పెరుగుతున్న ‘ఫారెన్‌ లిక్కర్‌’పై మోజు.. | People Drinking More Foreign Liquor In Nizamabad District | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న ‘ఫారెన్‌ లిక్కర్‌’పై మోజు..

Published Fri, Dec 4 2020 8:45 AM | Last Updated on Fri, Dec 4 2020 8:45 AM

People Drinking More Foreign Liquor In Nizamabad District - Sakshi

విదేశీ మద్యంపై మనోళ్లు మనసు పారేసుకుంటున్నారు. ‘ఫారెన్‌ లిక్కర్‌’పై మోజు పెంచుకుంటున్నారు. ఫలితంగా జిల్లాలో విదేశీ మద్యం వినియోగం పెరుగుతోంది. దేశీయ ప్రీమియం బ్రాండ్లే కాదు, ఖరీదైన ఫారెన్‌ స్కాచ్‌ను సేవించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. హైదరాబాద్‌ వంటి మహా నగరాలు, గోవా వంటి అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాల్లోనే ఎక్కువగా వినియోగించే ఈ ఫారెన్‌ లిక్కర్‌ ఇప్పుడు జిల్లాలోనూ అమ్ముడు పోతుండడం గమనార్హం. 

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో విదేశీ మద్యం విక్రయాలు పెరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. గత మూడు నెలల్లో ఈ ఫారెన్‌ స్కాచ్‌ అమ్మకాలు సుమారు పది నుంచి 20 శాతం పెరిగినట్లు ఆబ్కారీశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జిల్లాలో 90 కేసుల విదేశీ మద్యం అమ్మకాలు జరగగా, అది అక్టోబర్‌ మాసాంతానికి 110 కేసులకు పెరిగింది. గత నెల నవంబర్‌ మాసానికి ఏకంగా 122 కేసుల విదేశీ మద్యం అమ్ముడు పోయినట్లు తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ అధికారులు పేర్కొంటున్నారు. 

రూ.5 వేల నుంచి రూ.20 వేల దాకా.. 
గతంలో ఒకటీ, రెండు మద్యం షాపుల నుంచి మాత్రమే ఫారెన్‌ లిక్కర్‌ ఇండెంట్‌ ఉండేదని, అది కూడా ప్రతి నెలా ఉండేది కాదని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మాత్రం ప్రతి నెలా ఈ ఫారెన్‌ లిక్కర్‌ ఇండెంట్‌ ఉంటోందని మాక్లూర్‌లోని ఐఎంఎల్‌ డిపో మెనేజర్‌ జె.వెంకటస్వామి ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. ఈ ఫారెన్‌ లిక్కర్‌ ఫుల్‌ బాటిల్‌ ధర రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం తమ డిపోలో సుమారు 54 బ్రాండ్ల విదేశీ మద్యం నిల్వలున్నాయని, సుమారు 30 బ్రాండ్లే ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని డిపో అధికారులు తెలిపారు. దేశీయ మద్యం కంపెనీలే ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసిన మద్యాన్ని దిగుమతి చేసుకుని ఐఎంఎల్‌ డిపోలకు సరఫరా చేస్తున్నాయని వారు చెబుతున్నారు.  

గతంలో ఫారెన్‌ నుంచి వచ్చేవారు తెస్తేనే.. 
ఉపాధి కోసం జిల్లా నుంచి గల్ఫ్‌ దేశాలకు అధికంగా వెళ్లారు. వారు తిరిగి వచ్చే సమయంలో అక్కడి నుంచి ఒకటీ, రెండు మద్యం బాటిళ్లు తెచ్చేవారు. ఈ విదేశీ మద్యాన్ని బంధువులు, అత్యంత సన్నిహితులతో మాత్రమే సేవించే వా రు. ఇలా విదేశాల నుంచి వచ్చిన వారి వద్ద మాత్రమే గతంలో ఫారెన్‌ ‘సరుకు’ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారి పోయింది. ఆ విదేశీ బ్రాండ్లన్నీ జిల్లా లోని వైన్సుల్లో అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఫారెన్‌ స్కాచ్‌ వినియోగదారులు పెరగడానికి కారణమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇటీవలి కాలంలో ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే లిక్కర్‌ ‘సిట్టింగ్‌’లు సాధారణమై పోయాయి. పెళ్లిళ్లలోనూ మందు ప్రియుల కోసం ‘ప్రత్యేక’ ఏర్పాట్లు చేస్తున్నారు. కాస్త సంపన్నుల ఇళ్లలో శుభకార్యాలకు సాధారణ ఖరీదైన లిక్కర్‌తో పాటు ఈ ఫారెన్‌ స్కాచ్‌ను అతిథులకు అందించడం స్టేటస్‌ సింబల్‌గా మారి పోయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement