పదవీ బాధ్యతలు పూర్తిగా చేపట్టక ముందే అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడు పెంచారు. ‘అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం’ (అమెరికా ఫస్ట్) మంత్రాన్ని పదే పదే వల్లె వేస్తున్న ఆయన పదవీ బాధ్యతలు చేపడుతూనే చైనా పైనే కాక ఇతర దేశాలపైనా సుంకాలు విధిస్తానని ఇప్పటికే ప్రకటించారు. పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోలూ ఆంక్షల పాలయ్యే జాబితాలో ఉన్నాయి. అమెరికా వాణిజ్య, విదేశాంగ విధానంలో రానున్న పెనుమార్పుకు ఇది ఓ సూచన అనీ, రానున్న ట్రంప్ పదవీకాలంలో ఈ జాబితా మరింత పెరగడం ఖాయమనీ విశ్లేషణ.
దానిపై చర్చోపచర్చలతో వారమైనా గడవక ముందే కాబోయే అగ్రరాజ్యాధినేత మరో బాంబు పేల్చారు. ‘బ్రిక్స్’ దేశాలు గనక అమెరికా డాలర్‌కు ప్రత్యర్థిగా మరో కరెన్సీని సృష్టించే ప్రయత్నం చేస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకాలు వేస్తామంటూ హెచ్చరించారు. ఆయన తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’పై చేసిన ఈ తాజా ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాకూ, వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకూ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణానికి ఇది ప్రతీక. అంతేకాదు... ఈ హెచ్చరికే గనక అమలు అయితే, ప్రపంచ వాణిజ్యం రూపురేఖలనే మార్చివేసే అనూహ్య పరిణామం అవుతుంది.
బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌతాఫ్రికాలతో కూడిన కూటమిగా ముందు బ్రిక్స్ ఏర్పాటైంది. ఆపైన ఈజిప్ట్, యూఏఈ, ఇథియోపియా, ఇరాన్‌లు సైతం ఆ బృందంలో చేరాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా డాలర్ సాగిస్తున్న గుత్తాధిపత్యానికి ముకుతాడు వేయాలనేది కొంతకాలంగా బ్రిక్స్ దేశాల్లో కొన్నిటి అభిప్రాయం. డాలర్‌ను రాజకీయ అస్త్రంగా వాడకుండా నిరోధించగల ప్రత్యామ్నాయ అంతర్జాతీయ చెల్లింపుల విధానం అవసరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అక్టోబర్‌లో ప్రస్తావించడం గమనార్హం.
బ్రిక్స్ దేశాలు డాలర్ స్థానంలో మరో కరెన్సీకి గనక మద్దతునిస్తే మొత్తం కథ మారిపోతుంది. అయితే, డాలర్ నుంచి పక్కకు జరగడం వల్ల అమెరికాతో, ఇతర పాశ్చాత్య దేశాలతో సంబంధాలు దెబ్బతిని దారుణ పర్యవసానాలుంటాయని మరికొన్ని బ్రిక్స్ దేశాల భయం. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా హెచ్చరిక వెలువడింది. ప్రతీకారంగా అమెరికా 100 శాతం సుంకం వేస్తే, సరుకుల ధరలు పెరిగిపోతాయి. ప్రపంచ వాణిజ్య ప్రవాహాలు అతలాకుతలమవుతాయి.
నిజానికి, విదేశీ దిగుమతులపై కఠినంగా సుంకాలు విధించి, అమెరికా ఉత్పత్తులకు కాపు కాస్తానని వాగ్దానం చేయడం కూడా తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి దోహదపడిందని విస్మరించలేం. ‘అమెరికా ఫస్ట్’ ఆర్థిక విధానానికి అనుగుణంగానే ట్రంప్ తాజా కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. తద్వారా ప్రపంచ వాణిజ్యంలో మార్పులతో అమెరికా ఆర్థిక సార్వభౌమాధికారం పునఃప్రతిష్ఠితమవుతుందనేది ఆయన వ్యూహం. ఇప్పుడీ సుంకాల పర్వం మొదలైతే, అది చివరకు ప్రపంచ వాణిజ్య యుద్ధంగా పరిణమిస్తుంది.
ఈ సుంకాలన్నీ అమెరికా ప్రయోజనాల్ని కాపాడేందుకు సాహసోపేత నిర్ణయంగా కనిపించవచ్చు కానీ, వాటి తక్షణ ప్రభావం పడేది అమెరికా వినియోగదారులు, వ్యాపారాల మీదనే. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వ్యావసాయిక ఉత్పత్తులు సహా రోజు వారీ అవసరాలైన అనేక సరుకుల ధరలు పెరుగుతాయి. ఇతర దేశాల విడిభాగాలపై ఆధారపడినందు వల్ల అమెరికా వ్యాపార సంస్థలు చేసుకొనే దిగుమతులపై భారం పడుతుంది. ఆ సంస్థల లాభాలు తగ్గుతాయి. అమెరికా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌లో పోటీపడలేకపోతాయి.
అమెరికాను అప్పుల నుంచి బయటపడేసేందుకు ట్రంప్ మాత్రం మిత్రదేశాలతోనూ కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడకపోవచ్చు. వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు తమ ఆదాయానికి అమెరికాపై అతిగా ఆధారపడుతుంటాయి. ఇక, ఎగుమతులపై ఎక్కువగా నడిచే బ్రెజిల్, సౌతాఫ్రికా ఆర్థిక వ్యవస్థలూ మందగిస్తాయి. కొత్త సుంకాల బాధిత దేశాలు గనక ప్రతిచర్యలకు ఉపక్రమిస్తే పరిస్థితి దిగజారుతుంది. గతంలో ఈ తరహా వాణిజ్య వివాదాలు తెలిసినవే.
వాటిని నివారించడానికే అమెరికా సైతం అనేక అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు అంగీకరించింది. ఇప్పుడీ సుంకాలతో వాటికి అర్థం లేకుండా పోతుంది. దౌత్య పర్యవసానాలూ తప్పవు. అక్రమ వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా లాంటివి అరికట్టడానికి పొరుగు దేశాలపై సుంకాలు పనికొస్తాయని ట్రంప్ టీమ్ చెబుతున్నా, ఆశించిన ఫలితాలు దేవుడెరుగు... ఉద్రిక్తతలు పెరిగి, దేశాలతో సంబంధాలు, దీర్ఘకాలిక సహకారం దెబ్బతింటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ వాణిజ్య యుద్ధంతో మరింత అనిశ్చితిలో పడుతుంది.
ఈ ప్రతిపాదిత సుంకాలను బూచిగా చూపి, బ్రిక్స్ సహా ఇతర దేశాలనూ చర్చలకు రప్పించడమే అమెరికా ధ్యేయమైతే ఫరవా లేదు. అలా కాని పక్షంలో అనేక దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయ అన్వేషణను ముమ్మరం చేయవచ్చు. ట్రంప్ కఠిన వైఖరితో వర్ధమాన దేశాలు, అలాగే బ్రిక్ సభ్యదేశాలు మరింత దగ్గరవుతాయి. అది చివరకు అగ్రరాజ్యానికే నష్టం. అయితే, ప్రపంచమంతా వ్యతిరేకించినా సరే తాను అనుకున్నదే చేయడం ట్రంప్ నైజం.
పర్యావరణం, వాణిజ్యం, సైనిక దండయాత్రలపై గతంలో ఆయన చేసిందదే. తాత్కాలికంగా ఎన్నికల్లో ఒక వర్గం ఓట్ల కోసం పెద్ద పెద్ద మాటలు చెప్పడం బాగుంటుంది. వాటిని ఆచరణలో పెట్టాలన్నప్పుడు దీర్ఘకాలిక పర్యవసానాల్ని ఆలోచించకపోతే కష్టమే. అమెరికా కొత్త ప్రెసిడెంట్ అది గ్రహించి, ఆచితూచి వ్యవహరించాలి. కానీ, ఆకస్మిక, అనూహ్య నిర్ణయాలకే పేరుబడ్డ ట్రంప్ నుంచి అంతటి ఆలోచన ఆశించగలమా అన్నది ప్రశ్న. అనాలోచితంగా వ్యవహరిస్తే, అది అమెరికాకే కాదు... యావత్ ప్రపంచానికీ తంటా!
సుంకాల బెదిరింపు
Published Tue, Dec 3 2024 3:56 AM | Last Updated on Tue, Dec 3 2024 3:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment