
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింది. ఈ మహా కుంభమేళాకు 15 లక్షల మందికి పైగా విదేశీ పర్యాటకులు హాజరవుతారని, వారి కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రత్యేక టెంట్ సిటీని సిద్ధం చేసిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మీడియాకు తెలిపారు. ఈ టెంట్ సిటీలో ఆయుర్వేదం, యోగా, పంచకర్మ వంటి వైద్య సదుపాయాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు.
ప్రయాగ్‌రాజ్(Prayagraj)లోని నాగవాసుకి ప్రాంతంలోని సెక్టార్ 7లో 10 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించిన భారతీయ సాంస్కృతిక వారసత్వ కేంద్రం ‘కళాగ్రామ్’ను ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వివరాలను తెలిపారు. మహా కుంభసమ్మేళనం ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవమని, ఇది వైవిధ్యభరిత భారతదేశ ఐక్యతను ప్రపంచానికి తెలియజేస్తుందన్నారు. మహాకుంభమేళాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించేలా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ఆయన అన్నారు.
2025 మహా కుంభ్‌లో కళాగ్రామం ప్రధాన ఆకర్షణగా ఉంటుందని, ఇక్కడ నాలుగు ధామాల వేదిక ప్రదర్శన, 12 జ్యోతిర్లింగాల మహా ద్వారం, నిరంతర కుంభ ప్రదర్శన ఉంటాయన్నారు. వివిధ రకాల సాంస్కృతిక వైవిధ్యం(Cultural diversity) ఏడు ప్రాంతీయ సంస్కృతి ప్రాంగణాలలో ప్రదర్శితమవుతాయని షెఖావత్ అన్నారు. 230 మందికి పైగా కళాకారులు భారతదేశ విశిష్ఠతను కళాగ్రామంలో ప్రదర్శించనున్నారని తెలిపారు. ఇక్కడ వివిధ రాష్ట్రాల సంప్రదాయ ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయన్నారు. 14,630కు పైగా కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మహా కుంభమేళా(Kumbh Mela)కు వచ్చే భక్తులు అయోధ్య, కాశీ, మధుర తదితర ప్రదేశాలను సందర్శించేందుకు విమాన ప్రయాణ ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కళాగ్రామం భారతీయ జానపద కళ, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే శక్తివంతమైన వేదికగా నిలుస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: మహాకుంభ్‌కు వింత బాబాలు.. షాకవుతున్న జనం