పక్కనున్న ఇల్లు తగలబడుతుంటే మనది కాదు కదా అని వదిలేస్తే ఆ మంటలు మన ఇంటినీ కాల్చివేస్తాయి. ఇప్పుడు హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ఈ వాస్తవాన్నే నొక్కి చెబుతోంది. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌లో రష్యా మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం ఇంకా చల్లార నే లేదు. ఇంతలో హమాస్ రాజేసిన యుద్ధ జ్వాలలు లెబనాన్ మొదలుకొని జోర్డాన్, సిరియా, ఇరాక్‌ల వరకూ మొత్తం పశ్చిమాసియాను చుట్టుముట్టాయి. ఇదే సమయంలో ఎర్రసముద్రంలో మాటుగాసిన హౌతీ మిలిటెంట్లు అటుగా వచ్చిపోయే భారీ వాణిజ్య నౌకలే లక్ష్యంగా క్షిపణి దాడులు చేయడం ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది.
గత నవంబర్‌లో అయిదువేల కార్లను మోసుకుపోగల ‘గెలాక్సీ లీడర్’ అనే నౌకపై హెలికాప్టర్‌తో దాడిచేసి, ఆ తర్వాత దాన్ని హైజాక్ చేశారు హౌతీలు. నౌకకు బహమాస్ జెండాయే ఉన్నా అది ఇజ్రాయెల్ కోటీశ్వరుడి షిప్పింగ్ కంపెనీదని హౌతీలు పసిగట్టారు. ఆ తర్వాత ఒక ఫ్రెంచ్ యుద్ధనౌక, ఒక గ్రీక్ నౌక, నార్వే జెండాతో పోతున్న కెమికల్ ట్యాంకర్లున్న నౌక వీరి దాడులకు లక్ష్యంగా మారాయి. మధ్యలో రెండు చైనా, రష్యాల నౌకలపైనా దాడులు జరిగాయి. కానీ పొరపాటైందని హౌతీలు ప్రకటించారు.
జనవరి 15న వారు నేరుగా అమెరికా కార్గో నౌకపై దాడి చేశారు. ప్రపంచ నౌకా వాణిజ్యంలో ఇంచు మించు 17 శాతం ఎర్రసముద్రం మీదుగా జరుగుతుందని అంచనా. పర్షియా జలసంధి నుంచి యూరప్‌కు తరలిపోయే చమురు, సహజవాయు ట్యాంకులన్నీ ఎర్రసముద్రం గుండా పోవాల్సిందే. కానీ ఈ దాడుల తర్వాత అందులో చాలా భాగం తగ్గిపోయింది. అనేక సంస్థలు ఆఫ్రికా చుట్టూ తిరిగి నౌకల్ని నడపాలని నిర్ణయించాయి. ఇందువల్ల సరుకు రవాణా వ్యయం భారీగా పెరిగిపోయింది.
ఇరాన్ పెంచి పోషిస్తున్న హౌతీల ఆగడాలు అరికడతామని అమెరికా, బ్రిటన్‌లు రంగంలోకి దిగాయి. అందుకు ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ వంటివి సహకారం అందిస్తున్నాయి. హౌతీ మిలి టెంట్లు క్షిపణులతో, డ్రోన్‌లతో గత ఏడాది అక్టోబర్ 31న ఎర్రసముద్రంలోని ఇజ్రాయెల్ టూరిస్టు రిసార్ట్‌పై బాంబు దాడులు చేశారు. అయితే వాటిని ఇంటర్‌సెప్టర్ల సాయంతో ఇజ్రాయెల్ జయప్రదంగా అడ్డుకోగలిగింది. దాంతో రెండు ఈజిప్టు పట్టణాల్లో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత వారు అమెరికా ఎమ్‌క్యూ–9 రీపర్ డ్రోన్‌ను కూల్చారు.
సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సాయంతో హౌతీలు ఎడతెరిపి లేకుండా ప్రయోగిస్తున్న డ్రోన్‌లు, క్షిపణులను అమెరికా, ఇజ్రా యెల్ అడ్డుకోగలుగుతున్నాయి. కానీ ఎక్కడో తేడా కొట్టి అడపా దడపా నౌకలు బుగ్గిపాలవుతున్నాయి. గత నెల 10న అసంఖ్యా కంగా ఒకేసారి వదిలిన డ్రోన్లలో కొన్ని రక్షణ వ్యవస్థల్ని తప్పించుకెళ్లి అమెరికా యుద్ధ నౌకలోని ముగ్గురు నౌకాదళ సభ్యుల ప్రాణాలు తీశాయి. అమెరికా కూటమి దేశాలు సాగిస్తున్న దాడులు వృథా ప్రయాసగా మిగలటమే కాదు... చివరకు ప్రపంచయుద్ధానికి కూడా దారితీసే ప్రమాదం వుంది.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగేదాకా ఎర్రసముద్రం ప్రశాంతంగా ఉండబోదని హౌతీలు చేసిన ప్రకటనను ప్రపంచదేశాలు సకాలంలో పట్టించుకోవాలి. 2004 మొదలుకొని గత రెండు దశాబ్దాలుగా నిత్యమూ యుద్ధరంగంలో నిలిచిన హౌతీలను తక్కువ అంచనా వేస్తే చేజేతులా వారిని హీరోలను చేసినట్టే! యెమెన్‌లో ఇరాన్–సౌదీ అరేబియాలు సాగించిన ఆధిపత్య పోరు నుంచి పుట్టుకొచ్చిన సంస్థ ‘హౌతీ’. మొదట్లో ఒక ముఠా నాయకుడి జేబుసంస్థగా మొదలైన ఈ సంస్థ షియాల్లోని ‘జైదీ’ తెగ పరిరక్షకురాలిగా అవతరించింది. దక్షిణ, తూర్పు యెమెన్ ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న సున్నీలపై ఎడ తెగని దాడులు చేసి రాజధాని సానాను చేజిక్కించుకున్నారు.
ఈలోగా ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలు, అందుకు అమెరికా వత్తాసుగా నిలిచిన వైనాలను హౌతీలు స్వీయ ఎదుగుదలకు వాడుకున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నాశనమే తమ ధ్యేయ మనీ, వారివల్ల అన్యాయానికి గురవుతున్న ముస్లింలు ఏ వర్గంవారైనా అండగా ఉంటామని హౌతీలు తమ చర్యల ద్వారా ప్రకటిస్తున్నారు. పాలస్తీనాలో సున్నీలు, షియాలు, క్రిస్టియన్లతో సహా భిన్న వర్గాలున్నా అక్కడ సున్నీలదే మెజారిటీ. హౌతీల ఎత్తుగడలను అమెరికా సరిగానే గ్రహించింది. అందుకే జనవరి నెలనుంచి ఇజ్రాయెల్‌కు సామరస్యత, శాంతి ప్రబోధిస్తోంది. కానీ ఆ దేశం వింటే కదా!
హౌతీలు ప్రపంచంలో ఒంటరివారు కారు. వారికి ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అలాగని వారు ఇరాన్ చెప్పుచేతల్లో ఉండే అవకాశం లేదు. ఎవరైనా తమ ఎదుగు దలకు తోడ్పడే వరకే వారికి మిత్రులు. నచ్చనిది చెప్పిన మరు క్షణం వారు శత్రువుతో సమానం. ఇరాన్‌పై ఎన్ని రకాల ఆంక్షలు విధించినా నానావిధ ఎత్తుగడలతో తనకంటూ మిత్రుల్ని పోగేసుకుంటోంది. హౌతీలకు అది అండదండలు అందివ్వటం వెనక రష్యా, చైనాలు లేకపోలేదు.
అందుకే ఆ రెండు దేశాలూ చోద్యం చూస్తూ నిలబడ్డాయి. ఇప్పుడు హౌతీల దుందుడుకు తనాన్ని కట్టడి చేయాలన్నా, కనీసం వారి చర్యల తీవ్రతను తగ్గించాలన్నా ఇరాన్ సాయం అవసరం. రష్యా, చైనాల జోక్యం తప్పనిసరి. ఈ దశలో ప్రతిష్ఠకు పోతే మున్ముందు మరిన్ని పరాభవాలు తప్పవనీ, ఇది మరో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందనీ అమెరికా, మిత్రదేశాలు గుర్తించాలి.
బి.టి. గోవిందరెడ్డి
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం
Published Sun, Feb 18 2024 12:09 AM | Last Updated on Sun, Feb 18 2024 12:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment