కరోనా సంక్షోభం: 16 ఏళ్ల తర్వాత భారత్‌లో కీలకమార్పు | World Stands With India Amid Covid Situation | Sakshi
Sakshi News home page

కరోనా సంక్షోభం తెచ్చిన కీలక మార్పు.. 16ఏళ్ళ తర్వాత భారత్‌..

Published Sat, May 1 2021 12:55 AM | Last Updated on Sat, May 1 2021 8:53 AM

World Stands With India Amid Covid Situation - Sakshi

శుక్రవారం అమెరికా నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకున్న సహాయ సామాగ్రి   

సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది దేశంలో ప్రవేశించిన కరోనా మహమ్మారి ఈ ఏడాది సెకండ్‌ వేవ్‌లో తన తీవ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో ప్రతీరోజు 3 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఒక్కసారిగా చికిత్స పొందాల్సిన రోగుల సంఖ్య లక్షల్లో పెరిగిపోవడంతో ఆసుపత్రులు ఆక్సిజన్, మందులు మరియు వైద్య పరికరాల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో దేశ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. కనీసం అందాల్సిన ఆక్సిజన్‌ సరైన సమయంలో దొరకని పరిస్థితుల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత 16ఏళ్ళుగా భారత్‌ అవలంబిస్తున్న ఒక కీలక విధానాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన సహాయాన్ని విదేశాల నుంచి తీసుకోవడం తప్ప ఇతర మార్గమేదీ కేంద్రప్రభుత్వం ముందు లేకుండా పోయింది. దీంతో 16 సంవత్సరాల తరువాత విదేశీ సహాయం పొందే విధానంలో భారత్‌ పెద్ద మార్పు చేసింది. ఈ మార్పు తరువాత విదేశాల నుంచి విరాళాలు, సహాయాన్ని స్వీకరించడం మొదలైంది. అంతేగాక చైనా నుంచి వైద్య పరికరాలు కొనేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విదేశీ సహాయం పొందడంలో రెండు పెద్ద మార్పులు ప్రస్తుతం కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొరుగుదేశమైన చైనా నుంచి ఆక్సిజన్‌ సంబంధ పరికారాలతో పాటు, ఔషదాలను తీసుకోవడంలో ఇప్పుడు భారత్‌కు ఎలాంటి సమస్య లేదు. అదే సమయంలో ప్రస్తుతం దేశంలో ఉన్న పరిణామాల నేపథ్యంలో సహాయం అందించేందుకు పాకిస్తాన్‌ సైతం ముందుకొచ్చింది. అయితే పాకిస్తాన్‌ సహాయానికి సంబంధించినంతవరకు, ఈ విషయంలో భారత్‌ ఎటువంటి నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదు.

ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించే మందులను నేరుగా విదేశీ ఏజెన్సీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయగలవని, ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం అడ్డుపడే పరిస్థితిలేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత్‌ అభివృద్ధి చెందుతోందని, శక్తివంతమైన దేశంగా ఆత్మనిర్భర భారత్‌ ఇమేజ్‌ని ఇతర దేశాలకు తెలియచేసేందుకు 16 ఏళ్ళ క్రితం 2004లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఎ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా విదేశీ వనరుల నుంచి గ్రాంట్లు, సహాయం తీసుకోరాదని నిర్ణయించింది. అంతకుముందు ఉత్తరకాశి భూకంపం(1991), లాతూర్‌ భూకంపం (1993), గుజరాత్‌ భూకంపం(2001), బెంగాల్‌ తుఫాను (2002), బిహార్‌ వరదలు (2004) సమయంలో భారత్‌ విదేశీ ప్రభుత్వాల సహాయాన్ని అంగీకరించింది. అయితే 2004 డిసెంబర్‌ నెలలో వచ్చిన సునామీ సమయంలో ఈ పరిస్థితిని తామే ఎదుర్కోగలమని నమ్ముతున్నామని, అవసరమైతే సహాయం తీసుకుంటామని అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రకటించారు. మన్మోహన్‌ చేసిన ఈ ప్రకటన భారతదేశ విపత్తు సహాయ విధానంలో కీలక ఘట్టంగా అభివర్ణించుకోవచ్చు. ఈ నిర్ణయంతో వచ్చిన విధానాన్ని , ఆ తరువాత వచ్చిన విపత్తుల సమయంలో భారత్‌ అనుసరించింది.

2005లో కశ్మీర్‌ భూకంపం, 2013లో సంభవించిన కేదార్‌నాథ్‌ విషాదం, 2014లో కశ్మీర్‌ వరదలు వచ్చినప్పుడు సైతం విదేశీ సహాయాన్ని కోరేందుకు కేంద్రప్రభుత్వం నిరాకరించింది.  ఆ తరువాత 2018లో వచ్చిన కేరళ వరదల సమయంలోనూ భారత్‌ విదేశాల నుంచి ఎటువంటి సహాయాన్ని అంగీకరించలేదు. కేరళ విపత్తుకు రూ.700 కోట్లు ఆర్థిక సహాయం అందించేందుకు యూఏఈ ముందుకొచ్చిందని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి తెలపగా, కేంద్రప్రభుత్వం విపత్తు ఉపశమనం, పునరావాస అవసరాలను తామే తీర్చుతామని తెలిపింది. కానీ యూఏఈ అందిస్తామన్న ఆర్థిక సహాయాన్ని తీసుకొనేందుకు మాత్రం కేంద్రప్రభుత్వం నిరాకరించింది. కానీ కేరళ విపత్తు జరిగిన మూడేళ్ళ అనంతరం దేశంలో పరిస్థితులు కరోనా దెబ్బకి ఒక్కసారిగా మారిపోయాయి. గతేడాది కరోనా సంక్రమణతో మొదలైన ఆర్థిక సవాళ్ళకు తోడు ఈ ఏడాది సెకండ్‌ వేవ్‌తో వైద్య సవాళ్ళు ఒక్కసారిగా ఎక్కువ య్యాయి.

దేశంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య పెరిగిపోవడం, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పతనమౌతున్న వైద్య వ్యవస్థను అత్యవసరంగా నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో 16ఏళ్ళ క్రితం తీసుకున్న కీలక విధానాన్ని పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ప్రస్తుతం దేశంలో భయాందోళనలు, దయనీయ పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రజలను మహమ్మారి నుం చి కాపాడేందుకు భారతదేశానికి సహాయం చేయడానికి దాదాపు 40 దేశాలు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం అమెరికా, యుకే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, స్వీడన్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఫిన్లాండ్, స్విట్జర్లాం డ్, బెల్జియం, రుమేనియా, లక్జెంబర్గ్, పోర్చుగల్, భూటాన్,సింగపూర్, సౌదీ అరేబియా, హాంకాంగ్, థాయ్‌లాండ్, నార్వే, ఇటలీ, యూఏఈ దేశాలు భారత్‌కు వైద్య సహాయం పంపుతున్నాయి.

విదేశాల నుంచి భారత్‌కు అందనున్న వైద్య సహాయం.. 
ఆక్సిజన్‌ – ఆక్సిజన్‌ కాన్సన్ట్రేటర్స్‌.. 
బ్రిటన్‌ నుంచి వచ్చిన రెండో స్టాక్‌లో 120 ఆక్సిజన్‌ కాన్సన్ట్రేటర్స్‌ 
అమెరికా నుంచి 1700 ఆక్సిజన్‌ కాన్సన్ట్రేటర్స్, 1100 సిలిండర్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి యూనిట్లు 
ఫ్రాన్స్‌ నుంచి 5 లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ కంటైనర్లు రానున్నాయి. దీంతో రోజుకి 10వేల మందికి ఆక్సిజన్‌ అందించవచ్చు. 
ఐర్లాండ్‌ 700 ఆక్సిజన్‌ కాన్సన్ట్రేటర్స్‌  
రుమేనియా 80 ఆక్సిజన్‌ కాన్సన్ట్రేటర్స్, 75 ఆక్సిజన్‌ సిలిండర్లు 
జర్మనీ మూడు నెలల కోసం మొబైల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి కర్మాగారాన్ని పంపిస్తోంది.  
పోర్చుగల్‌ నుండి 20,000 లీటర్ల ఆక్సిజన్‌ 
సౌదీ అరేబియా నుంచి 250 ఆక్సిజన్‌ కాన్సన్ట్రేటర్స్, 4 క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లు, 80 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ 
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి 6 క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లు 
హాంకాంగ్‌ నుంచి 800 ఆక్సిజన్‌ కాన్సన్ట్రేటర్స్‌  
థాయ్‌లాండ్‌ నుంచి 4 క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు 
రష్యా నుంచి 20 ఆక్సిజన్‌ కాన్సన్ట్రేటర్స్‌ 

వెంటిలేటర్లు – మాస్క్‌లు... 
అమెరికా నుంచి 15 కోట్ల ఎన్‌95 మాస్క్‌లు 
రష్యా నుంచి 75 వెంటిలేటర్లు 
ఫ్రాన్స్‌ నుంచి 28 వెంటిలేటర్లు  
ఐర్లాండ్‌ నుంచి 365 వెంటిలేటర్లు 
స్వీడన్‌ నుంచి 120 వెంటిలేటర్లు  
లక్జెంబర్గ్‌ నుంచి 58 వెంటిలేటర్లు 
జర్మనీ నుంచి 120 వెంటిలేటర్లు, 8కోట్ల కెఎన్‌ 95 మాస్క్‌లు  

ఆక్సిజన్‌ జనరేటర్లు.. 
ఫ్రాన్స్‌ నుంచి 8 ఆక్సిజన్‌ జనరేటర్లు... ఒక్కొక్కటి 250 పడకల ఆసుపత్రికి 10 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఆక్సిజన్‌ సరఫరా చేసే సామర్థ్యం  
ఐర్లాండ్‌ నుంచి ఒక ఆక్సిజన్‌ జనరేటర్‌ 

రెమిడెసివిర్‌తో పాటు ఇతర వైద్య సామాగ్రి.. 
అమెరికా నుంచి 10 లక్షల రాపిడ్‌ డయాగ్నొస్టిక్‌ టెస్ట్‌ కిట్లతో పాటు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ 
రష్యా నుంచి 150 బెడ్‌ సైడ్‌ మానిటర్లు, మందులు 
పోర్చుగల్‌ నుంచి 5వేల రెమిడెసివిర్‌ వయల్స్‌ 
బెల్జియం నుంచి 9వేల మోతాదుల రెమిడెసివిర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement