తెలుగు విద్యార్థుల డెస్టినేషన్‌గా యూఎస్‌ | 11th position for Telugu among 350 foreign languages | Sakshi
Sakshi News home page

తెలుగు విద్యార్థుల డెస్టినేషన్‌గా యూఎస్‌

Published Wed, Jul 3 2024 8:03 AM | Last Updated on Wed, Jul 3 2024 8:03 AM

11th position for Telugu among 350 foreign languages

     2016తో పోల్చితే నాలుగు రెట్లు పెరిగిన విద్యార్థులు 

    తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా కాలిఫోర్నియాలోనే.. 

    యూఎస్‌లో మాట్లాడే 350 విదేశీ భాషల్లో తెలుగుకు 11వ స్థానం

    ఐటీ, ఫైనాన్స్‌ సెక్టార్లపై ఆసక్తి

సాక్షి హైదరాబాద్‌: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు తమ డెస్టినేషన్‌గా అమెరికాను ఎంపిక చేసుకుంటున్నారు. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు యూఎస్‌ చదువుల కోసం బ్యాగ్‌లు సర్దిపెట్టుకుంటున్నారు. యునైటెడ్‌ స్టేట్స్‌ సెన్సస్‌ బ్యూరో లెక్కల ఆధారంగా 2016తో పోల్చితే 2024 నాటికి అమెరికాలో తెలుగు వారి సంఖ్య నాలుగింతలు పెరిగిందని స్పష్టమవుతోంది. ప్రధానంగా కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూ జెర్సీ, డల్లాస్, నార్త్‌ కరోలినా, ఇల్లినాయిస్, వర్జీనియా, అట్లాంటా, ఫ్లోరిడా,  జార్జియా, నాష్‌విల్లే తదితర సిటీల్లో తెలుగు వారి ప్రాబల్యం వేగంగా పెరుగుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎంతలా ఉందంటే యూఎస్‌లో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషలు 350 ఉండగా అందులో తెలుగు 11వ స్థానంలో నిలిచింది.

ఐటీ, ఫైనాన్స్‌ రంగాలపై ఆసక్తి.. 
అమెరికా వెళుతున్న వారిలో దాదాపు 75 శాతం పైగా ఇక్కడ ఇక్కడే స్థిరపడుతున్నారు. ప్రధానంగా డల్లాస్, బే ఏరియా, నార్త్‌ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్‌విల్లే తదితర ప్రాంతాల్లో తెలుగు వారి ప్రభావం కనిపిస్తోంది. గతంలో స్థిరపడిన తెలుగు ప్రజలు పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. మరికొంత మందికి ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నారు. అయితే 80 శాతం కంటే ఎక్కువ మంది యువకులు ఐటీ, ఫైనాన్స్‌ రంగాలపైనే ఆసక్తి చూపిస్తున్నారని స్థానిక సర్వేల్లో వెల్లడైంది.  

3.2 లక్షల నుంచి 12.3 లక్షల వరకు.. 
యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో డేటా ప్రకారం 2016 నాటికి అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 3.2 లక్షల మంది ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 12.3 లక్షలకు చేరింది. గతంలో వెళ్లి స్థిరపడిన నాలుగు తరాలకు చెందిన తెలుగు వారు, ఇటీవల కొత్తగా వెళ్లిన వారు సైతం అంతా అమెరికాను తమ సొంత ప్రాంతంలో ఉన్నట్లు భావిస్తున్నారు. తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా కాలిఫోరి్నయాలో 2 లక్షల మంది ఉండగా, టెక్సాస్‌ 1.5 లక్షలు, న్యూజెర్సీ 1.1 లక్షలు, ఇల్లినాయిస్‌ 83 వేలు, వర్జీనియా 78 వేలు, జార్జియా 52 వేల మంది ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.

హిందీ, గుజరాతీ, తరువాతి స్థానంలో తెలుగు.. 
అమెరికాలో మాట్లాడే భారతీయ భాషల్లో అత్యధికంగా హిందీ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో గుజరాతీ, మూడో స్థానంలో తెలుగు ప్రజలు ఉన్నారు. అమెరికాలో సుమారు 350 విదేశీ భాషలు వాడుకలో ఉండగా అందులో తెలుగు భాష 11 స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి అమెరికాలో తెలుగు ప్రజల సంఖ్యా ప్రభావం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టం చేస్తోంది. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు అమెరికా వస్తున్నారని ఉత్తర అమెరికా తెలుగు భాషా సంఘం మాజీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది హెచ్‌1బి వీసా హోల్డర్లు ఉంటున్నారు. ఇందులో 80 శాతం మంది తెలుగు సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement