ఐఐటీల్లో తగ్గుతున్న విదేశీ విద్యార్థులు | Foreign Students Declining At IITs In India | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో తగ్గుతున్న విదేశీ విద్యార్థులు

Published Sun, Oct 24 2021 11:05 PM | Last Updated on Sun, Oct 24 2021 11:11 PM

Foreign Students Declining At IITs In India - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలుగా పేరొందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ఎంపికయ్యే విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ నుంచి వారికి మినహాయింపునిచ్చారు. నేరుగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఎంపిక అవకాశం కల్పించారు. అయినా అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. పరీక్షకు హాజరవుతున్నవారిలోనూ ఒక శాతానికి మించి ఉత్తీర్ణులు కావడం లేదు. 

అర్హత సాధిస్తున్నవారు తక్కువే.. 
గతేడాది (2020) జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో దాదాపు 209 మంది ప్రవాస భారతీయులు (ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా–ఓసీఐ), 23 మంది పీఐవోలు (పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌), 23 విదేశీ జాతి కేటగిరీ అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాశారు. వీరిలో విదేశీ జాతి కేటగిరీ కింద నలుగురు, పీఐవో కేటగిరీలో 16 మంది, ఓసీఐ కేటగిరీలో 133 మంది అర్హత సాధించారు.  

అర్హత సాధించకపోవడానికి కారణం ఇదే.. 
దేశంలోని విద్యార్థులు జేఈఈకి ఇంటర్మీడియెట్‌ ఆరంభం నుంచే సన్నాహాల్లో ఉంటున్నారు. విదేశీ విద్యార్థులు కేవలం పరీక్షకు ముందు మాత్రమే సిద్ధమవుతున్నారు. పైగా వారి విద్యలోని అంశాలకు, అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌లోని అంశాలకు మధ్య చాలా అంతరం ఉంటోంది. దీంతో వారు అర్హత మార్కులను సాధించలేకపోతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అర్హత సాధించినవారిలోనూ ఐఐటీల్లో చేరుతున్నవారు తక్కువగానే ఉంటున్నారు. 

పొరుగు దేశాల విద్యార్థులే అధికం.. 
ఐఐటీల్లో యూజీ కోర్సుల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది మనదేశానికి చుట్టుపక్కల ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు దేశస్తులే. ఇతర దేశస్తులు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో యూజీ కోర్సులు చేయడానికి వెళ్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. మనదేశంలో యూజీ కోర్సుల్లో చేరేవారి కంటే పోస్ట్రుగాడ్యుయేషన్, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరే విదేశీ విద్యార్థుల సంఖ్యే ఎక్కువ.

ఐఐటీ రూర్కీలో 144 మంది విదేశీ విద్యార్థులుండగా వారంతా పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరినవారే. ఇక ఢిల్లీ ఐఐటీలో 98 మంది విదేశీ విద్యార్థులుండగా వారు కూడా పీజీ, పీహెచ్‌డీ కోర్సులను అభ్యసిస్తున్నవారే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో విదేశాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఈసారి రద్దు చేశారు. 

అంతర్జాతీయ ర్యాంకింగ్‌పై ప్రభావం 
కాగా.. విదేశీ విద్యార్థుల తగ్గుదల ప్రభావం దేశంలోని విద్యా సంస్థలకు ప్రపంచ ర్యాంకింగ్‌పై పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ స్థాయి ర్యాంకులు ప్రకటించే సంస్థలు ఆయా విద్యాసంస్థల్లోని విదేశీ విద్యార్ధుల సంఖ్యను ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటాయని వివరిస్తున్నారు. విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుదల ఐఐటీలకు ప్రతికూలంగా మారుతోందని చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement