
సంక్షోభం అంచున ఎర్రబస్సు!
భారీ నష్టాల మధ్య ఆవిర్భవించనున్న టీఎస్‌ఆర్టీసీ
- 2013-14లో రూ. 210 కోట్ల నష్టాలు
- ప్రభుత్వం ఆదుకోవాలంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద రోడ్డు రవాణా సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతోంది. వరుస నష్టాలతో ఏటేటా మరింతగా కునారిల్లుతోంది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం ఉమ్మడి రవాణా సంస్థగా కొనసాగుతున్న ఏపీఎస్ ఆర్టీసీ మరికొద్ది రోజుల్లో విభజన కానున్న దశలో... రికార్డు స్థాయి నష్టాలను మూటగట్టుకుని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. త 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా వస్తున్న నష్టాలు.. గుదిబండగా మారనున్నాయి. ఇటీవలి మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనే తెలంగాణకు సంబంధించిరూ. 210 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం తొలి మాసం ఏప్రిల్‌లోనే రూ. 14.5 కోట్ల నష్టాలతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వం పట్టించుకోకుంటే సంస్థ కుప్పకూలే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
చార్జీలు పెంచకుండానే..
ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవాలంటూ యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నష్టాల నుంచి కొంతమేర అయినా కోలుకోవాలంటే టికెట్ చార్జీలను 10శాతం వరకు పెంచేందుకు అనుమతివ్వాలని కోరింది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చార్జీలు పెంచేందుకు సుముఖంగా లేరు. ఆర్టీసీని గట్టెక్కించాలంటే టికెట్ చార్జీల పెంపు మాత్రమే పరిష్కారం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంధన వ్యయం, మోటారు వాహనాల పన్ను విషయంలో ప్రభుత్వం ఆదుకుంటే పరిస్థితి అదుపులోకి వస్తుందని చెబుతున్నారు.
దీంతోపాటు సరైన పర్యవేక్షణ లేకపోవటంతో కొన్నేళ్లుగా ఆర్టీసీలో ఖర్చుల పద్దు గతి తప్పుతోందని, దీనిపై లోతుగా విశ్లేషిస్తే నియంత్రణలోకి వచ్చే అవకాశముందని అంటున్నారు. ‘‘సిబ్బంది జీతభత్యాలతో పాటు డీజిల్ ఖర్చు పెరుగుతోంది. పొదుపు చర్యలు లేకపోవటం, బస్సులు సరైన కండిషన్‌లో ఉండకపోవటం, డ్రైవర్లకు పునశ్చరణ శిక్షణ లోపించటంతో ఇంధనం వృథా కావడం, కార్యాలయాల నిర్వహణ పేర చూపుతున్న భారీ వ్యయం, తరుగుదల, వడ్డీలు, చిల్లర ఖర్చువంటివి కూడా ఉన్నాయంటున్నారు.
* 2013-14 ఆర్థిక సంవత్సరంలో టీఎస్‌ఆర్టీసీ రూ. 3,742 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఇది అంతకుముందు ఏడాది కంటే రూ. 335 కోట్లు మాత్రమే ఎక్కువ. అదే 2013-14 సంవత్సరంలో వ్యయాన్ని రూ. 3,950 కోట్లుగా చూపారు. ఇది ముందటి ఏడాది కంటే రూ. 537 కోట్లు ఎక్కువ. అంటే నష్టం మరింత పెరిగిందన్న మాట.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల (ఏప్రిల్)లో అంతకు ముందు నెల (మార్చి) కంటే ఆదాయం తగ్గిపోయింది. హైదరాబాద్ జోన్ పరిధిలో మార్చిలో రూ. 97 కోట్ల ఆదాయం వస్తే ఏప్రిల్‌లో అది రూ. 92 కోట్లు మాత్రమే. అదే హైదరాబాద్ సిటీ జోన్ పరిధిలో మార్చిలో రూ. 115 కోట్లు రాగా ఏప్రిల్‌లో రూ. 104 కోట్లే నమోదైంది. కరీంనగర్ జోన్ పరిధిలో మార్చిలో రూ. 136 కోట్ల ఆదాయం వస్తే ఏప్రిల్‌లో రూ. 130 కోట్లకు తగ్గింది.
* డీజిల్ రూపంలో మార్చిలో రూ. 80 కోట్లు ఖర్చు చూపగా.. ఏప్రిల్‌కు అది రూ. 102 కోట్లకు పెరిగింది. డీజిల్ ఖర్చు పెరిగినా ఆదాయం తగ్గటం గమనార్హం.
* ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే హైదరాబాద్ సిటీ జోన్‌లో రూ. 7.1 కోట్లు, హైదరాబాద్ జోన్‌లో రూ. 3.8 కోట్లు, కరీంనగర్ జోన్ రూ. 3.4 కోట్ల నష్టాలు నమోదయ్యాయి.