
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీలో ఇదో విచిత్రం.. సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు, జీతభత్యాలు పెంచటానికి దిక్కు లేదు కానీ.. పదవీ విరమణ పొందిన అధికారులకు మాత్రం వరుసబెట్టి కొత్త పోస్టింగులు ఇస్తున్నారు. నిబంధనలు పక్కనబెట్టి అడ్డదారిలో రూ.లక్షల్లో జీతాలు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు.
రిటైర్మెంట్‌కు ఒక్క రోజు ముందు..
పోలీసు శాఖకు చెందిన ఓ ఏఎస్పీ స్థాయి ఉద్యోగికి 2012లో తన పదవీ విరమణకు కేవలం ఒక్క రోజు ముందు ఏపీఎస్‌ఆర్టీసీలోని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో అదనపు డైరెక్టర్‌గా పోస్టింగ్ వచ్చింది. విధుల్లో చేరిన మరుసటి రో జే పదవీ విరమణ పొందారు. వాస్తవానికి అదనపు డైరెక్టర్ పోస్టులకు ఎస్పీ స్థాయి కేడర్‌కు పోస్టింగ్ ఇవ్వాలి. కానీ అప్పటి ఆర్టీసీ చైర్మన్ ని బంధనలు పక్కనబెట్టి ఆయనకు పోస్టింగ్ ఇప్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా సర్వీసు పొడిగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయ న వయసు 64 ఏళ్లు. నడవటానికి శరీరం సహకరించటంలేదు. వినికిడి శక్తిని కోల్పోయారు. గతేడాది సుమారు రూ.2 లక్షలు ఆర్టీసీ డబ్బు ఖర్చు చేసి వినికిడి యంత్రాలు తెచ్చుకున్నారు.
ఇప్పుడేమో డైరెక్టర్‌గా..
ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులు వేతన సవరణ డిమాండ్‌తో సమ్మెకు సిద్ధమయ్యారు. ఉద్యోగులతో చర్చలు పూర్తికాక ముందే కార్మిక సంఘం నాయకులు సమ్మెకు నోటీసులు ఇవ్వటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. వాస్తవానికి విజిలెన్స్ విభాగం ఈ విషయాన్ని ముందే పసిగట్టి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాల్సి ఉందని, కానీ విజిలెన్స్ చీఫ్ సమాచారం సేకరించటంతో విఫలమయ్యారనే ఆరోపణ వచ్చాయి. అదే సమయంలో ఆయన సర్వీస్ పొడిగింపు గడువు కూడా ముగియటంతో రెగ్యులర్ ఉద్యోగిని ఇవ్వాలని కోరుతూ రవాణా శాఖ అధికారులు పోలీసు శాఖకు లేఖ రాశారు. కానీ ఈ లేఖను పక్కన పెట్టి సదరు అధికారికే డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ.. ఇప్పుడున్న జీతభత్యాలకు 30 శాతం అదనంగా పెంచుతూ ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలను యథాతథంగా అనుమతిస్తూ ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఫైల్‌ను పంపారు.
మరో ఇద్దరికి ‘పునరావాసం’
సాధారణంగా రోడ్డు రవాణా సంస్థలు పొరుగు రాష్ట్రాలతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించటం, రాష్ట్రం నుంచి నడిచే బస్సు సర్వీస్‌లకు రూట్లను ఎంపిక చేయటం తదితర పనుల కోసం పక్క రాష్ట్రాల్లో సంస్థ ప్రతినిధులను నియమిస్తుంది. ఈ విధుల నిర్వహణ కోసం సీనియర్ కంట్రోలర్ స్థాయి అధికారి సరిపోతారు. కానీ ఇద్దరు రిటైర్డ్ ఆర్‌ఎం స్థాయి అధికారులకు మళ్లీ పునరావాసం కల్పించటం కోసం ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తెస్తున్నారు. ఈ ఇద్దరు అధికారులకు స్పెషల్ ఆఫీసర్ హోదా కల్పిస్తూ.. రూ.లక్ష జీతంతో విజయవాడ, విశాఖపట్నంలో పోస్టింగులకు ప్రతిపాదనలు సిద్ధం చేíసి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపారు. ఈ ఫైళ్లను ఆమోదింపజేయటానికి ఆర్టీసీలో అత్యున్నత స్థాయి అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఓ వ్యక్తి ముఖ్యమంత్రి కార్యాలయంపై ఒత్తిడి చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment