న్యూఢిల్లీ: ఆల్ట్ న్యూస్ ఆధ్వర్యంలోని ప్రావ్దా మీడియాకు విదేశాల నుంచి రూ.2 లక్షల మేర విరాళాలు అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ డబ్బు జమ చేసిన మొబైల్ ఫోన్ నంబర్, ఐపీ అడ్రస్‌లు అన్నీ థాయ్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, మనామా, హాలండ్, సింగపూర్, అమెరికా,, ఇంగ్లాండ్, సౌదీఅరేబియా, స్వీడన్, యూఏఈ, కెనడా, స్విట్జర్లాండ్, పాకిస్తాన్, సిరియా దేశాలకు చెందినవని దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. మొత్తం రూ.2,31,933 ప్రావ్దా మీడియాకు చేరిందని తెలిపారు.
జుబైర్ అరెస్ట్ అనంతరం అతడికి మద్దతుగా వచ్చిన ట్వీట్లను విశ్లేషించగా ఎక్కువ భాగం యూఏఈ, బహ్రెయిన్, కువాయిట్, పాకిస్తాన్ వంటి దేశాలవేనని గుర్తించామన్నారు. ఈ మేరకు మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడైన జుబైర్ 2018లో హిందూ దేవతపై చేసిన అభ్యంతరకర ట్వీట్‌పై జూన్ 27వ తేదీన ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జుబైర్ పోలీస్ కస్టడీ శనివారంతో ముగియడంతో పోలీసులు ఢిల్లీ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ సర్వారియా ఎదుట హాజరుపరిచారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. అయితే, కోర్టు తీర్పు ప్రతి అందకముందే జుబైర్ బెయిల్ పిటిషన్ తిరస్కరించినట్లు, కస్టడీకి అనుమతించినట్లు పోలీసులు మీడియాకు లీకులివ్వడం అవమానకరమని ఆయన తరఫు లాయర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment