
న్యూఢిల్లీ: భారత్‌కు మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) గణనీయంగా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. లోక్‌సభలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయెల్ బుధవారం చేసిన ఒక లిఖిత పూర్వక సమాధానం ఈ విషయాన్ని తెలియజేస్తోంది. ఆయన తెలిపిన వివరాలను పరిశీలిస్తే...
కీలక అంశాలు
- 2020–21 ఆర్థిక సంవత్సరంలో తొలి తొమ్మిది నెలల్లో (2021 ఏప్రిల్–నవంబర్) దేశానికి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐల విలువ 81.97 బిలియన్ డాలర్లు. 2021–22 ఇదే కాలంలో (2021 ఏప్రిల్–నవంబర్) మధ్య ఈ విలువ 54.1 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
- మొత్తం ఎఫ్‌డిఐలో ఈక్విటీ ఇన్‌ఫ్లోలు, రీఇన్వెస్ట్ చేసిన ఆదాయాలు, ఇతర మూలధనాలు ఉంటాయి.
- దేశీయ మూలధనాన్ని పెంపొందించడంలో దేశానికి ఎఫ్‌డీఐ ప్రవాహాలు కీలక పాత్ర పోషిస్తాయి. వివిధ రంగాలు, పరిశ్రమలలో పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి కల్పనను ప్రోత్సహించడంలో సహాయపడతాయని మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.
16,737 స్టార్టప్‌లకు గుర్తింపు
కాగా, 2022 జనవరి నాటికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ 16,737 స్టార్టప్‌లను గుర్తించినట్లు ఒక ప్రత్యేక ప్రకటనలో మంత్రి గోయల్ వివరించారు. మరో ప్రశ్నకు వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ సమాధానం ఇస్తూ, అన్ని రంగాలు, ప్రాంతాలలో ఆమోదించబడిన ఇంక్యుబేటర్ల ద్వారా స్టార్టప్‌లకు సీడ్ ఫండింగ్‌ను అందించడానికి ఉద్దేశించి గత ఏడాది ఏప్రిల్ 16వ తేదీన స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్‌ను పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం (డీపీఐఐటీ) ప్రారంభించినట్లు తెలిపారు. ఈ స్కీమ్ కింద 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్లకు వర్తించే విధంగా రూ.945 కోట్ల ఒక గ్రాంట్‌ను కూడా ఆమోదించినట్లు తెలిపారు. 58 ఇంక్యుబేటర్లు, 146 స్టార్టప్స్‌కు 2021 డిసెంబర్ 31వ తేదీ నాటికి రూ.232.75 కోట్లను గ్రాంట్‌గా అందించినట్లు వివరించారు.
యూనికార్న్‌లో 3వ స్థానం
దేశీయంగా స్టార్టప్‌లలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. గత కేలండర్ ఏడాది(2021)లో అత్యంత అధికంగా 42 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్టార్టప్‌లు సమీకరించాయి. అంతక్రితం ఏడాది(2020)లో సమకూర్చుకున్న 11.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి మూడు రెట్లుకంటే ఎక్కువకావడం గమనార్హం. దీంతో గతేడాది ఏకంగా 46 యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా పిలిచే సంగతి తెలిసిందే. ఫలితంగా దేశంలో యూనికార్న్‌ల సంఖ్య 90 దాటింది. దీంతో ప్రపంచంలోనే అమెరికా(487), చైనా(301) తదుపరి భారత్ 90 యూనికార్న్‌లతో మూడో ర్యాంకులో నిలిచింది. దాదాపు 40 యూనికార్న్‌లతో బ్రిటన్ నాల్గవ స్థానంలో నిలిచింది. 10 బిలియన్ డాలర్లు అంతకుమించిన విలువను అందుకున్న కంపెనీలను డెకాకార్న్‌లుగా వ్యవహరిస్తుంటారు. దేశీయంగా ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, బైజూస్, ఓయో రూమ్స్ డెకాకార్న్‌లుగా ఆవిర్భవించాయి.