
సమస్తీపూర్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఈ మహోత్సవానికి ఇంకా కొద్దిరోజులే మిగిలివుండటంతో చాలామందిలో కుంభమేళాకు ఇప్పటికైనా వెళ్లాలన్న ఆలోచన తలెత్తింది. దీంతో ఏ వాహనం దొరికితో ఆ వాహనంలో కుంభమేళాకు చేరుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా రైళ్లలో ప్రయాగ్ రాజ్‌కు చేరుకోవాలని పలువురు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో బీహార్‌లోని రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. రైల్లో కూర్చొనేందుకు స్థలం దొరకకపోవడంతో ప్రయాణికులు రైలుపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.
ప్రయాగ్‌రాజ్‌లో కుంభస్నానానికి వెళుతున్న యాత్రికులు రైలులో ఎలాగైనా ఎక్కాలనే ఆతృతలో స్వతంత్ర సేనాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులోని అన్ని ఏసీ కోచ్‌ల అద్దాలను బద్దలు కొట్టారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన నవాడా స్టేషన్‌లో జరిగింది. ఈ రైలులో ప్రయాణిస్తున్నవారు తెలిపిన వివరాల ప్రకారం జయనగర్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు లెక్కకుమించినంతమంది ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే జనరల్ కంపార్ట్‌మెంట్ మొదలుకొని ఏసీ కోచ్ వరకూ దేనీలోని కాలు మోపేందుకు కూడా స్థలం లేకపోవడంతో స్టేషన్‌లోని ప్రయాణికుల్లో అసహనం మొదలయ్యింది.
బయట స్టేషన్‌లో ఉన్న జనాన్ని చూసిన రైలులోని వారు కోచ్ తలుపులను మూసివేశారు. దీంతో ముధుబని స్టేషన్‌లో రైలు కోసం వేచిచూస్తున్న ప్రయాణికులు ఏసీ కోచ్ అద్దాలను బద్దలుకొట్టారు. ఆ సమయంలో రైల్వే పోలీసులు అక్కడే ఉన్నా వారు ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటన నేపధ్యంలో రైలు 25 నిముషాల పాటు నవాడా స్టేషన్‌లో నిలిచిపోయింది.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: మహిళలకు నెలకు రూ. 3000.. సీఎం ప్రకటన