హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారైన ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్–జూలైలో 12.48 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. దేశీయంగా అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో తయారీ కంపెనీలకు కాస్త ఊరట కలిగించే విషయం. అలాగే టూవీలర్ల తయారీ విషయంలో భారత్ అనుసరిస్తున్న నాణ్యత, భద్రత ప్రమాణాలకు ఈ గణాంకాలు నిదర్శనం.
2024 జూలైతో ముగిసిన నాలుగు నెలల్లో మోటార్‌సైకిళ్లు 13 శాతం వృద్ధితో 10,40,226 యూనిట్లు వివిధ దేశాలకు సరఫరా అయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా ఏకంగా 83 శాతానికి ఎగసింది. స్కూటర్ల ఎగుమతులు 21 శాతం అధికమై 2,06,006 యూనిట్లుగా ఉంది. టూవీలర్స్ ఎగుమతుల్లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, ఇండియా యమహా మోటార్, హీరో మోటోకార్ప్, సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా టాప్‌లో కొనసాగుతున్నాయి.
అగ్రస్థానంలో బజాజ్..
ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 5 శాతం వృద్ధితో ఏప్రిల్–జూలైలో 4,97,114 యూనిట్లు నమోదు చేసింది. ఇందులో 4,97,112 యూనిట్లు మోటార్‌సైకిళ్లు ఉండడం గమనార్హం. టీవీఎస్ మోటార్ కో 14 శాతం వృద్ధితో 3,13,453 యూనిట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ 76 శాతం దూసుకెళ్లి 1,82,542 యూనిట్లు, ఇండియా యమహా మోటార్ 28 శాతం అధికమై 79,082 యూనిట్లు, హీరో మోటోకార్ప్ 33 శాతం ఎగసి 73,731 యూనిట్లను విదేశాలకు సరఫరా చేశాయి.
సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 30 శాతం క్షీణించి 64,103 యూనిట్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ 2 శాతం వృద్ధితో 28,278 యూనిట్లు, పియాజియో వెహికిల్స్ 56 శాతం దూసుకెళ్లి 9,673 యూనిట్ల ఎగుమతులను సాధించాయి. బైక్స్‌లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా, స్కూటర్స్‌లో హోండా, టీవీఎస్ మోటార్, ఇండియా యమహా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment