ప్రపంచంలో 7వ అత్యంత విలువైన ‘నేషన్ బ్రాండ్’గా భారత్
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచపు 7వ అత్యంత విలువైన ‘నేషన్ బ్రాండ్’గా అవతరించింది. భారత్ బ్రాండ్ విలువ ఒకేసారి అత్యధికంగా 32 శాతం వృద్ధి చెంది 2.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక 19.7 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో అమెరికా ప్రపంచపు అత్యంత విలువైన నేషన్ బ్రాండ్‌గా అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో చైనా, జర్మనీ, యూకే, జపాన్, ఫ్రాన్స్ ఉన్నాయి. ఈ విషయాలు బ్రాండ్ ఫైనాన్స్ వార్షిక నివేదికలో వెల్లడయ్యాయి. చైనా బ్రాండ్ విలువ 1% తగ్గి 6.3 బిలియన్ డాలర్లుగా ఉంది.
నేషన్ బ్రాండ్ విలువ ప్రతి దేశంలోని అన్ని బ్రాండ్ల ఐదేళ్ల భవిష్యత్ అమ్మకాల అంచనాలపై ఆధారపడి ఉంటుంది. భారత్‌కు ‘ఇన్‌క్రిడబుల్’ ఇండియా నినాదం బాగా అనుకూలించిందని, అలాగే జర్మనీకి ఫోక్స్‌వ్యాగన్ సం క్షోభం ప్రతికూలంగా పరిణమించిందని బ్రాండ్ ఫైనాన్స్ పేర్కొంది. వ్యాపారానుకూల వాతావరణంతో అమెరికా అత్యంత విలువైన నేషన్ బ్రాండ్‌గా కొనసాగుతోందని తెలిపింది. చైనా స్టాక్ మార్కెట్ పతనం, అర్థిక వృద్ధి మందగమనం వంటి అంశాలు అమెరికాకు అనుకూలించాయని పేర్కొంది. బ్రిక్స్ దేశాల్లో కేవలం భారత్ బ్రాండ్ విలువ మాత్రమే పెరిగినట్లు వెల్లడించింది.