సాక్షి, వరంగల్: వరంగల్‌లో విదేశీ దంపతుల శిశువు దత్తత వ్యవహారంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. హనుమకొండలోని శిశువిహార్‌కు చేరేంత వరకు చలాకీగా ఉన్న ఏడు నెలల పాప.. చివరికి మత్యుఒడికి చేరుకుంది. గురువారం ఉదయం పిల్లల డాక్టర్ నవీన్ వద్ద వైద్యపరీక్షలు చేస్తే అంతా సాఫీగానే ఉన్నా.. గురువారం రాత్రితోపాటు శుక్రవారం ఉదయం పాపకు పలుచటి విరేచనాలు కావడంతో మందులు ఇచ్చినా తగ్గలేదు.
ఆస్పత్రికి తీసుకెళ్లినా గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచింది. అయితే ఇది శిశువిహార్ సిబ్బంది నిర్లక్ష్యమా లేదా దీని వెనుక కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా అనేది పోలీసులు తేల్చాల్సిన అవసరముంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విదేశీ దంపతుల అక్రమ దత్తత కేసు ఇంకా విచారణ ఆరంభ దశలో ఉండగానే ఆ పాప చనిపోవడంతో అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి.
ఏడు నెలల పాటు వారి వద్ద బాగానే ఉన్న పాప.. శిశువిహార్‌కు రాగానే చనిపోవడం వెనుక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో ముఖ్య రాజకీయ నేతల ఒత్తిడి ఉండడం కూడా అనుమానాలను రేపుతోంది. ఇప్పటికే జేజే యాక్ట్ 81 సెక్షన్ కింద అక్రమ దత్తత వ్యవహారంలో అమెరికాలో స్థిరపడిన కొంపల్లి వాసి కరీమ్‌విరాణి, అమెరికా సిటిజన్ అయిన అశామావిరాణితో పాటు వరంగల్‌కు చెందిన రషీదాభాను భోజని, అమ్యన్‌అలీ భోజానిపై కేసు నమోదైంది.
ఆ 36 గంటల్లో ఏం జరిగిందంటే..
ఏడు నెలల పాపను బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వరంగల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ వసుధ, జిల్లా బాలల సంరక్షణ విభాగంలో పనిచేసే ఎన్‌ఐసీ పీఓ సరిత హనుమకొండలోని శిశు విహార్‌లో చేర్పించారు. అయితే, గురువారం రాత్రి 10.30 గంటలకు పాపకు పలుచటి విరేచనాలు కావడంతో అక్కడ విధుల్లో ఉన్న ఏఎన్‌ఎం పౌడర్ కలిపి తాగించడంతో 12 గంటలకు పడుకుంది. మళ్లీ శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మళ్లీ పలుచటి విరేచనాలు కావడంతో మెడిసిన్ ఇవ్వడంతో పడుకుంది.
అప్పటివరకు విధుల్లో ఉన్న ఏఎన్‌ఎం 8.30 గంటలకు వెళ్లిపోగా.. 9.30 గంటలకు మరో ఏఎన్‌ఎం విధుల్లో చేరింది. అప్పటికే ఆ పాపను పరిశీలించగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా కనిపించడంతో గవర్నమెంట్ మెటర్నిటీ ఆస్పత్రి (జీఎంహెచ్)కు తీసుకెళ్లారు. అక్కడినుంచి 10.30 గంటల వరకు ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఇది 174 సీఆర్‌పీసీ (అసహజ మరణం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ తల్లి కన్నబిడ్డనో.. పాపం.. చివరికి అనాథగా మారిన ఆ పాపకు బల్దియా సిబ్బంది అంత్యక్రియలు జరిపారు.
అనుమానాలెన్నో.. తేల్చాల్సినవెన్నో?
► కేసు నమోదైన 48 గంటల్లోనే అనారోగ్యంతో పాప మృతి చెందడంపై అనుమానాలు ఉన్నాయి.
►విదేశీ దంపతుల కారాకు దరఖాస్తు చేసుకున్న ఇన్‌కంట్రీ అడాప్షన్ నుంచి విత్ డ్రా ఎందుకయ్యారు అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. అదే సమయంలో వీరిపై అక్రమ దత్తత కింద మట్టెవాడ ఠాణాలో కేసు నమోదైంది.
► ఆ పాప అనారోగ్యంతో బాధపడుతుంటే విరాణి దంపతులు ఎందుకు దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపారన్నది తేల్చాల్సి ఉంది.
► ఈ పాప దత్తత విషయంలో ఢిల్లీ నుంచి వరంగల్ వరకు కారా, సారా అధికారులనుంచి ఎందుకు ఒత్తిడి తెచ్చారన్నది తేల్చాల్సి ఉంది.
► అసలు వీళ్లకు నిజంగా సంతానం ఉన్నారా లేదా ఒకవేళ లేకుంటే ఆపా ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకొని కారా ద్వారా శిశు విహార్‌లో ఉంటున్న ఏ పాపనైనా దత్తత తీసుకుంటే ప్రొసీజర్ ప్రకారం ఉండేది కదా. అసలు ఈ పాపనే ఎందుకు దత్తత తీసుకున్నారు అన్నది అంతుచిక్కని ప్రశ్నగా
ఉంది.
► ఇప్పటికే భోజాని దంపతులకు పాప ఇచ్చినట్లు చెబుతున్న మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే రాణితోపాటు కృష్ణవేణిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఆ పాప జాడ తెలుస్తుంది.
► అన్నింటికీ మూలమైన ఈ పాప తల్లిదండ్రుల ఆచూకీ దొరుకుతుందా.. లేదా దీని వెనుక ఉన్న అక్రమ రవాణా ముఠా మూలాలను వెలుగులోకి తెస్తారా.. లేదా పాప చనిపోయిందని కేసు పట్టించుకోకుండా ఉంటారా అన్నది ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
పాప కేసును వెలుగులోకి తెచ్చిన సాక్షి
పాప అక్రమ దత్తత విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. పాప అడాప్షన్ విషయంలో ఉన్న లొసుగులు.. పాపను ఎవరు ఇచ్చారు.. మేడ్చల్ జిల్లానుంచి ఇక్కడికి ఉన్న లింకులు ఏమిటీ విషయాలను ‘సాక్షి’లో ఎక్స్‌క్లూజివ్‌గా ఇవ్వగా స్పందించిన పోలీస్, శిశు సంక్షేమ అధికారులు విచారణ జరిపి మరిన్ని విషయాలు రాబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment