ట్రావెల్‌ ఆపరేటర్లకు అనుకూలం | Domestic travel operators to see 15-17 pc revenue growth this fiscal | Sakshi
Sakshi News home page

ట్రావెల్‌ ఆపరేటర్లకు అనుకూలం

Published Fri, Aug 2 2024 5:00 AM | Last Updated on Fri, Aug 2 2024 7:59 AM

Domestic travel operators to see 15-17 pc revenue growth this fiscal

ఆదాయంలో 15–17 శాతం వృద్ధి 

క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా 

న్యూఢిల్లీ: దేశీ పర్యాటక రంగం జోరు మీద ఉండడంతోపాటు, విదేశీ ప్రయాణాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి ఈ రంగంలో పనిచేసే ట్రావెల్‌ ఆపరేటర్లకు అనుకూలిస్తుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ పేర్కొంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రావెల్‌ ఆపరేటర్ల ఆదాయం 15–17 శాతం వరకు వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది.

 మౌలిక వసతులు మెరుగుపడుతుండడం, ఖర్చు చేసే ఆదాయం పెరుగుదల, ప్రయాణాలకు మొగ్గు చూపించే ధోరణికి తోడు.. దేశీ పర్యాటక రంగంపై పెరిగిన ప్రభుత్వ ప్రాధాన్యం ఈ రంగం వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ఈ రంగంలో 60 శాతం వాటా కలిగిన నలుగురు ప్రధాన ఆపరేటర్లను విశ్లేíÙంచిన అనంతరం క్రిసిల్‌ రేటింగ్స్‌ ఈ గణాంకాలను విడుదల చేసింది.

 ‘‘ట్రావెల్‌ ఆపరేటర్ల రుణ పరపతి సైతం ఆరోగ్యకర స్థాయిలో ఉంది. బలమైన బ్యాలన్స్‌ షీట్లకుతోడు గత ఆర్థిక సంవత్సరంలో మాదిరే 6.5–7 శాతం మేర స్థిరమైన మార్జిన్లు.. మెరుగైన నగదు ప్రవాహాలకు మద్దతునిస్తాయి. దీంతో ట్రావెల్‌ ఆపరేటర్లు రుణంపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం రాదు’’అని క్రిసిల్‌ రేటింగ్స్‌ తెలిపింది. 

మెరుగైన వసతుల కారణంగా కొత్త పర్యాటక ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు, ఆధ్యాతి్మక పర్యాటకానికి డిమాండ్‌ పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. విదేశీ పర్యాటకుల రాక కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు తెలిపింది. ముఖ్యంగా కార్పొరేట్‌సమావేశాలు, సదస్సుల నుంచి డిమాండ్‌ పెరిగినట్టు పేర్కొంది. 

ఎన్నో అనుకూలతలు..  
అధికంగా ఖర్చు చేసే ఆదాయం, 37 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే సదుపాయం, అడుగు పెట్టిన వెంటనే వీసా కారణంగా విదేశీ విహార యాత్రలు సైతం పెరుగుతున్నట్టు క్రిసిల్‌ రేటింగ్స్‌ నివేదిక తెలిపింది. ఇక ఆకర్షణీయమైన ట్రావెల్‌ ప్యాకేజీలు, దక్షిణాసియా, మధ్య ఆసియా దేశాలకు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు సరీ్వసులు నడిపిస్తుండడం కూడా డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది. 

‘‘కరోనా తర్వాత అప్పటి వరకు ఎటూ వెళ్లలేకపోయిన వారు పెద్ద ఎత్తున ప్రయాణాలకు మొగ్గు చూపించగా, ఆ ధోరణి తగ్గిపోయి.. సాధారణ పరి­స్థితి నెలకొంది. పెరుగుతున్న మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు, పట్టణీకరణ, అందుబాటు ధరల్లో టూర్‌ ప్యాకేజీలు, ఆదాయంలో స్థిరమైన వృద్ధి, ఈ రంగంపై పెరిగిన ప్రభుత్వం దృష్టి ఇవన్నీ టూర్, ట్రావెల్‌ రంగాన్ని స్థిరంగా నడిపిస్తాయి’’అని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ పూనమ్‌ ఉపాధ్యాయ తెలిపారు.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement