
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బబుల్ టీ, కశ్మీరీ ఖావా, పీచ్ ప్యాషన్ ఐస్ టీ, వాటర్‌మిలన్ టీ, సాల్టెడ్ క్యారమెల్ మిల్క్ టీ, హాంకాంగ్ మిల్క్ బబుల్ టీ.. ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించే 900 చాయ్ రకాలను హైదరాబాద్ బ్రాండ్ ‘ద టీ ప్లానెట్’ అభివృద్ధి చేసింది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్లకు ఈ బ్రాండ్ చేరువైంది. వేలాది రుచులను తయారు చేయగల సామర్థ్యం తమకుందని అంటున్నారు ‘ద టీ ప్లానెట్’ ఫౌండర్ మాధురి గనదిన్ని. మహిళలు అరుదుగా ఉండే టీ వ్యాపారంలో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు. కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడర్. సంస్థ ప్రస్థానం, భవిష్యత్ ప్రణాళికలు ఆమె మాటల్లోనే..
దశాబ్ద కాలంపైగా..
బీపీవో సేవల కంపెనీని 2007లో ప్రారంభించాను. మాంద్యం కారణంగా 2010లో మూసేయాల్సి వచ్చింది. నా జీవిత భాగస్వామి శ్రీనివాస్ గనదిన్ని న్యూయార్క్‌లో ఎంబీఏ చదువుతున్న రోజుల్లో శ్రీలంక నుంచి నాణ్యమైన టీ పొడులను సేకరించి విక్రయించేవారు. 2010లో ఆయన భారత్ రాగానే వ్యాపారాన్ని విస్తరించాం. 15 దేశాలు తిరిగి అవగాహన పెంచుకున్నాను. ద టీ ప్లానెట్ పేరుతో సొంత బ్రాండ్‌లో ఉత్పత్తులను ప్రవేశపెట్టాం. 900 రకాల రుచులను పరిచయం చేశాం. కొత్త ఫ్లేవర్లు జోడిస్తూనే ఉంటాం. ద టీ ప్లానెట్ స్టోర్లలో 80 రుచులను కస్టమర్లు ఆస్వాదించొచ్చు.
బబుల్ టీ మా ప్రత్యేకత..
టీ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా గతేడాది వ్యవస్థాగతంగా ఔత్సాహిక యువత చాలా మంది టీ హోటళ్ల వ్యాపారంలోకి ప్రవేశించారు. టాటా సైతం ఎంట్రీ ఇచ్చిందంటే మార్కెట్ అవకాశాలను అర్థం చేసుకోవచ్చు. కన్సల్టింగ్ సేవలతోపాటు ఎగుమతులు చేస్తున్న 15 బ్రాండ్లకు థర్డ్ పార్టీగా టీ పొడులను సరఫరా చేస్తున్నాం. విదేశాలకు మా సొంత బ్రాండ్ టీని ప్రవేశపెట్టనున్నాం. ఇక మా ఔట్‌లెట్లలో బబుల్ టీ ప్రత్యేకం. దీనికి అవసరమైన ముడి పదార్థాలను భారత్‌లో మేము మాత్రమే తయారు చేస్తున్నాం. కార్డి ప్లస్ పేరుతో రోగనిరోధక శక్తిని పెంచే టీ సైతం రూపొందించాం.
డిసెంబర్‌కల్లా 250 ఔట్‌లెట్లు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పోలాండ్‌తో కలిపి 40 ద టీ ప్లానెట్ స్టోర్లు ఫ్రాంచైజీ విధానంలో నిర్వహిస్తున్నాం. ప్రత్యక్షంగా, పరోక్షంగా 225 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ నేపథ్యంలో 50 నగరాలకు విస్తరించడం ద్వారా ఈ ఏడాది డిసెంబరుకల్లా 250 కేంద్రాల స్థాయికి చేరుకోవాలన్నది లక్ష్యం. ఏటా 10 లక్షల కిలోల టీ పౌడర్ ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉంది. 10 దేశాల నుంచి సేకరించిన 400 రకాల క్రీమర్స్, మసాలాలు, ఫ్లేవర్స్, పూలు, మొక్కలు, పండ్లతో టీ పొడులను తయారు చేసి విస్తృత పరిశోధన తర్వాత మార్కెట్లోకి తీసుకొస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment