Tokyo Olympics: Neeraj Chopra's Gold Winning Feat Named One Of 10 Magical Moments Of Athletics - Sakshi
Sakshi News home page

టాప్‌–10లో నీరజ్‌ పసిడి ప్రదర్శన

Published Thu, Aug 12 2021 5:38 AM | Last Updated on Thu, Aug 12 2021 6:08 PM

Neeraj Chopra gold winning feat named one of 10 magical moments - Sakshi

న్యూఢిల్లీ: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో కనబరిచిన స్వర్ణ పతక ప్రదర్శన మరో స్థాయికి చేరింది. టోక్యో ఒలింపిక్స్‌లోని ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌లో పది అద్భుత ఘట్టాల్లో అతని ప్రదర్శనకు స్థానం లభించిందని ప్రపంచ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) వెల్లడించింది. 23 ఏళ్ల చోప్రా ఫైనల్లో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి చాంపియన్‌గా నిలిచాడు. దీంతో ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర పుటలకెక్కాడు. ‘ఒలింపిక్స్‌కు ముందు నీరజ్‌ చోప్రా ప్రతిభ గురించి చాలా మంది సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు.

విశ్వక్రీడల్లో బంగారు విజేతగా చరిత్ర సృష్టించాక అతని ప్రొఫైల్‌ ఆకాశాన్ని తాకింది. అంతలా అతన్ని అనుసరించడం మొదలుపెట్టారు’ అని ప్రపంచ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. విజయం తర్వాత నీరజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో  ‘ఈ అనుభూతి అద్భుతమైంది. ఈ క్షణం నాతో చిరకాలం ఉండిపోతుంది. దేశానికి స్వర్ణం అందించేందుకు నాకు మద్దతు తెలిపినవారికి, ఆశీర్వదించిన వారికి ధన్యవాదాలు’ అని పోస్ట్‌ చేశాడు. ఇది లక్షల మందిని చేరుకుంది. ఒలింపిక్స్‌కు ముందు అతని ఇన్‌స్టాగ్రామ్‌లో 1,43,000 మంది ఫాలోవర్లు ఉండగా... ఒలింపిక్‌ చాంపియన్‌ అయ్యాక, ఆ పోస్ట్‌ పెట్టాక ఏకంగా 32 లక్షల మంది ఫాలోవర్లు జమ అయ్యారని డబ్ల్యూఏ తెలిపింది.

రెండో ర్యాంక్‌కు నీరజ్‌

ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మరో ఘనత సాధించారు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు ప్రపంచంలోనే రెండో ర్యాంకును చేరుకున్నారు. 1,315 స్కోరుతో నీరజ్ చోప్రా రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు. కాగా 1,396 స్కోరుతో జర్మనీ ఆటగాడు జొహెనెస్ వెటెర్ అగ్రస్థానంలో నిలిచాడు. గత ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో నిలిచిన నీరజ్‌ బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 2వ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement