న్యూఢిల్లీ: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింప జేయడంలో మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విఫలమైందన్న ఆరోపణలను కేంద్రం తిప్పికొట్టింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ 2009లో యూపీఏ హయాంలో ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టిన భారత్ ఏకాకిగా ఉందని, ఇదే అంశంపై తాజాగా భద్రతా మండలిలోని మొత్తం 15 సభ్య దేశాల్లో 14 దేశాలు బాసటగా నిలిచాయన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొంది. శుక్రవారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ..‘ఉగ్రవాది మసూద్‌పై ఇప్పటికి నాలుగుసార్లు ఐరాసలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. 2009లో యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత్‌కు మద్దతు కరువైంది.
తాజాగా, ఇదే విషయమై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు ప్రవేశపెట్టిన తీర్మానానికి భద్రతామండలిలోని 15 దేశాల్లో 14 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. భద్రతా మండలిలోని సభ్య దేశాలు కాని బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్ మద్దతు తెలిపాయి’ అని సుష్మా అన్నారు. అజార్‌పై ఆర్థిక ఆంక్షలు విధించాలని ఫ్రాన్సు నిర్ణయించింది. ‘కశ్మీర్‌లో ఫిబ్రవరిలో 40 మంది భారత్ జవాన్ల మృతికి జైషే మొహమ్మద్ సంస్థే కారణం. ఈ సంస్థను ఐక్యరాజ్యసమితి 2001లోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా నిలుస్తాం’ అని ఫ్రాన్స్ తాజాగా ఓ ప్రకటన విడుదలచేసింది.
Comments
Please login to add a commentAdd a comment