గాంధీజీ నిర్ణయం తీసుకున్నారు! అంతే, రాత్రి పది గంటలప్పుడు గుండు గీయించుకున్నారు. మర్నాడు చేనేత కార్మికుల సభలో కొల్లాయి గుడ్డతో ప్రసంగించారు. అది 1921 సెప్టెంబర్ 22. సరిగ్గా వందేళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. మోకాళ్ళు దాటని గోచీ, పైన తువ్వాలు. ఇంతే ఆహార్యం! చలికాలం అవసరమనుకుంటే నూలు శాలువా. కన్ను మూసే దాకా అలాగే కొనసాగారు. ఖాదీ తనకు ‘ఐడియా’, ‘ఐడియల్’ అని గాంధీజీ పేర్కొంటారు. పలు భాషలు, సంస్కృతుల భారత దేశానికి ఆయన దుస్తులు గొప్ప ‘కమ్యూనికేషన్’గా పనిచేశాయి.
1921 జూలై 31న బొంబాయిలో అధికారికంగా ప్రారంభించిన విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్‌కి ముగిసిపోవాలి. అయితే అది తృప్తిగా సాగడం లేదు. తగినంత ఖద్దరు దొరకడం లేదని తెలిసింది. ఖరీదు ఎక్కువ కావడంతో కొనడం కష్టం అని కూడా చెప్పారు. దానికి గాంధీజీ, ‘ఖాదీ చాలి నంత దొరక్కపోతే కొల్లాయితో సరిపుచ్చుకోండి’ అంటూ ఉపన్యసించారు. సరిగ్గా ఈ దశలో గాంధీజీ వ్యక్తిగా వంద రెట్లు, కాదు వెయ్యి రెట్లు ఎదిగారు. బిహార్ చంపారణ్య ప్రాంతంలో నీలిమందు పండించే రైతుల కష్టాల పరిష్కారానికి దోహదపడింది గాంధీజీ నాయకత్వం వహించిన తన తొలి భారత దేశపు ఉద్యమం.
అహ్మదాబాద్ జౌళి కార్మికుల కోర్కెలకు మద్దతుగా నిలిచింది రెండో పెద్ద ఉద్యమం. ఈ రెండూ గుడ్డలకు సంబంధించినవే. 1918లో జరిగిన జౌళి కార్మిక ఉద్యమంలో రెండు వారాలు గడిచింది. నిరసన తెలిపే కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. ఓ రోజు గాంధీజీ, అనసూయబెన్ వచ్చారు. సమ్మె కార్మికులెవరూ చెట్టుకింద లేరు. కారణం ఏమిటి అని ఆరా తీశారు. ఓ కార్మికుడు చెప్పాడు: వారికి పోయేదేముంది? కార్లో వస్తారు, ఇంటికెళ్లి భోంచేస్తారు అనే అభిప్రాయముందని! గాంధీజీ మనసు కల్లోలమై, దీర్ఘాలోచనల్లో పడింది. దాని ఫలితమే తన తొలి నిరాహారదీక్ష. 1918 మార్చి 15న ప్రారంభమైంది. ఫలితంగా వారం రోజుల్లో పరిష్కారం లభించింది.
‘త్రికరణ శుద్ధి’ అని అంటామే, దాన్ని సంపూర్తిగా కలిగిన నాయకుడు గాంధీజీ. మోకాళ్లు దాటని గోచీ, లేదా కొల్లాయి కట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? గాంధీజీ మూడవ తరగతి రైలు బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీ గుండా రాయలసీమ ప్రాంతపు రైతులను చూశారని, అదే స్ఫూర్తి అని అక్కిరాజు రమాపతిరావు తన ‘దుర్గా బాయి దేశ్‌ముఖ్’ మోనోగ్రాఫ్‌లో పేర్కొన్నారు. మోప్లాల తిరుగుబాటు విషయం తెలిసి మహమ్మ దాలీతో మలబారు ప్రయాణమయ్యారు గాంధీజీ. కానీ వాల్తేరులో మహమ్మదాలీని అరెస్టు చేయడమే కాక, గాంధీజీ మలబారు పర్యటనను కూడా బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది.
దీనితో గాంధీజీ తన పర్య టనను కుదించుకుని, మదురై వెళ్ళారు. తిరుచురాపల్లి నుంచి మదురైకి రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు – తను కొల్లాయి కట్టుకోనంత వరకు రైతులకు ఆ ప్రబోధం చేయకూడదని నిర్ణయించు కున్నారు. తనతో పాటు ప్రయాణం చేస్తున్న రాజాజీకి చెబితే నచ్చలేదు. కానీ గాంధీజీ స్థిర నిర్ణయానికి వచ్చేశారు. విదేశీ వస్త్ర బహిష్కరణకు ఇది తోడ్పడుతుంది. ఖద్దరు ధరించాలనే నియమానికి ప్రతీక అవుతుంది.
ఖద్దరు లోటును కొంత పరిష్కరిస్తుంది. మన దేశపు శీతోష్ణస్థితుల్ని బట్టి కూడా గోచీ ధరించడం ఇబ్బంది కాదు. మన సంస్కృతి కూడా మగవాళ్లను తమ శరీరం పూర్తిగా కప్పుకోమని నిర్దేశిం చదు. ఇన్ని కారణాలతో గాంధీజీ యాభై రెండేళ్ళ వయసులో, స్వాతంత్య్రోద్యమం తొలి రోజుల్లో కొల్లాయి గట్టడం ప్రారంభించారు. దేశంలోని ఎందరో దరిద్ర నారాయణులకు ప్రతీక అయ్యారు. కోటానుకోట్ల భారతీయులకు ఆరాధ్యుడయ్యారు.
డా. నాగసూరి వేణుగోపాల్
వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి మొబైల్ : 94407 32392
(నేడు గాంధీజీ కొల్లాయి ధారణ శత వసంతాల వేడుక)
Comments
Please login to add a commentAdd a comment