
విడిపోయినా కలిసుందాం
అలంపూర్, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకొని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న టోల్‌ప్లాజా వద్ద ఆది, సోమవారాల్లో సంబరాల హోరు వినిపించింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు సంయుక్తంగా టోల్‌ప్లాజా వద్ద సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో కర్నూలు విద్యా సంస్థలకు చెందిన పలువురు అక్కడికి చేరుకొని సంబరాలకు సంఘీభావం తెలిపి ఎమ్మెల్యేకు, టీఆర్‌ఎస్ నాయకులకు పుష్పగుచ్చాలు, గులాబీలను అందజేసి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అందరం స్నేహ, సోదరాభావంతో మెలుగుదామని ఆకాంక్షిం చారు. రెండు రాష్ట్రాలకు చెందిన స్వాగత ఫ్లెక్సీలతో ర్యాలీగా కదిలివచ్చి స్నేహ బంధాన్ని చాటారు.
స్వాగత బోర్డులు
తెలంగాణ-రాయలసీమకు సరిహద్దుగా ఉన్న పుల్లూరు చెక్‌పోస్టు సమీపంలో సోమవారం రాష్ట్రాలకు స్వాగత బోర్డులు ఏర్పాటు చేశారు. అధికారులే అధికారికంగా తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం బోర్డు నెలకొల్పారు. మా నవపాడు తహశీల్దార్ కార్యాలయం నుంచి ఈ బోర్డును తెప్పించి పెట్టించారు. అదేవిధంగా కర్నూలు జిల్లాకు చెందిన విద్యా సంస్థల నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
దోమలపెంటలో..
అచ్చంపేట : తెలంగాణకు సరిహద్దుగా ఉన్న పాతాళగంగ వద్ద టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ కొత్త రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. దోమలపెంట, ఈగలపెంట, పాతళగంగా వద్ద ప్రజలు ఆది, సోమవారాల్లో సంబురాలు జరుపుకున్నారు. అర్ధరాత్రి సరిహద్దులో బాణసంచా పేల్చి కొత్త రాష్ట్రానికి స్వాగతం పలికారు. అనంతరం కేక్‌లు కట్ చేశారు. ఇక్కడి ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేశారు.