
జెనివా: కరోనా ఎండమిక్ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసస్ హెచ్చరించారు. కరోనా వైరస్ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. సోమవారం జరిగిన డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో మాట్లాడుతూ తొమ్మిది వారాల కిందట ఒమిక్రాన్ వేరియెంట్‌ని గుర్తిస్తే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది వైరస్ బారిన పడినట్టు తమకు నివేదికలు అందాయన్నారు. 2020 ఏడాది మొత్తంగా నమోదైన కేసుల కంటే ఇది ఎక్కువని చెప్పారు. కరోనా పరిస్థితులు దేశ దేశానికి మారిపోతున్నాయని చెప్పిన టెడ్రోస్ ఈ ఏడాది చివరి నాటికల్లా కోవిడ్–19 అత్యవసర పరిస్థితి నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా కృషి చేస్తే కరోనా తుది దశకు చేరుకుంటామన్నారు.
స్వల్పంగా తగ్గిన రోజువారీ కేసులు
భారత్‌లో రోజు వారీ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 3,06,064 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 22,49,335కి యాక్టివ్ కేసులు చేరుకున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 నమో దు కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 17.03గా ఉంది.
శరద్ పవార్‌కు కరోనా
ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు కరోనా సోకింది. డాక్టర్ల సూచన ప్రకారం చికిత్స తీసుకుంటున్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పవార్ ట్వీట్ చేశారు. 81 సంవత్సరాల పవార్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ సైతం ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానికి పవార్ కృతజ్ఞతలు తెలిపారు. తనను ఇటీవల కలిసినవారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని పవార్ సూచించారు. ఇటీవలే కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ సోమవారం డిశ్చార్జయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment