ఇటీవల విదేశీ ప్రయాణానికి డిమాండ్ బాగా పెరుగుతోంది. కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడం.. వివిధ దేశాలు పర్యాటకులను ఆకర్షించడానికి ప్యాకేజీలను ప్రకటిస్తుండటంతో ప్రయాణీకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెల్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి 50,710 మంది ప్రయాణించారు.
2021–22 ఆరు నెలల కాలంలో ప్రయాణించిన 12,930 మందితో పోలిస్తే విదేశీ ప్రయాణీకుల సంఖ్యలో 292 శాతం వృద్ధి నమోదైందని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెల్ల కాలంలో ఈ రెండు విమానాశ్రయాల నుంచి 411 విమాన సర్వీసులు నడవగా అంతకుముందు ఏడాది కేవలం 139 సర్వీసులు మాత్రమే నడిచాయి. రాష్ట్రంనుంచి ఇలా విదేశీ ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతుండటంతో సర్వీసుల సంఖ్య పెంచడానికి ఎయిర్‌లైన్స్ సంస్థలూ ముందుకొస్తున్నాయి.
కోవిడ్ ముందున్న పరిస్థితికంటే మెరుగు
మరోవైపు.. ఏపీలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య కోవిడ్ ముందున్న పరిస్థితి కంటే మెరుగైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెల్ల కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రయాణీకుల సంఖ్యలో 90.93 శాతం వృద్ధి నమోదైంది. 2021–22లో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి 11,91,326 మంది ప్రయాణిస్తే ఈ ఏడాది ఆర్నెల్ల కాలంలో ఏకంగా 22,74,641 మంది ప్రయాణించారు. రానున్న కాలంలో సర్వీసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రయాణీకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
చదవండి: ట్రెండ్ మారింది.. పెట్రోల్, డీజల్,గ్యాస్ కాదు కొత్త తరం కార్లు వస్తున్నాయ్!
Comments
Please login to add a commentAdd a comment