Telangana - Andhra Pradesh
-
మనకే ప్రైవేటు మోజు
అస్సాం, బీహార్‌లో కేవలం 30లోపే కర్ణాటకలో ప్రభుత్వ కాలేజీలే అధికం మన దగ్గరే అత్యధికంగా ప్రైవేటు కాలేజీలు ఉమ్మడి ఏపీలో 3,088 హైదరాబాద్: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే మనకే ప్రైవేటు కళాశాలల సోకు ఎక్కువ అని తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేటు కళాశాల అనేదే లేకపోగా, కొన్నింటిలో వేళ్లమీద లెక్కించే సంఖ్యలో ఉన్నాయి. అయితే, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం వాటి హవా కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ప్రైవేటు కళాశాలల కనుసన్నల్లోనే విద్యా వ్యవస్థ నడుస్తోంది. ప్రభుత్వ కళాశాలల కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఇక్కడ ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చితే ఇక్కడే అత్యధికంగా 3,088 ప్రైవేటు కాలేజీలు ఉండటం గమనార్హం. ఇక ఎక్కువ ప్రభుత్వ కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, రెండోస్థానంలో గుజరాత్, మూడో స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కలిపి నాలుగో స్థానంలో ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక్క ప్రైవేటు విద్యాసంస్థ లేకపోగా చండీగఢ్, డయ్యు-డామన్, మిజోరంలలో ఒక్కటి చొప్పున మాత్రమే ఉన్నాయి. ఈ వాస్తవాలను మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్వీయ సర్వేలే స్పష్టం చేస్తున్నాయి. త్వరలో విడుదల కానున్న ఓ అధికారిక సర్వేలోని ప్రధాన అంశాలు.. దేశవ్యాప్తంగా 642 విశ్వ విద్యాలయాలు ఉంటే గత డిసెంబర్ 31వ తేదీ నాటికి 601 విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోని కాలేజీల వివరాలను అందించాయి. వాటితోపాటు 300 స్పెషలైజ్డ్ వర్సిటీలు, అందులో 83 సాంకేతిక విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీల లెక్కల ప్రకారం..తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లో 3,088 ప్రైవేటు కాలేజీలు ఉంటే అస్సాం, బీహార్‌లో 30 లోపే ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ కాలేజీలు అత్యధికంగా కర్ణాటకలో 667 ఉండడం విశేషం. బీహార్‌లో మొత్తంగా 549 కాలేజీలు ఉంటే అక్కడ ప్రైవేటు కాలేజీలు కేవలం 32 మాత్రమే.దేశంలో 58% కాలేజీలు పూర్తిగా ప్రైవేటు కాగా 15% ఎయిడెడ్ కాలేజీలు. ఇక ప్రభుత్వ కాలేజీలు 27శాతమే.ఇందులో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో 85 శాతానికి పైగా కాలేజీలు ప్రైవేటువే. అదే ఈ రాష్ట్రాల తరహాలో పెద్ద రాష్ట్రాలైన బీహార్‌లో 6%, అస్సాంలో 10% మాత్రమే ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి.18-23 ఏళ్ల వయసు వారు ఉన్న ప్రతి లక్ష మంది జనాభాకు బీహార్‌లో 6 కాలేజీలు ఉంటే, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లో 30కి పైగా కళాశాలలు ఉన్నాయి.ఇలా అత్యధిక కాలేజీలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. -
సంక్షోభం అంచున ఎర్రబస్సు!
భారీ నష్టాల మధ్య ఆవిర్భవించనున్న టీఎస్ఆర్టీసీ 2013-14లో రూ. 210 కోట్ల నష్టాలు ప్రభుత్వం ఆదుకోవాలంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద రోడ్డు రవాణా సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతోంది. వరుస నష్టాలతో ఏటేటా మరింతగా కునారిల్లుతోంది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం ఉమ్మడి రవాణా సంస్థగా కొనసాగుతున్న ఏపీఎస్ ఆర్టీసీ మరికొద్ది రోజుల్లో విభజన కానున్న దశలో... రికార్డు స్థాయి నష్టాలను మూటగట్టుకుని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. త 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా వస్తున్న నష్టాలు.. గుదిబండగా మారనున్నాయి. ఇటీవలి మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనే తెలంగాణకు సంబంధించిరూ. 210 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం తొలి మాసం ఏప్రిల్‌లోనే రూ. 14.5 కోట్ల నష్టాలతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వం పట్టించుకోకుంటే సంస్థ కుప్పకూలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చార్జీలు పెంచకుండానే.. ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవాలంటూ యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నష్టాల నుంచి కొంతమేర అయినా కోలుకోవాలంటే టికెట్ చార్జీలను 10శాతం వరకు పెంచేందుకు అనుమతివ్వాలని కోరింది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చార్జీలు పెంచేందుకు సుముఖంగా లేరు. ఆర్టీసీని గట్టెక్కించాలంటే టికెట్ చార్జీల పెంపు మాత్రమే పరిష్కారం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంధన వ్యయం, మోటారు వాహనాల పన్ను విషయంలో ప్రభుత్వం ఆదుకుంటే పరిస్థితి అదుపులోకి వస్తుందని చెబుతున్నారు. దీంతోపాటు సరైన పర్యవేక్షణ లేకపోవటంతో కొన్నేళ్లుగా ఆర్టీసీలో ఖర్చుల పద్దు గతి తప్పుతోందని, దీనిపై లోతుగా విశ్లేషిస్తే నియంత్రణలోకి వచ్చే అవకాశముందని అంటున్నారు. ‘‘సిబ్బంది జీతభత్యాలతో పాటు డీజిల్ ఖర్చు పెరుగుతోంది. పొదుపు చర్యలు లేకపోవటం, బస్సులు సరైన కండిషన్లో ఉండకపోవటం, డ్రైవర్లకు పునశ్చరణ శిక్షణ లోపించటంతో ఇంధనం వృథా కావడం, కార్యాలయాల నిర్వహణ పేర చూపుతున్న భారీ వ్యయం, తరుగుదల, వడ్డీలు, చిల్లర ఖర్చువంటివి కూడా ఉన్నాయంటున్నారు. * 2013-14 ఆర్థిక సంవత్సరంలో టీఎస్ఆర్టీసీ రూ. 3,742 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఇది అంతకుముందు ఏడాది కంటే రూ. 335 కోట్లు మాత్రమే ఎక్కువ. అదే 2013-14 సంవత్సరంలో వ్యయాన్ని రూ. 3,950 కోట్లుగా చూపారు. ఇది ముందటి ఏడాది కంటే రూ. 537 కోట్లు ఎక్కువ. అంటే నష్టం మరింత పెరిగిందన్న మాట. * ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల (ఏప్రిల్)లో అంతకు ముందు నెల (మార్చి) కంటే ఆదాయం తగ్గిపోయింది. హైదరాబాద్ జోన్ పరిధిలో మార్చిలో రూ. 97 కోట్ల ఆదాయం వస్తే ఏప్రిల్‌లో అది రూ. 92 కోట్లు మాత్రమే. అదే హైదరాబాద్ సిటీ జోన్ పరిధిలో మార్చిలో రూ. 115 కోట్లు రాగా ఏప్రిల్‌లో రూ. 104 కోట్లే నమోదైంది. కరీంనగర్ జోన్ పరిధిలో మార్చిలో రూ. 136 కోట్ల ఆదాయం వస్తే ఏప్రిల్‌లో రూ. 130 కోట్లకు తగ్గింది. * డీజిల్ రూపంలో మార్చిలో రూ. 80 కోట్లు ఖర్చు చూపగా.. ఏప్రిల్‌కు అది రూ. 102 కోట్లకు పెరిగింది. డీజిల్ ఖర్చు పెరిగినా ఆదాయం తగ్గటం గమనార్హం. * ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే హైదరాబాద్ సిటీ జోన్లో రూ. 7.1 కోట్లు, హైదరాబాద్ జోన్లో రూ. 3.8 కోట్లు, కరీంనగర్ జోన్ రూ. 3.4 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. -
విడిపోయినా కలిసుందాం
అలంపూర్, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకొని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న టోల్‌ప్లాజా వద్ద ఆది, సోమవారాల్లో సంబరాల హోరు వినిపించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు సంయుక్తంగా టోల్‌ప్లాజా వద్ద సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో కర్నూలు విద్యా సంస్థలకు చెందిన పలువురు అక్కడికి చేరుకొని సంబరాలకు సంఘీభావం తెలిపి ఎమ్మెల్యేకు, టీఆర్ఎస్ నాయకులకు పుష్పగుచ్చాలు, గులాబీలను అందజేసి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అందరం స్నేహ, సోదరాభావంతో మెలుగుదామని ఆకాంక్షిం చారు. రెండు రాష్ట్రాలకు చెందిన స్వాగత ఫ్లెక్సీలతో ర్యాలీగా కదిలివచ్చి స్నేహ బంధాన్ని చాటారు. స్వాగత బోర్డులు తెలంగాణ-రాయలసీమకు సరిహద్దుగా ఉన్న పుల్లూరు చెక్‌పోస్టు సమీపంలో సోమవారం రాష్ట్రాలకు స్వాగత బోర్డులు ఏర్పాటు చేశారు. అధికారులే అధికారికంగా తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం బోర్డు నెలకొల్పారు. మా నవపాడు తహశీల్దార్ కార్యాలయం నుంచి ఈ బోర్డును తెప్పించి పెట్టించారు. అదేవిధంగా కర్నూలు జిల్లాకు చెందిన విద్యా సంస్థల నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దోమలపెంటలో.. అచ్చంపేట : తెలంగాణకు సరిహద్దుగా ఉన్న పాతాళగంగ వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ కొత్త రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. దోమలపెంట, ఈగలపెంట, పాతళగంగా వద్ద ప్రజలు ఆది, సోమవారాల్లో సంబురాలు జరుపుకున్నారు. అర్ధరాత్రి సరిహద్దులో బాణసంచా పేల్చి కొత్త రాష్ట్రానికి స్వాగతం పలికారు. అనంతరం కేక్‌లు కట్ చేశారు. ఇక్కడి ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేశారు.