విదేశీ పండ్లకు పెరిగిన క్రేజ్‌ | Hyderabad Third Ranks In Foreign Country Fruit Sales | Sakshi
Sakshi News home page

విదేశీ పండ్లకు పెరిగిన క్రేజ్‌

Published Sat, Dec 14 2024 7:06 AM | Last Updated on Sat, Dec 14 2024 7:06 AM

Hyderabad Third Ranks In Foreign Country Fruit Sales

మార్కెట్‌ని ముంచెత్తుతున్న వివిధ దేశాల పండ్లు 

గ్లోబల్‌ ట్రెండ్స్‌పై నగర ప్రజలకు పెరిగిన మక్కువ 

రోజుకు 50–60 టన్నుల అమ్మకం 

సుమారు 18 దేశాల నుంచి వివిధ రకాలు దిగుమతి 

విదేశీ పండ్ల విక్రయాల్లో నగరానికి దేశంలోనే మూడో స్థానం  

అమెరికా స్ట్రాబెర్రీ, న్యూజిలాండ్‌ కివీ, వాషింగ్టన్‌ యాపిల్, కాలిఫోర్నియా ద్రాక్ష, ఆస్ట్రేలియా ఆరెంజ్, థాయిలాండ్‌ డ్రాగన్‌ ఇలా అనేక రకాల విదేశీ పండ్లు ప్రసుత్తం నగర మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. దీంతో విదేశీ పండ్ల రుచులను ఆస్వాదించడానికి నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రోజు రోజుకూ నగరంలో వీటి అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సగటున రోజుకు 50–60 టన్నుల మేర అమ్మకాలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సుమారు 18 దేశాల నుంచి వివిధ రకాలు దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపార వర్గాల చెబుతున్న మాట. కాగా ఈ మొత్తం ప్రక్రియలో అమ్మకాలు, దిగుమతులు గణనీయంగా పెరిగాయని, దీంతో విదేశీ పండ్ల విక్రయాల్లో నగరం దేశంలోనే మూడో స్థానంలో ఉందని తెలుస్తోంది.. 

ఒకప్పుడు స్థానికంగా దొరికే ఫలాలే సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసేవారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫలాలు ఎగువ మధ్య తరగతి వారు, లేదా ధనవంతులు మాత్రమే కొనుగోలు చేసేవారు. అయితే మారుతున్న పరిస్థితులు, గ్లోబల్‌ మార్కెటింగ్‌లో భాగంగా ప్రతిదీ సామాన్యులకు అందుబాటులకి వచి్చంది. పైగా వాటికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు వాటి అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశంలో అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లు నగర మార్కెట్లో అందుబాటులో అమ్మకాలు జరుగుతున్నాయి... 



మాల్స్‌ నుంచి లోకల్‌ మార్కెట్‌కి.. 
విదేశీ పండ్లు ఒకప్పుడు పెద్ద పెద్ద మాల్స్‌లోనో.. లేదా సూపర్‌ మార్కెట్స్‌లోనో అమ్మకాలు జరిగేవి... అయితే విదేశీ పండ్లు నగరంలో మాల్స్, ఫ్రూట్‌ షాప్స్‌ నుంచి తోపుడు బండ్లపై అమ్మకాలు జరుగుతున్నాయి. పైగా దేశీయ పండ్ల ధరలకు సమానంగా వీటిని విక్రయిస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఏదో ఒక సీజన్‌లో మత్రమే దేశయ మార్కెట్‌లో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వివిధ దేశాల పండ్లు అక్కడి సీజన్ల ప్రకారం మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి. దీంతో యేడాది పొడవునా ఏదో ఒక దేశం నుంచి అన్ని రకాల పండ్లూ అన్ని సీజన్‌లలో లభ్యమౌతున్నాయి.
  
దేశంలోనే మూడో స్థానంలో.. 
విదేశీ పండ్లుగా పేరుగాంచిన కివీ, స్ట్రాబర్రీ, బ్లాక్‌ బెర్రీస్, అవకాడో వంటి పళ్లు నగరంలో విరివిగా లభ్యమవుతున్నాయి. భారీగా అక్కడి నుంచి దిగుమతులు చేయడం ఒక కారణమైతే.. లోకల్‌ మార్కెట్‌తో పాటు ఇళ్ల వెంబడి కూడా అమ్మకాలు చేయడమే మరో కారణమని బాటసింగారం మార్కెట్‌ వ్యాపార వర్గాలు చెబుతున్నారు. నగరంతో పాటు ఇతర రాష్ట్రాలకూ, జిల్లాలకూ ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతాయి. అందుకే రాష్ట్రంలోనే బాటసింగారం పండ్ల మార్కెట్‌కు అతి పెద్దదిగా పెట్టింది పేరు. అయితే విదేశీ పండ్ల వినియోగంలో ముంబయి, బెంగళూరు తర్వాత నగరం మూడో స్థానంలో నిలిచింది. 

దిగుమతులు ఇలా.. 
గ్రీన్‌ యాపిల్‌కు ఇటీవల అదరణ పెరిగింది. నెదర్లాండ్స్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. యాపిల్‌ పళ్లను వాషింగ్టన్, చైనా, న్యూజిల్యాండ్, చిలీ, బెల్జియం నుంచి ముంబాయి, చెన్నై పోర్టు ద్వారా నగరానికి దిగుమతవుతాయి. అవకాడో టాంజానియా నుంచి, కివీ పండ్లు న్యూజిల్యాండ్, ఇటలీ, ఇరాన్‌తో పాటు చైనా నుంచి వస్తాయి. ఇదే క్రమంలో వివిధ పళ్లు ఇతర దేశాల నుంచి దిగుమతవుతున్నాయి.  

ప్రతి ఫలం..ఔషధ గుణం.. 
ప్లమ్‌.. చూడడానికి పెద్ద రెగు పండు సైజులో యాపిల్‌ను పోలివుంటుంది. ఇందులో క్యాల్షియం, సీ, బీ విటమిన్లు, మెగీ్నíÙయంతో పాటు ఇతర పోషకాలు మొండుగా ఉంటాయి. కివీ ఫ్రూట్‌లో విటమిన్‌ సీ, కే, ఇ అధికంగా ఉంటాయి. ఇక డ్రాగన్‌ ఫ్రూట్‌లో విటమిన్‌ సీ, ఫాస్పరస్, క్యాల్షియం, ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తితో పాటు కేన్సర్‌ను నియంత్రిస్తుంది. చెర్రీలో కార్బోహైడ్రేట్లు, షుగర్, విటమిన్‌ సీ, పోటాషియం పుష్కలంగా లభిస్తాయి.  స్ట్రాబెర్రీలో విటమిన్‌ సీ, క్యాల్షియం అధిక స్థాయిలో 
ఉంటుంది.

ఆన్‌లైన్‌లోనే ఆర్డర్స్‌.. 
వివిధ దేశాల నుంచి ఇక్కడి వ్యాపారులు ఆయా సీజనల్‌ ఫ్రూట్స్‌ని ఆన్‌లైన్‌ ద్వారానే దిగుమతి చేసుకుంటారు.. అదెలా అంటే.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాట్సాప్, మెయిల్‌ ద్వారా పండ్ల నమునా ఫొటోలు పంపిస్తారు. దీంతో వ్యాపారులు ఆన్‌లైన్‌లో అడర్‌ ఇస్తారు. విదేశాల నుంచి ముంబయికి దిగుమితి అవుతాయి. అక్కడి నుంచి ఫ్రీజర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా నగరానికి వస్తాయి.

మార్కెట్‌లో వివిధ దేశాల పండ్లు 
ప్రపంచ వ్యాప్తంగా లభించే దాదాపు 20 రకాల విదేశీ పండ్లు గడ్డిఅన్నారం మార్కెట్‌కు కమీషన్‌ ఏజెంట్‌ల ద్వారా  దిగుమతి అవుతున్నాయి. గతం కంటే ప్రస్తుతం దిగుమతులు పెరిగాయి. ట్రేడర్స్‌కు రెఫ్రిజిరేటర్‌ చాంబర్‌లు ఏర్పాటు చేశాము. దేశంలోని ఇతర పండ్ల మార్కెట్‌లతో పోలిస్తే నగర మార్కెట్‌లో అన్ని సౌకార్యలూ ఉన్నాయి.  
– ఎల్‌ శ్రీనివాస్, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శి

పెరిగిన అమ్మకాలు 
గతంతో పోలిస్తే విదేశీ పండ్ల అమ్మకాలు పెరిగాయి. దీంతోపాటు నగరం ప్రజలకు కూడా విదేశీ పండ్లపై ఆసిక్తి పెరిగంది. కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెరగడం మరో కారణం.. దిగుమతులు కూడా విరివిగా జరుగుతుండడంతో ధరలు కూడా దేశీ పండ్ల స్థాయిలోనే ఉంటున్నాయి. యాపిల్, కివీ, పియర్స్‌తో పాటు మరికొన్ని విదేశీ రకాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. 
– క్రాంతి ప్రభాత్‌రెడ్డి, విదేశీ పండ్ల హోల్‌సేల్‌ వ్యాపారి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement