
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల గమనాన్ని ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులు నిర్దేశించనున్నట్లు పలువురు నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. అయితే మరోపక్క రుతు పవనాల కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశపు మినిట్స్‌ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.
వడ్డీ రేట్ల పెంపు
ధరలు అదుపు చేసేందుకు పలు కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధానాల అమలుకు మొగ్గుచూపాయి. ఫలితంగా గత వారంలో సెన్సెక్స్ 2,943 పాయింట్లు, నిఫ్టీ 908 పాయింట్లు చొప్పున క్షీణించాయి. గడిచిన రెండేళ్లలో ఒకవారంలో సూచీలు ఈ స్థాయిలో పతనాన్ని చవిచూడటం ఇదే తొలిసారి.
‘‘గడిచిన వారంలో సూచీలు ఐదున్నర శాతానికి పైగా క్షీణించడంతో షార్ట్‌కవరింగ్‌కు వీలున్నప్పటికీ ట్రెండ్ బలహీనంగా ఉంది. ఆర్థిక మందగమన భయాలతో ఈక్విటీ మార్కెట్లు మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది. నిఫ్టీ 15,360 స్థాయిని నిలుపుకోగలిగితే తప్ప మార్కెట్ దిద్దుబా టు ఆగదు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 15,183 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 14,900 వద్ద మద్దతు లభించొచ్చు’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యష్ షా తెలిపారు.
విదేశీ గణాంకాలు
1–5 ఏళ్ల కాలానికి రుణాల ప్రామాణిక రేటును చైనా ఈ నెల 20న ప్రకటించనుంది. కోవిడ్–19 షాక్ తదుపరి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు బ్యాంక్ ఆఫ్ జపాన్ పే ర్కొంది. దీంతో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇటీవల ఆర్‌బీఐ, యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, స్విస్ నేషనల్ బ్యాంక్ తదితరాలు వడ్డీ రేట్ల పెంపుతోపాటు కఠిన పరపతి విధానాలకు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. దీంతో బాండ్ల ఈల్డ్స్ బలపడుతుండటంతో పెట్టుబడులు స్టాక్స్ నుంచి రుణ సెక్యూరిటీలవైపుమళ్లుతున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
రుతు పవనాలు ప్రభావం
ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా వేశారు. అయితే నైరుతి రుతు పవనాలు ప్రవేశించినా, వాటి విస్తరణ ఆశించిన విధంగా లేకపోవడం ప్రతికూల ప్రభావం చూపుతోంది. సకాలంలో వర్షాలు కురవకపోతే ద్రవ్యోల్బణ ధీర్ఘకాలం కొనసాగడంతో పాటు పెట్టుబడులు మందగించవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ
భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. ఈ జూన్‌లో ఇప్పటి వరకు రూ.31,430 కోట్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 2022 ఆరంభం నుంచి మొత్తంగా రూ.1.98 లక్షల కోట్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తరలిపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వంటి అంశాలే ఎఫ్‌పీఐల అమ్మకాలకు ప్రధాన కారణమని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment