‘స్వచ్ఛ’ ఫేస్‌బుక్‌ సంకల్పం! | Mark Zuckerberg commitment for issues solutions | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ’ ఫేస్‌బుక్‌ సంకల్పం!

Published Thu, Jan 11 2018 3:03 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

Mark Zuckerberg commitment for issues solutions - Sakshi

ఫేస్‌బుక్‌.. చిన్న పిల్లాడి నుంచి పెద్ద వయసున్న వారికి సుపరిచితమే.. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు ‘ఫ్రెండ్స్‌’తో చాటింగ్‌ చేస్తూ గడిపేస్తారు. ఫొటోలు, వీడియోలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. కొంత కాలంగా ఫేస్‌బుక్‌ దుర్వినియోగం పెరిగిపోయిందన డంలో అతిశయోక్తి లేదు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇప్పటివరకు ఖండిస్తూ వచ్చాడు. ఆయనకు కూడా అసలు విషయం బోధపడిన ట్లుంది. మనుషులను దగ్గర చేసే లక్ష్యంతో తాను సృష్టించిన ఫేస్‌బుక్‌ కాస్తా ఫేక్‌బుక్‌ అయిపోతుందేమోనని వాపోతున్నాడు. ఇక ప్రక్షాళన మొదలు పెడతానని ప్రకటించేశాడు. ఏడాదిలోగా స్వచ్ఛ ‘ఫేస్‌బుక్‌’ను అందిం చడం తన కృతనిశ్చయమని ప్రతిన బూనాడు! 

అయ్యే పనేనా..?
కొందరి స్వార్థపూరిత ఆలోచనలు అనండి.. టెక్నాలజీని దుర్వినియోగం అనండి.. ఫేస్‌బుక్‌ కేంద్రంగా అరాచకాలు పెరిగిపోతున్నాయన్న మాట వాస్తవం. ఈ విషయాన్ని సామాజిక శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరిస్తున్నారు. తప్పుడు సమాచారం.. ఫేక్‌ అకౌంట్ల ద్వారా ఇతరులపై మాటల దాడులు కూడా పెచ్చు మీరుతున్నాయి. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగులు కొందరు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. అయితే జుకర్‌బర్గ్‌ మాత్రం నిన్న మొన్నటివరకు వీటిని కొట్టిపారేసేవాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ అనుకూల వాతావరణం ఏర్పడేందుకు రష్యన్‌ ఏజెంట్ల ఫేక్‌ అకౌంట్లు కారణమన్న వాదనను జుకర్‌బర్గ్‌ మొదట తిరస్కరించినా తర్వాత పరోక్షంగా అంగీకరించాడు.

కాస్త కష్టమే..!
ప్రపంచ దేశాలకు విస్తరించిన ఫేస్‌బుక్‌ వినియోగదారుల సంఖ్య వందల కోట్లలో ఉంటుంది. మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీలు ఉపయోగిస్తున్నప్పటికీ ఫేక్‌అకౌంట్లను గుర్తించడం కష్టమే. గతేడాది కొన్ని డూప్లికేట్‌ అకౌంట్లను తొలగించినా.. ఈ పని అన్నిసార్లు, అన్ని సందర్భాల్లో సాధ్యమయ్యే పని కాదనేది నిపుణుల అభిప్రాయం. వేర్వేరు దేశాల్లోని పరస్పర వ్యతిరేక చట్టాలను అమలు చేయడం ఇంకో సవాలు. కొన్ని దేశాలపై అమెరికా విధించిన నిషేధాన్ని అమలు చేయడంలో ఫేస్‌బుక్‌ ఇప్పుడు సందిగ్ధ పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఫేస్‌ బుక్‌ను అన్ని రకాల పెడధోరణుల నుంచి రక్షించాలన్న జుకర్‌బర్గ్‌ సంకల్పం గొప్పదే అయినా ఆచరణ మాత్రం కష్టమేనని భావిస్తున్నారు.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

కొత్త ఏడాది సవాలు..
‘ఏటా ఓ కొత్త సవాలు స్వీకరించడం నాకు అలవాటు. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలని అనుకుం టాను. ప్రపంచంలో ఆత్రుత పెరిగి పోయింది. ముక్కలుగా విడిపోయింది. ఈ విషయాల్లో ఫేస్‌బుక్‌ చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. తిట్లు, ద్వేషపూరితవ్యాఖ్యల నుంచి సమాజాన్ని రక్షించడమైనా.. ఇతర దేశాలు మన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని అడ్డుకోవాలన్నా.. ఫేస్‌బుక్‌పై ఖర్చుపెట్టే టైమ్‌ వృథా కాకుండా చూడాలన్నా ఎంతో చేయాలి. ఈ చిక్కు సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడం ఈ ఏడాది సవాలుగా స్వీకరిస్తున్నా. ఈ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా నేను ఎన్నో నేర్చుకోవచ్చు. ఆయా రంగాల్లో నిపుణులను ఒక దగ్గరకు చేర్చి చర్చించి పరిష్కారాలు కనుక్కునే ప్రయత్నం చేస్తా’.
(కొత్త ఏడాది సందర్భంగా జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన సందేశ సారాంశం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement