హరిత భవనాలపై ఆసక్తి..
విద్యుత్ పొదుపుతో పాటు గ్లోబల్ వార్మింగ్‌కూ పరిష్కారం
‘మెట్రో పొలిస్’ సదస్సులో ఆసక్తికర చర్చ
హైదరాబాద్: హరిత గృహాలు (గ్రీన్ బిల్డింగ్స్).. పర్యావరణ స్నేహశీలిగా ఉండే ఈ భవనాలపై ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విచ్చలవిడిగా వనరుల వినియోగం, మానవ తప్పిదాల మూలంగా గ్లోబల్ వార్మింగ్ రూపంలో ఎదురవుతున్న ముప్పుకు హరిత భవనాలను చక్కటి పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ భవనాల డిజైన్, నిర్మాణం సమయంలోనే కాదు వాటి నిర్వహణ, విని యోగం, నవీకరణ, కూల్చివేత సమయంలోనూ పర్యావరణానికి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్, నీరు, గాలి తదితర వనరులను అత్యంత పొదుపుగా విని యోగిస్తూ.. అన్ని అవసరాలను తీర్చగలిగేలా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో హరిత భవనాలను నిర్మిస్తున్నారు. ‘మెట్రో పొలిస్’ సదస్సు లో బుధవారం హరిత భవనాలపై జరిగిన చర్చ అందరినీ ఆలోచింపజేసింది. హరిత భవనాల తో భూతాపాన్ని నిరోధించవచ్చని వక్తలు పలు ఉదాహరణలతో వివరించారు.
సదస్సులో చైనా జాతీయ అభివృద్ధి, సంస్కరణల సంఘం ఆధ్వర్యంలో ఆ దేశంలో విద్యుత్ పొదుపుకోసం కృషి చేస్తున్న ప్రాజెక్టు డిప్యూటీ డెరైక్టర్ యెవ్ మోన మాట్లాడుతూ.. చైనాలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం ద్వారా రానున్న ఐదేళ్లలో 16 శాతం విద్యుత్‌ను పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. హరిత భవనాల సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఏసీల్లో దాదాపు 10 శాతం ఆదా అవుతుందని ఏసీల కంపెనీ ‘క్యారియర్’ ఆపరేషన్స్ డెరైక్టర్ రాహుల్ గార్గ్ పేర్కొన్నారు. కేవలం ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఆ పరిజ్ఞానాన్ని విని యోగిస్తే.. ఏడాదికి రూ. 200 కోట్ల వరకు పొదుపు చేయవచ్చన్నారు. హరిత భవనాల నిర్మాణ రంగంలో కృషిచేస్తున్న ‘జీఐబీఎస్‌ఎస్’ కంపెనీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రామ్‌దాస్ మాట్లాడుతూ థర్మల్ సిస్టమ్ కాన్సెప్ట్‌తో పనిచేసే ఏసీలను వినియోగిస్తే 70 నుంచి 80 శాతం వరకు విద్యుత్‌ను ఆదా చేయవచ్చన్నా రు. ఉత్పాదక రంగం, ఏసీల వినియోగం, వాహనాల రవాణా వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి పోయి జన జీవనంపై దుష్ర్పభావం పడుతోం దని అస్కీ అధ్యాపకుడు రాజ్‌కిరణ్ పేర్కొన్నారు.