తొండల్లో జంబలకిడి పంబ!
గ్లోబల్ వార్మింగ్ (భూతాపోన్నతి)తో వాతావరణంలో మార్పులొస్తాయని.. సముద్రాలు ఉప్పొంగుతాయని, వ్యాధులు విజృంభిస్తాయని వింటూ ఉంటాం. కానీ... భూమి వేడెక్కితే అప్పుడెప్పుడో వచ్చిన జంబలకిడి పంబ సినిమాలో మాదిరిగా లింగమార్పిడి జరుగుతుందా? మనుషుల మాట ఎలా ఉన్నా... తొండల్లో మాత్రం ఇది వాస్తవమే నని అంటున్నారు ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా విశ్వవిద్యాలయ శాస్త్ర వేత్తలు.
జన్యుపరంగా మగజాతికి చెందిన తొండలు వాతావరణంలో వేడి ఎక్కువ కావడం వల్ల ఆడ తొండల్లా మారిపోతున్నాయని, దాదాపు 131 తొండలను పరి శీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని డాక్టర్ క్లార్ హోలెలే అంటున్నారు. లింగ మార్పిడికి గురైన తొండలు సాధా రణ తొండల కంటే ఎక్కువ సంఖ్యలో గుడ్లు పెట్టాయని, వీటి సంతానం ఉష్ణోగ్రత ఆధారంగా లింగమార్పిడికి గురయ్యేవిగా పరిణమించాయని ఆయన వివరించారు. ఆసక్తికరమైన ఈ పరిశోధన వివరాలు అంతర్జాతీయ జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి.