Mahakumbh-2025: ఈ బావిలో అదృశ్య ‘సరస్వతి’ ప్రవాహం | Mahakumbh-2025 Invisible Saraswati Flows in this Well | Sakshi
Sakshi News home page

Mahakumbh-2025: ఈ బావిలో అదృశ్య ‘సరస్వతి’ ప్రవాహం

Published Sat, Feb 1 2025 7:53 AM | Last Updated on Sat, Feb 1 2025 7:54 AM

Mahakumbh-2025 Invisible Saraswati Flows in this Well

ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు మనదేశం నుంచి కాకుండా విదేశాల నుండి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారంతా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే ఇక్కడి పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. వీటిలో ‘సరస్వతి బావి’ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది.  

ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమున, అదృశ్య సరస్వతి(Invisible Saraswati) నదుల త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. త్రివేణి సంగమానికి కొద్ది దూరంలోని సరస్వతి బావి ఇక్కడికి వచ్చే భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ సరస్వతి మాత జలాన్ని నేరుగా దర్శనం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

ప్రయాగ్‌రాజ్ కోటలో కనిపించే ఈ సరస్వతి బావి.. సరస్వతి నదికి రహస్య వనరు అని పండితులు చెబుతుంటారు. ఈ బావి నుంచి ఊరుతున్న నీటి ప్రవాహం నేరుగా త్రివేణి(Triveni) సంగమానికి అనుసంధానమై ఉంది. 2016లో శాస్త్రవేత్తలు, పరిశోధకులు సాగించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. ఈ సరస్వతి బావికి ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్న సుబేదార్ మేజర్ రామ్ నారాయణ్ పాండే మాట్లాడుతూ ఇక్కడి నీటి ఊట బావి ఆకారంలో ఉన్నందున దీనికి సరస్వతి బావి అనే పేరు వచ్చిందన్నారు. సరస్వతి నది మానా గ్రామంలో ఉద్భవించిందని చెబుతుంటారు.

పురాణాలలోని వివరాల ప్రకారం మహర్షి వేద వ్యాసుడు(Maharishi Veda Vyas) చెబుతుండగా గణేశుడు 18 పురాణాలను  రాస్తున్నాడు. అయితే అదే సమయంలో సరస్వతి నది ప్రవాహ ధ్వని కారణంగా గణేశునికి వినికిడి సమస్య ఏర్పడిందట. దీంతో సరస్వతి మాత తన నీటి ప్రవాహాన్ని పాతాళం వైపు ప్రవహించాలని ఆదేశించిందట. సరస్వతి ప్రవాహం ప్రయాగ్‌రాజ్ చేరుకున్న సమయంలో విష్ణువు  ఆ నీటిని సంగమంలో విలీనం చేయమని సరస్వతి మాతను కోరాడట. దీనికి సర్వస్వతి మాత సమ్మతించిందట. మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తులు సరస్వతి బావిని తప్పకుండా సందర్శిస్తుంటారు.

ఇది  కూడా చదవండి: Delhi Elections: ఆప్‌కు భారీ షాక్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement