ప్రిటోరియా: ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, అక్రమ నగదు చలామణీని అరికట్టేందుకు బ్రిక్స్ దేశాలు ఐక్య కార్యాచరణ చేపట్టాలని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) విదేశాంగ మంత్రుల సదస్సులో ఆమె మాట్లాడారు. అంతర్జాతీయ వాణిజ్యం సవాళ్లను ఎదుర్కుంటోందన్నారు. వాటిని తిప్పికొట్టడానికి, బ్రిక్స్ దేశాల దీర్ఘకాల అభివృద్ధికి ఐక్య కార్యాచరణ అవసరమన్నారు.
బ్రిక్స్ దేశాల మధ్య మరింత సహకారం పెంపొందించుకోవడానికి సదస్సు సాయపడుతుందన్నారు. సదస్సు తర్వాత మీడియాతో సుష్మా మాట్లాడుతూ.. ఉగ్రవాద వ్యతిరేక పోరుకు బ్రిక్స్ దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. సదస్సులో దేశాలు రాజకీయ, ఆర్థిక, భద్రతా రంగాలకు సంబంధించిన పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చాయని చెప్పారు. సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు.. వచ్చే నెలలో జొహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ నాయకత్వ సదస్సు విజయవంతానికి సాయపడతాయన్నారు.
బ్రిక్స్ వృద్ధి రేటు, అధిక పెట్టుబడి, వాణిజ్య వాటాతో ప్రపంచ జనాభాలో దాదాపు 42 శాతం ప్రజలను ఏకం చేస్తుందన్నారు.ఈ సదస్సులో సుష్మాతో పాటు చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా విదేశాంగ మంత్రులు వాంగ్ యీ, లిండివె సిసులు, మార్కస్ బెజెరా అబ్బాట్ గల్వాయో, సెర్జీ లావ్రోవ్ పాల్గొన్నారు. సుష్మా స్వరాజ్ ఐబీఎస్‌ఏ (భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) విదేశాంగ మంత్రుల సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు.
దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో చర్చలు
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణా్రఫ్రికా వెళ్లిన సుష్మా స్వరాజ్ ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను కలసి పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు. నైపుణ్యాభివృద్ధి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాల్లో ఇరు దేశాలు పరస్పరం మరింతగా సహకరించుకోవాలని ఇరువురు నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment