అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి
వాషింగ్టన్: పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోలపై ప్రకటించిన 25 శాతం టారిఫ్ పెంపు శనివారం నుంచే అమలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్‌లు విధించే కెనడా, మెక్సికో వస్తువుల జాబితాలో చమురును చేర్చాలా వద్దా అనేది కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్యే ఆయిల్ ధర సరిగ్గా ఉందని భావిస్తే టారిఫ్ ఉండదని చెప్పారు.
కెనడా, మెక్సికోలపై టారిఫ్ విధింపునకు ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాల నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువన్నారు. ఈ రెండు దేశాలతో అమెరికా వాణిజ్యం భారీ లోటు ఉందని చెప్పారు. వాణిజ్యం విషయంలో ఈ రెండూ అమెరికాతో చాలా అన్యాయంగా వ్యవహరించాయన్నారు. ఇవి ఎగుమతి చేసే వస్తువులు ఆయిల్, కలప వంటి వాటి అవసరం తమకు లేదన్నారు. ప్రస్తుతం ఏడాదికి కెనడాకు 175 బిలియన్ డాలర్లు, మెక్సికోకు 300 బిలియన్ డాలర్ల వరకు అమెరికా సబ్సిడీల రూపంలో అందిస్తోందని ట్రంప్ వివరించారు.
చైనా పైనా టారిఫ్
ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన డ్రగ్‌ను తమ దేశంలోకి దొంగచాటుగా పంపుతున్న చైనా వస్తువులపైనా టారిఫ్‌లు విధించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ‘ఫెంటానిల్ కారణంగా వేలాదిగా అమెరికన్లు చనిపోతున్నారు. ఇందుకు బదులుగా చైనా టారిఫ్‌తో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది. ఈ విషయంలో స్పష్టతతో ఉన్నాం’అని ఆయన అన్నారు.
బ్రిక్స్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్
అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్‌కు బదులుగా ప్రత్యామ్నాయం తీసుకురావాలనుకుంటే తీవ్ర చర్యలు తప్పవని బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి పరిస్థితే వస్తే సభ్యదేశాలపై వంద శాతం టారిఫ్ తప్పదన్నారు. అమెరికాకు బదులు మరో దేశాన్ని చూసుకోవాలని సలహా ఇచ్చారు. ‘ఇప్పటి వరకు చూస్తూ ఊరుకున్నాం, ఇకపై సహించేది లేద’అంటూ సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ‘కొత్తగా బ్రిక్స్ కరెన్సీని తేవడం లేదా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీకి మద్దతివ్వడం వంటివి మానుకోవాలి. అలా చేస్తే 100 శాతం టారిఫ్‌లు తప్పవు. అమెరికాలో ఉత్పత్తుల విక్రయానికి గుడ్ బై చెప్పుకోవాల్సిందే’అన్నారు. గత డిసెంబర్‌లోనూ బ్రిక్స్‌కు ట్రంప్ ఇటువంటి హెచ్చరికే చేశారు. అయితే, డాలర్ రహిత బ్రిక్స్ దేశాల వాణిజ్యానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనా లేదని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. బ్రిక్స్‌లో రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్ దేశాలకు సభ్యత్వముంది.
Comments
Please login to add a commentAdd a comment