నష్టాల ఊబిలో.. | Telangana State Road Transport Corporation | Sakshi
Sakshi News home page

నష్టాల ఊబిలో..

Published Sat, Jun 11 2016 12:54 AM | Last Updated on Thu, Aug 30 2018 5:54 PM

నష్టాల ఊబిలో.. - Sakshi

నష్టాల ఊబిలో..

గ్రేటర్ ఆర్టీసీపై  రూ.370 కోట్లకు పైగా భారం
ఇంధనం, నిర్వహణ తడిసి మోపెడు
జీహెచ్‌ఎంసీ నుంచి అందిన సాయం అంతంతే..
సీఎం సమీక్ష సమావేశంపై కోటి ఆశలు..

 

⇒ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొత్తం నష్టాలు రూ. 701 కోట్లు

⇒అధికారుల లెక్కల ప్రకారం కేవలం గ్రేటర్ ఆర్టీసీ నష్టాలు రూ. 354.75 కోట్లు. ఏ రోజుకు ఆ రోజు వచ్చే నష్టాలు, నిర్వహణ ఖర్చులు, భారీగా పెరిగిన ఇంధన వ్యయం దృష్ట్యా ఈ జూన్ నాటికి రూ. 370 కోట్లకు పైగా ఉన్నట్టు అంచనా.

⇒ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆర్టీసీని గట్టెక్కించేందుకు జీహెచ్‌ఎంసీ చేస్తానన్న సాయం రూ. 126 కోట్లు. ఇప్పటికి అందినది రూ.60 కోట్లే.

 

సిటీబ్యూరో: పెరుగుతున్న నష్టాలు గ్రేటర్ ఆర్టీసీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. సంస్థ మొత్తంగా ఎదుర్కొనే నష్టాల్లో సగానికి పైగా హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. 28 డిపోలు, 3804 బస్సులతో రోజూ సుమారు 41 వేల ట్రిప్పుల రవాణా సదుపాయాన్ని కల్పిస్తోన్న నగర ఆర్టీసీ రోజుకు కోటి రూపాయల నష్టాల్లో నడుస్తోంది. టిక్కెట్ చార్జీల రూపంలో నిత్యం 32 లక్షల మంది ప్రయాణికుల నుంచి రూ. 3.68 కోట్ల ఆదాయం లభిస్తుండగా, రోజుకు రూ. 4.65 కోట్ల చొప్పున ఖర్చులు నమోదవుతున్నాయి. వీటిలో నష్టాలు రూ.97 లక్షలుగా తేలింది. భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆర్టీసీ.. ఇప్పుడు సీఎం సాయం కోసం చూస్తోంది. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్షా సమావేశం నిర్వహించనున్న దృష్ట్యా గ్రేటర్ ఆర్టీసీ అధికారులు భవిష్యత్తు కార్యాచరణపై సన్నద్ధమయ్యారు. ముఖ్యమంత్రి  సమావేశంలో డిపోల వారీగా లాభనష్టాలపై సమగ్ర చర్చ జరుగనున్న నేపథ్యంలో పూర్తిస్థాయి నివేదికను అందజేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

నష్టాల నావకు  సవాలక్ష కారణాలు
అంతర్జాతీయ నగరం స్థాయికి తగ్గట్టుగా ప్రజా రవాణా సదుపాయాలు ఉండాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఏసీ బస్సులు తెల్ల ఏనుగులుగా మారాయి. రూపాయి లాభం లేకుండా మొదటి నుంచి నష్టాల్లోనే నడుస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నడిచే పుష్పక్ బస్సులు, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, తదితర ప్రాంతాల్లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టిన మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులు వరుస నష్టాలనే ఇస్తున్నాయి. మొత్తం 163 ఏసీ బస్సులు ఉండగా, ఒక్కో బస్సుపై రోజుకు సుమారు రూ.5000 చొప్పున మొత్తం రూ.8.15 లక్షల నష్టాలు వస్తున్నాయి. నెలకు రూ.2.44 కోట్ల చొప్పున గత నాలుగేళ్లలో ఒక్క ఏసీ బస్సులపైనే సిటీ ఆర్టీసీ రూ.117.36 కోట్ల నష్టాలను చూసింది.

 
ఇంధనం భారం..

నగరంలో సిటీ బస్సులు రోజుకు 9.7 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. వాహనాల రద్దీ, ఎక్కువ సేపు బస్సులను ఐడలింగ్‌లో ఉంచడం వంటి కారణాలతో గ్రేటర్ ఆర్టీసీలో డీజిల్ వినియోగం సగటున లీటర్‌కు 4 కిలోమీటర్ల చొప్పున ఉంది. ఏసీ బస్సులు ఒక లీటర్‌కు 2.5 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్లు, మెట్రో బస్సులు 4 కిలోమీటర్లు, ఆర్డినరీ బస్సులు 4.5 కిలోమీటర్ల చొప్పున వినియోగిస్తున్నాయి. మొత్తంగా సిటీ బస్సుల కోసం ప్రతి రోజు 2.19 లక్షల డీజిల్ వినియోగిస్తున్నారు. ఇటీవల పెరిగిన డీజిల్ ధరల ప్రభావంతో ఆర్టీసీపై నెలకు రూ.2 కోట్లకు పైగా అదనపు భారం పడింది.

 
పుట్టి ముంచుతున్న అద్దె బస్సులు

అద్దె బస్సులపై వచ్చే ఆదాయం కంటే చెల్లించే అద్దే భారంగా మారింది. ప్రైవేట్ వ్యక్తుల నుంచి గ్రేటర్ ఆర్టీసీ 462 బస్సులను అద్దెకు తీసుకుని నడుపుతోంది. వీటికి ఈ ఏడాది రూ.80 కోట్లు అద్దెగా చెల్లించింది. కానీ ఆ బస్సుల ద్వారా ఆర్టీసీకి లభించిన ఆదాయం కేవలం రూ.58  కోట్లు. అంటే ఒక్క ఏడాదిలో వచ్చిన ఆదాయం కంటే అదనంగా రూ.22 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అదనంగా చెల్లించిన రూ.22 కోట్లతో కనీసం 150 కొత్త బస్సులు సొంతంగా సమకూర్చుకునే అవకాశం ఉంది. ప్రైవేట్ ఆపరేట్ల లాభం కోసమే ఆర్టీసీ యాజమాన్యం బస్సులను అద్దెకు తీసుకుంటోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 

 ఇదీ గ్రేటర్ ఆర్టీసీ పరిస్థితి..
మొత్తం డిపోలు  : 28
నగరంలో తిరిగే బస్సులు : 3804
ప్రయాణికుల సంఖ్య 33 లక్షలు, ఆక్యుపెన్సీ రేషియో 70 శాతం రోజూ తిరిగే ట్రిప్పులు 41,110 (9 లక్షల కిలోమీటర్లు)
రోజువారి ఆదాయం రూ. 3.68 కోట్లు
రోజువారీ ఖర్చు: రూ.4.65 కోట్లు
రోజువారీ నష్టం  రూ.97 లక్షలు
ఈ ఏడాది ఏప్రిల్ నాటికి లభించిన
ఆదాయం రూ.1330.47 కోట్లు
బస్సుల నిర్వహణ కోసం చేసిన ఖర్చు రూ.1685.15 కోట్లు
ఏప్రిల్ నాటికి నమోదైన నష్టాలు రూ.354.75 కోట్లు
ఈ జూన్ నెలకు రూ.370 కోట్లకు    పైగా నమోదైనట్లు అంచనా

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement