శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టికి చెందిన 24 మంది, కేదారిపురం గ్రామానికి చెందిన 13 మంది, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన మరో ఏడుగురు నిరుద్యోగులు గత ఏడాది డిసెంబర్‌లో ఓ ప్రకటన చూసి ‘అరౌండ్ ద వరల్డ్’ అనే ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించారు. డిసెంబర్ 18, 20, 22 తేదీల్లో గాజువాక గ్రాన్ ఆపిల్ హోటల్‌లో దుబాయ్ డ్రాగన్ కంపెనీ, అబుదాబీ శాంసంగ్ కంపెనీల్లో వెల్డర్, ఫిట్టర్, స్టోర్‌మెన్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీసా, పాస్‌పోర్ట్, విమానం టిక్కెట్ల కోసం రూ.45వేలు నుంచి రూ.55వేలు వరకు వసూలుచేశారు. ఈ ఏడాది జనవరి 24న ముంబై చేరుకోవాలని, అక్కడ నుంచి 28న విమానంలో విదేశాలకు వెళ్లాలంటూ చెప్పిన ట్రావెల్ ఏజెంట్లు ఆ తర్వాత ఆఫీసుకు తాళాలు వేసి ఉడాయించారు.
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు కలిశెట్టి కృష్ణారావు. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం రామకృష్ణాపురం. ఆరు మాసాలు కిందట రూ.70వేలు ఏజెంట్‌కు చెల్లించి బహ్రెయిన్ వెళ్లాడు. ఉచిత ఏసీ వసతి, భోజనంతో పాటు, ఓటీలు ఉంటాయని చెప్పారు. కానీ, అక్కడికి వెళ్ల్సేరికి ఎడారిలో పడేశారు. చాకిరీ చేయించకుని జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో దాదాపు 2 వేల మందితో కలిసి ఆందోళన చేశారు. అణిచివేయాలని చూశారు. కెమికల్స్, ప్రమాదకరమైన గ్యాస్‌వల్ల ఆసుపత్రి పాలయ్యారు. సీఎం వైఎస్ జగన్, మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చొరవతో భారత్‌కు తిరిగొచ్చారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : .. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి జిల్లాలో ఈ తరహా మోసాలు సర్వసాధారణం. ఇక్కడి ఉద్దానం ప్రాంతంతో పాటు జిల్లాలో వందలాది మంది యువత తరచూ ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. వివిధ శిక్షణా సంస్థలకు లక్షల్లో ముట్టజెప్పి లబోదిబోమంటున్నారు. తీరా విదేశాలకు వెళ్లాక చెప్పిన ఉద్యోగం చూపించకపోవడం, టూరిస్ట్ వీసాలంటూ వెనక్కి పంపడం.. నకిలీ ఆర్డర్లతో ఉద్యోగాలే ఇవ్వకపోవడంతో యువకులు పరాయి దేశంలో పడరాని పాట్లు పడుతున్నారు.
మోసం జరుగుతోందిలా..
ఉద్దానం ప్రాంతంలో ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి నిరుద్యోగ యువకులకు పలు సంస్థలు విదేశీ ఉద్యోగాల ఎరచూపి దోపిడీకి పాల్పడుతున్నాయి. గ్రామాల్లో ఉద్యోగ ప్రకటనను అతికించి కొంతమంది, మధ్యవర్తుల ద్వారా కార్మికులకు మాయమాటలతో నమ్మించి మరికొందరూ మోసాలకు పాల్పడుతుంటే.. సైబర్ నేరాగాళ్లు ఆన్‌లైన్‌లో.. ఆకర్షణీయమైన జీతాలు అందిస్తామంటూ నిరుద్యోగ యువతకు ఎరవేస్తూ లక్షలాది రూపాయలు లాగేస్తున్నారు. ఏసీ గదుల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటుచేసి పెద్దలతో మాట్లాడుతున్నట్లు ఫోన్‌చేసి కళ్లెదుటే సినిమా చూపిస్తారు. తీరా డబ్బులు చేతికి అందాక చుక్కలు చూపిస్తున్నారు.
మోసపోతున్నదిక్కడే..
ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, కంచిలి ప్రాంతాలతోపాటు, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న సుర్లారోడ్, బరంపుర్, ఛత్రపూర్ వంటి ప్రాంతాల్లో వెల్డింగ్ ఇనిస్టిట్యూట్‌లను ఏర్పాటుచేసి, నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి, విదేశాల్లో ప్ల్లంబింగ్, ఎలక్ట్రీషియన్, రిగ్గర్, ఫిట్టర్, టిగ్ అండ్ ఆర్క్ వెల్డర్, ఫిట్టర్, గ్యాస్ కట్టర్, ఫ్యాబ్రికేటర్ తదితర పోస్టులను బట్టి రూ.50వేల నుంచి రూ.3లక్షలు వసూలుచేస్తున్నారు. సింగపూర్, మలేసియా, దుబాయ్, మస్కట్, ఖతార్, కువైట్, అబుదాబి, ఒమెన్, ఇరాక్, సౌదీ అరేబియా, సూడాన్, రష్యా, పోలాండ్ తదితర ప్రాంతాలు ఇక్కడి నిరుద్యోగ యువత కష్టాలకు కేంద్రంగా మారాయి.
మోసాలు అనేకం.. మచ్చుకు కొన్ని..
∙ఇటీవల వజ్రపుకొత్తూరు మండలం పూండిలో ఓ ఏజెంట్ 150 మంది నుంచి దాదాపు రూ.2కోట్లు వసూలు చేసి రష్యా స్టాంపుతో నకిలీ వీసాలిచ్చి మోసం చేశాడు. వాస్తవానికి వీసా అనేది పాస్‌పోర్టుపై అతికించి ఇవ్వాలి. కానీ, ఈ ఏజెంట్ 150 మందిని పట్టుకుని ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లగా అక్కడ భారత ఎంబసీ ఇమ్మిగ్రేషన్ అధికారులు నకిలీ వీసాలుగా తేల్చి వెనక్కి పంపించేశారు.
∙కంచిలి మండల పరిధిలోని కత్తివరం రోడ్డులో శ్రీ గణేష్ వెల్డింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకులు సుమారు 150 మంది నిరుద్యోగ యువకులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసంచేసి, ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల నుంచి రూ.70 వేలు చొప్పున వసూలు చేసి, దుకాణం మూసేశారు. బాధితుల్లో ఇన్నీసుపేట, సన్యాసిపుట్టుగ, కపాసుకుద్ది, ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన వారున్నారు.
∙అలాగే, ఇదే మండలంలోని డోలగోవిందపురం గ్రామానికి చెందిన మట్ట దున్నయ్య అనే వ్యక్తి డోలగోవిందపురం, గంగాధరపురం, ఒడిశాకు చెందిన నరేంద్రపురం తదితర గ్రామాలకు చెందిన ఆరుగురి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేసి, మరో ఏజెంటు ద్వారా వీరికి శ్రీలంకలో నెలకు రూ.18,500 చొప్పున జీతంతోపాటు, ఓటీ, భోజనం, వసతి సౌకర్యం కల్పించే ఉద్యోగం ఇస్తానని చెప్పి నమబలికి, తీరా యువకులను శ్రీలంక పంపించి, అక్కడ కేవలం రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇప్పించాడు. దీంతో ఆయా యువకుల కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment