త్వరలో బ్రిక్స్ దేశాలతో ‘కార్మిక’ ఒప్పందాలు | Union Minister Dattatreya BRICS countries with Labor agreements | Sakshi
Sakshi News home page

త్వరలో బ్రిక్స్ దేశాలతో ‘కార్మిక’ ఒప్పందాలు

Published Fri, Jul 29 2016 2:16 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

త్వరలో బ్రిక్స్ దేశాలతో ‘కార్మిక’ ఒప్పందాలు

కేంద్ర మంత్రి దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: బ్రిక్స్ దేశాలతో కార్మిక సంబంధాలను పటిష్టపర్చుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు పలు ఒప్పందాలకు సిద్ధమవుతోంది. వలస కార్మికులకు ఉపాధి, సామాజిక భద్రత, సంక్షేమం కోసం త్వరలో బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బ్రిక్స్ ఎంప్లాయీమెంట్ వర్కింగ్ గ్రూపు(బీఈడబ్ల్యూజీ) సమావేశాలు బుధ, గురువారాల్లో హైదరాబాద్‌లో జరిగాయి.

ఈ సమావేశాల విశేషాలను ఆయన గురువారం సాయంత్రం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీఈడబ్ల్యూజీ తొలి సమావేశాలు భారతదేశం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించడం విశేషమన్నారు. సమ్మిళిత అభివృద్ధి కోసం బ్రిక్స్ దేశాల్లో ఉపాధి సృష్టి, కార్మికుల సామాజిక భద్రతపై పరస్పర అవగాహన ఒప్పందం, కార్మిక శిక్షణ సంస్థల అనుసంధానం అనే మూడు అంశాలపై ఆ దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారని తెలిపారు.

ఈ చర్చల ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా వచ్చే సెప్టెంబర్‌లో ఆగ్రాలో జరగనున్న బ్రిక్స్ దేశాల కార్మిక, ఉపాధి కల్పన మంత్రుల సమావేశంలో వాటితో ఒప్పందాలు కుదుర్చుకుంటామని మంత్రి చెప్పారు. అభివృద్ధి చెందిన జీ-20 దేశాలు పరస్పరం సహకరించుకుంటున్న విధంగా ‘బ్రిక్స్’ దేశాలు సైతం ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. దేశ యువజన జనాభా 80 కోట్ల వరకు ఉందని, నైపుణ్యాభివృద్ధి ద్వారా వీరందరికీ దేశ, విదేశాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు.

10 మంది, అంతకు మించిన  సంఖ్యలో కార్మికులతో నడుస్తున్న దుకాణాలు, వ్యాపార సంస్థలను ఏడాదిలో 365 రోజులూ రాత్రింబవళ్లు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ ‘షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాన్ని’ తీసుకొచ్చామన్నారు. భద్రత, ఇతర సౌకర్యాలు కల్పించి రాత్రివేళల్లో మహిళలకు ఉపాధి కల్పించవచ్చని దత్తాత్రేయ చెప్పారు. ఈ చట్టాన్ని అమలు చేయాలా? వద్దా? అనేది దుకాణాలు, వ్యాపార సంస్థల ఇష్టమన్నారు. ఈ చట్టంతో విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement