షికాగోలో రైలుపట్టాలపై మంచు కరిగించేందుకు నిప్పుపెట్టిన దృశ్యం
షికాగో: భీకరస్థాయిలో విరుచుకుపడుతున్న ఆర్కిటిక్ చలి దెబ్బకు అమెరికాలో లక్షలాది ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇళ్లలోనే ఉండిపోవాలని చాలా సంస్థలు తమ ఉద్యోగులకు సమాచారమిచ్చాయి. చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు, వ్యాపార, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఇప్పటికే 2000కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎలాంటి విపత్కర వాతావరణ పరిస్థితిల్లోనైనా ఉత్తరాలను బట్వాడా చేసే ‘యూఎస్ పోస్టల్ సర్వీస్’ సైతం ఇండియానా, మిషిగాన్, ఇల్లినాయిస్‌సహా 5 రాష్ట్రాల్లో తన సేవలను అర్ధంతరంగా నిలిపేసింది. ఉత్తర డకోటా, దక్షిణ డకోటా మొదలుకొని ఓహియో దాకా (1,930 కిలోమీటర్ల పొడవునా) డజనుకుపైగా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇటీవల కాలంలో ఎన్నడూలేనంతటి కనిష్టస్థాయిలకు పడిపోయాయి.
ఆరుబయటకెళ్లి ఎక్కువసేపు మాట్లాడొద్దని, సెకన్లలోనే ఒళ్లు మొద్దుబారేలా చేసే చలివాతావరణం ఆవరించి ఉందని అమెరికన్ పౌరులను జాతీయ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. షికాగోలో ఉష్ణోగ్రత ఏకంగా మైనస్ 30 సెల్సియస్‌గా నమోదైంది. షికాగోలో మైనస్ 50కి సైతం పడిపోయే ప్రమాదముంది. అంటార్కిటికా ఖండంలోని కొన్నిచోట్ల సైతం ఇంతటి చలిలేదు. నార్త్ డకోటాలో ఉష్ణోగ్రత మైనస్ 35 డిగ్రీ ఫారన్‌హీట్‌గా నమోదైంది. కొన్ని రైళ్ల సర్వీసులనైనా నడిపేందుకు వీలుగా, మంచును కరిగించేందుకు షికాగోలో రైళ్ల పట్టాల దగ్గర సిబ్బంది మంటలు అంటించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ‘మంచు ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. ఇల్లినాయిస్, మిషిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో వాతావరణ ఎమర్జెనీ ప్రకటించారు. కెనడాలో సైతం చలి విజృంభిస్తోంది.
ట్రంప్ వ్యంగ్య ట్వీట్: అమెరికాను మంచుదుప్పటి కప్పేసిన వేళ అధ్యక్షుడు ట్రంప్ తన వాదనను వ్యంగ్యంగా తెరపైకి తెచ్చారు. భూతాపం(గ్లోబల్ వార్మింగ్) అనేదే లేదని వాదించే ట్రంప్ బుధవారం.. ‘గ్లోబల్ వార్మింగ్ ఎక్కడ? త్వరగా అమెరికాకు వచ్చెయ్. ఈ చలిలో మాకు నీ అవసరం చాలా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై జాతీయ వాతావరణ శాఖ ఘాటుగా స్పందించింది. ‘చలి తుపాన్లు వచ్చినంతమాత్రాన గ్లోబల్ వార్మింగ్ అనేది లేదని కాదు’అంటూ ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment