
మనకే ప్రైవేటు మోజు
అస్సాం, బీహార్‌లో కేవలం 30లోపే
కర్ణాటకలో ప్రభుత్వ కాలేజీలే అధికం
మన దగ్గరే అత్యధికంగా ప్రైవేటు కాలేజీలు ఉమ్మడి ఏపీలో 3,088
హైదరాబాద్: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే మనకే ప్రైవేటు కళాశాలల సోకు ఎక్కువ అని తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేటు కళాశాల అనేదే లేకపోగా, కొన్నింటిలో వేళ్లమీద లెక్కించే సంఖ్యలో ఉన్నాయి. అయితే, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం వాటి హవా కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ప్రైవేటు కళాశాలల కనుసన్నల్లోనే విద్యా వ్యవస్థ నడుస్తోంది. ప్రభుత్వ కళాశాలల కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఇక్కడ ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చితే ఇక్కడే అత్యధికంగా 3,088 ప్రైవేటు కాలేజీలు ఉండటం గమనార్హం. ఇక ఎక్కువ ప్రభుత్వ కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, రెండోస్థానంలో గుజరాత్, మూడో స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కలిపి నాలుగో స్థానంలో ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక్క ప్రైవేటు విద్యాసంస్థ లేకపోగా చండీగఢ్, డయ్యు-డామన్, మిజోరంలలో ఒక్కటి చొప్పున మాత్రమే ఉన్నాయి. ఈ వాస్తవాలను మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్వీయ సర్వేలే స్పష్టం చేస్తున్నాయి. త్వరలో విడుదల కానున్న ఓ అధికారిక సర్వేలోని ప్రధాన అంశాలు..
దేశవ్యాప్తంగా 642 విశ్వ విద్యాలయాలు ఉంటే గత డిసెంబర్ 31వ తేదీ నాటికి 601 విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోని కాలేజీల వివరాలను అందించాయి. వాటితోపాటు 300 స్పెషలైజ్డ్ వర్సిటీలు, అందులో 83 సాంకేతిక విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీల లెక్కల ప్రకారం..తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లో 3,088 ప్రైవేటు కాలేజీలు ఉంటే అస్సాం, బీహార్‌లో 30 లోపే ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ కాలేజీలు అత్యధికంగా కర్ణాటకలో 667 ఉండడం విశేషం.
బీహార్‌లో మొత్తంగా 549 కాలేజీలు ఉంటే అక్కడ ప్రైవేటు కాలేజీలు కేవలం 32 మాత్రమే.దేశంలో 58% కాలేజీలు పూర్తిగా ప్రైవేటు కాగా 15% ఎయిడెడ్ కాలేజీలు. ఇక ప్రభుత్వ కాలేజీలు 27శాతమే.ఇందులో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో 85 శాతానికి పైగా కాలేజీలు ప్రైవేటువే. అదే ఈ రాష్ట్రాల తరహాలో పెద్ద రాష్ట్రాలైన బీహార్‌లో 6%, అస్సాంలో 10% మాత్రమే ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి.18-23 ఏళ్ల వయసు వారు ఉన్న ప్రతి లక్ష మంది జనాభాకు బీహార్‌లో 6 కాలేజీలు ఉంటే, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లో 30కి పైగా కళాశాలలు ఉన్నాయి.ఇలా అత్యధిక కాలేజీలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి.