భారతదేశ తీర రేఖ పొడవు 11,098.81 కి.మీ.
కేంద్ర జలసంఘం తాజా అధ్యయనంలో వెల్లడి
గత అధ్యయనం ప్రకారం దేశ తీర రేఖ పొడవు 7,516.6 కి.మీ.
ఎక్కువ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల్లో గుజరాత్ ఫస్ట్
రెండో స్థానానికి చేరిన తమిళనాడు.. మూడో స్థానంలో ఏపీ
కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి స్థానంలో అండమాన్ నికోబార్ దీవులు
తీర ప్రాంతం అత్యధికంగా కోతకు గురవుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఫస్ట్
నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో కోతకు గురైన తీర ప్రాంతం 272.34 కి.మీ.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ఎన్ని కిలో మీటర్లు అని అడిగితే... 973.7 కిలో మీటర్లు అని వెంటనే చెప్పేస్తారు. కానీ.. అది గతం.. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఏపీ తీర రేఖ పొడవు 1,027.58 కిలో మీటర్లు అని తేల్చింది.
గత అధ్యయనం ప్రకారం దేశ పశ్చిమ, తూర్పు తీర రేఖ పొడవు 7,516.6 కిలో మీటర్లు కాగా.. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో అది 11,098.81 కిలో మీటర్లుగా తేలింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దేశంలో తీర ప్రాంతంపై సీడబ్ల్యూసీ విస్తృతంగా అధ్యయనం చేసి పలు కీలక విషయాలు వెల్లడించింది.
2,31,831 కిలో మీటర్ల మేర కోత
» దేశంలో ఇప్పటికే 2,318,31 కిలో మీటర్ల పొడవునా తీరం కోతకు గురైందని కేంద్ర జలసంఘం తేల్చింది. మరో 1,855.02 కిలో మీటర్ల పొడవునా తీర ప్రాంతం కోతకు గురవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని తీర ప్రాంతం అధికంగా కోతకు గురవుతోంది. తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతున్న రాష్ట్రాల్లో ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.
» మన రాష్ట్రంలో ఇప్పటికే 272.34 కిలో మీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురైంది. మరో 434.26 కిలో మీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురవుతోంది. 320.98 కిలో మీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురికాకుండా సురక్షితంగా ఉంది. తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో తీర ప్రాంతం అధికంగా కోతకు గురైంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ ప్రాంతంలో తీర రేఖ అధికంగా కోతకు గురైంది.
» వాతావరణ మార్పుల వల్ల సముద్రపు నీటి మట్టం పెరగడం, అలల ఉద్ధృతి తీవ్రమవడం, తుపానులు, అధిక ఉద్ధృతితో నదులు ప్రవాహించడం వల్ల సముద్ర తీర ప్రాంతం కోతకు గురువుతోంది. సహజసిద్ధంగా ఏర్పడిన మడ అడవులను నరికివేయడం, పగడపు దిబ్బలను తవ్వేయడం, సముద్రం నాచును తొలగించడం వల్ల తీర ప్రాంతం భారీ ఎత్తున కోతకు గురికావడానికి దారితీస్తోంది.
» తీర ప్రాంతం అధికంగా కోతకు గురవుతుండటం వల్ల ఉప్పు నీరు చొచ్చుకొస్తోంది. దీంతో తీర ప్రాంతం ఉప్పు నీటి కయ్యలుగా మారుతోంది. తీరం కోతకు గురవడం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.
» తీర ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టకపోతే ఉత్పాతాలు తప్పవని, మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీడబ్ల్యూసీ హెచ్చరించింది. సీ–వాల్(తీరానికి వెంబడి గోడ) నిర్మించడం, రాళ్లతో రివిట్‌మెంట్ చేయడం ఇతర రక్షణ చర్యల ద్వారా, తీర ప్రాంతం కోతకు గురికాకుండా రక్షించవచ్చని సూచించింది. ఏపీలోని ఉప్పాడ ప్రాంతంలో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీ ప్రతిపాదించింది.
సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన ప్రధాన అంశాలు ఇవీ..
» దేశంలో తీర ప్రాంతం పశి్చమాన గుజరాత్‌లోని కచ్ ప్రాంతం నుంచి ప్రారంభమై... తూర్పున పశ్చిమ బెంగాల్‌లోని సుందర్ బన్స్ వద్ద ముగుస్తుంది. తీర ప్రాంతం తొమ్మిది రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశి్చమ బెంగాల్లతోపాటు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు డయ్యూ–డామన్, లక్ష్యద్వీప్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులలో విస్తరించింది.
» 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 15 శాతం తీర ప్రాంతంలో నివసిస్తున్నారు. ముంబయి, కోల్‌కతా, చెన్నై, విశాఖపట్నంతోపాటు 70 నగరాలు, పట్టణాలు తీర ప్రాంతంలో వెలిశాయి.
» తీర రేఖ పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ ప్రథమ స్థానంలో నిలిచింది. గత అధ్యయనం ప్రకారం గుజరాత్ తీర రేఖ పొడవు 1,214.7 కిలో మీటర్లు కాగా... తాజా అధ్యయనం ప్రకారం 2,340.62 కిలో మీటర్లకు పెరిగింది.
» ఇప్పటి వరకు తీర రేఖ పొడవు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉండేది. తాజా అధ్యయనం ప్రకారం తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు తీర రేఖ పొడవు 1,068.69 కిలో మీటర్లు.
» ప్రస్తుతం తీర రేఖ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. గతంలో ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 973.7 కిలో మీటర్లు. ప్రస్తుతం అది 1,027.58 కిలో మీటర్లకు పెరిగింది.
» రాష్ట్రంలో తీర రేఖ పొడవు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి (189.84 కి.మీ.) మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో శ్రీకాకుళం (173.12 కి.మీ.), మూడో స్థానంలో నెల్లూరు (172.10 కి.మీ.) ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment