోతూంటే.. ఇంకుడు గుంతలతో పునరుద్ధరించుకోవాలి. మరి.. ధ్రువాల్లో మంచు కరుగుతూంటే...?  ఏం చేయాలో తెలియడం లేదు కదూ... దీనికీ ఓ ఐడియా ఉందంటున్నారు ఇండోనేసియా ఆర్కిటెక్ట్‌లు. అదేంటో చూసేయండి మరి! 

సముద్రపు అడుగుభాగంలోని నీటి ఉష్ణోగ్రత ఎంతో మీకు తెలుసా? ధ్రువ ప్రాంతాల్లోనైతే –2 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉంటుంది. ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా ఉన్నా.. అం దులోని లవణాల కారణంగా సముద్రపునీరు గడ్డకట్టదు. ఇండోనేసియా ఆర్కిటెక్ట్‌లు ప్రతిపాదిస్తున్న పథకం ప్రకారం.. మినీ మంచుముద్దల తయారీకి జలాంతర్గాములను వాడతారు. సముద్రపు అడుగు భాగంలో ఉన్న నీటిని నింపుకునే ఈ జలాంతర్గాములు ఉపరితలంపైకి వచ్చి... షట్భుజి ఆకారంలో ఉన్న నిర్మాణంలోకి వదులుతాయి.

అదే సమయంలో ఆ నీటిలోని లవణాలను కూడా తొలగిస్తారు. చుట్టూ ఉన్న చల్లటి ఉష్ణోగ్రతలు, సబ్‌మెరైన్‌ టర్బయిన్‌ ఫ్యాన్ల గాలి కారణంగా నీరు గడ్డకడుతుంది. ఇందుకు సౌరశక్తి సాయమూ తీసుకుంటారు. ఒక్కోనిర్మాణం దాదాపు 82 అడుగుల వెడ ల్పు, 16 అడుగుల మందం ఉంటుందని, ఒకదాని నిర్మాణం పూర్తయిన తరువాత జలాంతర్గామి మళ్లీ సముద్రపు అడుగుభాగం నుంచి నీరు సేకరించి మరో మంచుముద్ద తయారీని ప్రారంభిస్తుందని వారు వివరిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ మంచుముద్దలను తయారు చేస్తే.. తెల్లటి ఉపరితలం కారణంగా సూర్యుడి నుంచి వచ్చే రేడియోథార్మికత మళ్లీ అంతరిక్షంవైపు వెళ్లిపోతుందని, తద్వారా భూతాపాన్ని నివారించవచ్చని ప్రాజెక్టు లీడర్‌ ఆర్కిటెక్ట్‌ ఫారిస్‌ రజాక్‌ తెలిపారు. 

షట్భుజి ఆకారంలో...
పెట్రోలు, డీజిల్‌ విచ్చలవిడి వాడకం, అడవుల నరికివేత వంటి అనేక కారణాలతో భూమి క్రమేపీ వేడెక్కుతోందని మనకు తెలుసు. ఈ భూతాపం కారణంగా ధ్రువప్రాంతాల్లో యుగాలనాటి మంచు కొండలు కూడా ముక్కలైపోతున్నాయి. ఈ విషయం గురించి కూడా మనం చాలాసార్లు వినే ఉంటాం. భవిష్యత్‌లో సముద్రమట్టాలు పెరిగిపోకుండా... భూతాపాన్ని మన జీవితాలను ఎక్కువ నష్టపరచకుండా ఎన్నోచర్యలు చేపడుతున్నాం కూడా. అయితే,  వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చారు ఇండొనేసియా ఆర్కిటెక్ట్‌లు. జలాంతర్గాముల సాయంతో సముద్రపునీటిని మినీ మంచుఖండాలుగా మలచవచ్చని, తద్వారా ధ్రువ ప్రాంతాల్లో నష్టాన్ని కొంతమేర నివా రించవచ్చని వీరు ఇటీవలే ముగిసిన అసోసియేషన్‌ ఆఫ్‌ సియామీస్‌ ఆర్కిటెక్ట్స్‌ వార్షిక పోటీల్లో ప్రకటించారు. 

సాధ్యమేనా? 
ఇదంతా కాగితాలపై అద్భుతంగా అనిపిస్తున్నా ఆచరణకు వచ్చే సరికి అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంచు ముద్దల తయారీకి వాడే జలాంతర్గాములన్నీ ఏదో ఒక ఇంధనంతో నడవాలి కాబట్టి.. దాని ప్రభావం భూతాపోన్నతిపై ఉంటుందని వీరు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా.. ఏకకాలంలో భారీ సంఖ్యలో జలాంతర్గాములను తయారు చేసుకుని వాడటం కూడా అంత సులువైన పని కాదని చెబుతున్నారు. ఏదేమైనా రాగల ప్రమాదం నుంచి తమని తాము రక్షించుకునేందుకు ఈ ఆర్కిటెక్ట్‌లు తీసుకుంటున్న చొరవ మాత్రం స్ఫూర్తిదాయకమైనవని పలువురు శాస్త్రవేత్తలు కొనియాడారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement