స్వదేశీ కోచ్‌లు ఎక్కడ? అనే విమర్శలను కాసేపు పక్కనపెడితే.. ఫారిన్ కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్‌లు ఈ దఫా ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్యను పెంచడంలో భారత్‌కు వెన్నెముకగా నిలిచారు. నీరజ్ కోసం జర్మనీ ఉవీ హోన్, పురుషుల హాకీ కోసం ఆసీస్ గ్రాహం రెయిడ్, లవ్లీనా-మహిళా బాక్సింగ్ టీం కోసం ఇటలీ రఫలే బెర్గామాస్కో, భజరంగ్ పూనియా కోసం షాకో బెంటిండిస్, పీవీ సింధు కోసం దక్షిణకొరియా పార్క్, సెమీస్ దాకా చేరిన మహిళా హాకీ టీం కోసం నెదర్లాండ్స్ జోయర్డ్ మరీన్.. ఇలా అంతా విదేశీ కోచ్‌ల హవానే ఈసారి కనిపించింది.
భారత అథ్లెట్లు-ప్లేయర్లు నీరజ్ చోప్రా, పీవీ సింధు, లవ్లీనా, మీరాబాయ్ ఛాను, రవి దహియా, భజరంగ్ పూనియా, మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని పురుషుల హాకీ టీం-రాణి రాంపాల్ నేతృత్వంలోని మహిళా హాకీ టీం.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో ప్రముఖంగా నిలిచిన వీళ్లందరికీ ఉన్న ఒకే కామన్ పాయింట్.. అంతా విదేశీ కోచ్‌ల ఆధ్వర్యంలో సత్తా చాటినవాళ్లే. అవును.. వీళ్ల ఘనత వల్ల స్వదేశీ కోచ్‌ల ప్లేసుల్లో ఈసారి విదేశీ కోచ్‌ల పేర్లు ఎక్కువగా తెరపై వినిపించి.. కనిపించాయి. పతకాల మేజర్ సక్సెస్ రేటు పరదేశీ కోచ్‌లదే అయినా.. స్వదేశీ కోచ్‌లకు స్థానం దక్కకపోవడంపై కొంత విమర్శలు వినిపించాయి.
వీళ్లే టా(తో)ప్
విదేశీ కోచ్‌ల్లో ఎక్కువ జీతం అందుకుంది ఆస్ట్రేలియా హాకీ దిగ్గజం, భారత పురుషుల హాకీ జట్టు కోచ్ గ్రాహం రెయిడ్. నెలకు పదిహేను వేల డాలర్ల జీతం(పదకొండు లక్షలకుపైనే) అందుకున్నాడాయన. ఆ తర్వాతి స్థానంలో నెదర్లాండ్స్ హాకీ లెజెండ్ జోయర్డ్ మరీన్ నెలకు పదివేల డాలర్లు(ఏడున్నర లక్షల రూపాయలపైనే) అందుకున్నారు. ఇక బాక్సింగ్ డైరెక్టర్ శాంటియాగో నియేవా(అర్జెంటీనా) ఈ లిస్ట్‌లో ఎనిమిది వేల డాలర్ల(దాదాపు ఆరు లక్షల రూపాయలు)తో మూడో ప్లేస్‌లో నిలవగా, జావెలిన్ త్రో కోచ్ ఉవే హోన్ నెలకు ఎనిమిదివేల డాలర్లతో నాలుగో ప్లేస్‌లో, రైఫిల్ కోచ్‌లు ఓలెగ్ మిఖాయిలోవ్-పావెల్ స్మిర్‌నోవ్ (రష్యా)లు చెరో 7,500 డాలర్లు ( ఐదున్నర లక్షల రూపాయలు)లతో తర్వాతి స్థానంలో నిలిచారు.
కొత్తేం కాదు
విదేశీ కోచ్‌ల్ని ఆశ్రయించడం మనకేం కొత్త కాదు. అందులో ఎలాంటి దాపరికమూ లేదు. 80వ దశకం నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ విదేశాల నుంచి స్పెషలిస్టులను తెప్పించుకోవడం మొదలుపెట్టింది. సిడ్నీ ఒలింపిక్స్(2000) టైం నాటికి అది తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా హాకీ, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్ లాంటి మేజర్ ఈవెంట్లు విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో మెరుగైన ప్రదర్శనకు దారితీయడంతో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది.
ప్రముఖంగా విదేశీ కోచ్‌లకే ఎందుకు ప్రాధాన్యం? అనే ప్రశ్నకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) నుంచి వివరణ.. సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడమే. శాయ్ ఎంపిక చేసే కోచ్‌లలో ఎక్కువ మంది గతంలో ఛాంపియన్‌లుగా ఉన్నవాళ్లో లేదంటే విజయాలను అందుకున్న అనుభవం ఉన్నవాళ్లో ఉంటారు. వాళ్లకు మన కోచ్‌లతో పోలిస్తే సైంటిఫిక్-టెక్నికల్ నాలెడ్జ్, ట్రిక్కులు- జిమ్మిక్కులు, డైట్‌కు సంబంధించిన వివరాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది. అందుకే కేవలం సలహాల కోసమే ఒక్కోసారి వాళ్లను నియమించుకుంటాయి కూడా. అలాగని మన దగ్గరా సత్తా ఉన్నవాళ్లు లేరని కాదు. ‘సక్సెస్‌తో పాటు అనుభవం’ అనే పాయింట్ మీదే ఫోకస్ చేస్తూ ఫారిన్ కోచ్‌లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తోంది శాయ్. అలాగే వీళ్లకు నెలకు మినిమమ్ నెలకు నాలుగు వేల డాలర్లకు తగ్గకుండా శాలరీ ఇస్తుంటుంది. అలాగే వాళ్లతో పని కూడా అదే తీరులో చేయించుకుంటాయి మన స్పోర్ట్స్ అథారిటీలు.
విదేశీకే ప్రయారిటీ
టోక్యో ఒలింపిక్స్ కోసం టోక్యోకు వెళ్లిన 126 మంది అథ్లెట్ల కోసం (9 విభాగాలు) 32 మంది విదేశీ కోచ్‌లు(50 మంది స్వదేశీ కోచ్‌లను సొంత ఖర్చులతో భారత ప్రభుత్వం పంపించింది) పని చేశారు. సక్సెస్ జోరు.. ఆటగాళ్లతో ఈ కోచ్‌ల టెంపో కారణంగా మరికొంత కాలం వీళ్లనే కోచ్‌లుగా కొనసాగించాలని శాయ్ భావిస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ 30, 2021 వరకు వీళ్లను కొనసాగించాలని నిర్ణయించుకుంది. పారిస్, లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టకుని.. మరో నాలుగేళ్లపాటు విదేశీ కోచ్‌లకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment