న్యూఢిల్లీ: నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ స్వర్ణంతో టోక్యో ఒలింపిక్స్‌ను చిరస్మరణీయం చేసుకున్న భారత్ అదే వేదికపై మళ్లీ పతకాల వేటకు వెళ్లింది. పారాలింపిక్స్‌లో పాల్గొనేందుకు 54 మంది సభ్యులతో కూడిన భారత జట్టు గురువారం అక్కడికి బయల్దేరింది. టోక్యోలోనే ఈ నెల 24 నుంచి దివ్యాంగ విశ్వక్రీడలు జరుగనున్నాయి. భారత ఆటగాళ్లు పోటీ పడే ఈవెంట్లు 27న మొదలవుతాయి. ముందుగా ఆర్చరీ పోటీలు జరుగుతాయి. పారాలింపిక్ చాంపియన్లు దేవేంద్ర జఝారియా (ఎఫ్–46 జావెలిన్ త్రో), మరియప్పన్ తంగవేలు (టి–63 హైజంప్), ప్రపంచ చాంపియన్ సందీప్ చౌదరి (ఎఫ్–64 జావెలిన్ త్రో) ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. దేవేంద్ర మూడో స్వర్ణంపై కన్నేశాడు. తను ఇదివరకే ఏథెన్స్(2004), రియో (2016) పారాలింపిక్స్‌లో బంగారు పతకాలు నెగ్గాడు. గత పారాలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనతో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం గెలుపొందింది. మన జట్టు దిగ్విజయంగా పతకాలతో తిరిగి రావాలని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, భారత పారాలింపిక్ సంఘం అధికారులు గురువారం జరిగిన ‘వర్చువల్ సెండాఫ్’ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ సాగనంపారు.
Comments
Please login to add a commentAdd a comment