Most Of BTech Students Opting Foreign Education - Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ పట్టాతో ఎగిరిపోవాల్సిందే.. ఉద్యోగం వచ్చినా వద్దే వద్దు

Published Mon, Jul 18 2022 2:55 AM | Last Updated on Mon, Jul 18 2022 12:43 PM

Most of BTech Students Opting Foreign Education - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీటెక్‌ పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది విదేశీ విద్య వైపే మొగ్గుచూపుతున్నారు. క్యాంపస్‌ నియామకాల్లో ఎంపికైనా సరే... ఎంఎస్‌ చేసిన తర్వాతే ఏదైనా అంటున్నారు. ఎంటెక్‌ వంటి పీజీ కోర్సుల్లో చేరేందుకు తక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. గత ఐదేళ్లుగా ఇదే ట్రెండ్‌ కన్పిస్తోంది. ఎంటెక్‌ కోర్సుల్లో సీట్లు నిండే పరిస్థితి కూడా లేదు. ఏటా 70–65 వేల మంది బీటెక్‌ ప్రవేశాలు పొందుతుంటే, కనీసం 4 వేల మంది కూడా ఎంటెక్‌లో చేరడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అదీ కూడా గేట్‌ ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చేరే వారే 3 వేల మంది వరకూ ఉన్నారు. దాదాపు 12 వేల మంది ప్రతి ఏటా ఎంఎస్‌ కోసం విదేశాలకు వెళ్తున్నారు. మేనేజ్‌మెంట్, ఇతర పీజీ కోర్సులకు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వెళ్లే వారి సంఖ్య 15 వేల వరకూ ఉంటోంది. ఇలా మొత్తం మీద 27 వేల మందికిపైగా బీటెక్‌ తర్వాత ఇతర దేశాలకు పయనమవుతున్నారు. దీంతో రాష్ట్రంలో బీటెక్‌కు ఉన్న పోటీ వాతావరణం ఇతర కోర్సులకు ఉండటం లేదు.                     

అవకాశాలే లక్ష్యం... 
విదేశాల్లో సాధారణంగా ఎంఎస్‌ తర్వాత సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో నియామకాలు చేపడతారు. మన దేశంలో మాత్రం బీటెక్‌ తర్వాతే ఈ అవకాశాలు ఉంటున్నాయి. అయితే, మన దేశంతో పోలిస్తే విదేశాల్లో ఎంఎస్‌ చేసిన తర్వాత మంచి వేతనం లభిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. ఎంఎస్‌ చేసేందుకు బ్యాంకులు ఎక్కువగా రుణాలివ్వడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అమెరికా వంటి దేశాల్లో అనధికారికంగా ఏదో ఒక పార్ట్‌టైమ్‌ ఉపాధి పొందేందుకు అవకాశాలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, కొంతకాలంగా ఇంజనీరింగ్‌ విద్యలో ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. కంప్యూటర్‌ కోర్సుల్లో ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్‌ ఉన్న కోర్సులొచ్చాయి.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ వంటి కోర్సులు ఇక్కడ చేసి, కొనసాగింపుగా అమెరికాలో ఎంఎస్‌ చేయడం ప్రయోజనంగా ఉంటోందని సాఫ్ట్‌వేర్‌ నిపుణులు అంటున్నారు. ఈ కారణంగా బీటెక్‌ తర్వాత ఎంఎస్‌కే ప్రాధాన్యమిస్తున్నారు. ఇతర మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోనూ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ముందంజలో ఉన్నాయి. మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికతో విద్యను అందిస్తున్నాయి. అందుకే విదేశీ మేనేజ్‌మెంట్‌ కోర్సులకూ ప్రాధాన్యమిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement