న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా మెక్వారీ ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌కి (ఎంఏఐఎఫ్) ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లోని టోల్ రహదారుల పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ. 3,110 కోట్లుగా ఉంటుందని పేర్కొంది. ఈ రహదారులు పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్నాయని వివరించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ అదానీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (ఏఆర్‌టీఎల్) ద్వారా ఈ డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపింది.
‘గుజరాత్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ (జీఆర్‌ఐసీఎల్), స్వర్ణ టోల్‌వే (ఎస్‌టీపీఎల్)ను కొనుగోలు చేసేందుకు ఏఆర్‌టీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది‘ అని అదానీ గ్రూప్ వెల్లడించింది. ఎంఏఐఎఫ్‌కు జీఆర్‌ఐసీఎల్‌లో 56.8 శాతం, ఎస్‌టీపీఎల్‌లో 100 శాతం వాటాలు ఉన్నాయి. ఈ వాటాలను ఏఆర్‌టీఎల్ పూర్తిగా కొనుగోలు చేస్తోంది. అలాగే జీఆర్‌ఐసీఎల్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కి ఉన్న మిగతా వాటాలను కూడా దక్కించుకునే అంశాన్ని కూడా పరిశీలించనుంది. 2022 సెప్టెంబర్‌లో ఈ లావాదేవీ పూర్తి కాగలదని అదానీ తెలిపింది.
ఏపీ, గుజరాత్‌లో రెండు రహదారులు..
ఎస్‌టీపీఎల్‌కు ఆంధ్రప్రదేశ్‌లో రెండు టోల్ రోడ్‌లు ఉన్నాయి. ఒకటి నేషనల్ హైవే 16పై తడ నుంచి నెల్లూరు (110 కి.మీ.) వరకూ, మరొకటి నేషనల్ హైవే 65పై నందిగామ నుంచి ఇబ్రహీంపట్నం- విజయవాడ వరకూ(48 కి.మీ.) ఉంది. అటు జీఆర్‌ఐసీఎల్‌కు కూడా గుజరాత్‌లో రెండు టోల్ రోడ్‌లు ఉన్నాయి. ఒకటి అహ్మదాబాద్ నుంచి మెహ్‌సానా వరకూ(51.6 కి.మీ.), రెండోది వదోదర నుంచి హలోల్ వరకూ(31.7 కి.మీ.) ఉన్నాయి.
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 76 శాతం జంప్‌చేసి రూ. 469 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 266 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 12,579 కోట్ల నుంచి 3 రెట్లుపైగా ఎగసి రూ. 41,066 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment